DailyDose

నయీం రూ.150 కోట్ల ఆస్తుల జప్తునకు ఆదేశాలు

నయీం రూ.150 కోట్ల ఆస్తుల జప్తునకు ఆదేశాలు

కరడుగట్టిన నేరస్థుడు నయీం ఆస్తుల జప్తు ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. బినామీల ద్వారా ఆస్తులు సమకూర్చుకున్నట్లు నిర్ధారించిన సాధికారిక మండలి తొలి విడతగా దాదాపు రూ.150 కోట్ల విలువైన 10 ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఈ ఆస్తులన్నీ ఆదాయపు పన్ను శాఖ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక నేరాలకు పాల్పడ్డ నయీం 2016లో షాద్‌నగర్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అరాచకాలపై దర్యాప్తు జరిపిన పోలీసులు వెయ్యి ఎకరాలకుపైగా కబ్జా చేసినట్లు నిర్ధారించారు. అదే సమయంలో రంగంలోకి దిగిన ఆదాయపు పన్ను శాఖ.. నయీం అమాయకులను బెదిరించి రాయించుకున్న ఆస్తులను బినామీల పేరిట ఉంచుకున్నాడని నిర్ధారణకు వచ్చింది. ఆదాయపు పన్ను శాఖలోని బినామీ ఆస్తుల నిరోధక విభాగం 45 ఆస్తులను గుర్తించింది. వాటిపై సాధికారిక మండలి విచారణ చేపట్టి.. తొలుత 10 ఆస్తులను జప్తు చేసేందుకు ఐటీ శాఖకు అనుమతి ఇచ్చింది.