Agriculture

నాసాలో జాబ్ వ‌దిలేసి.. రైతుల కోసం క‌ష్ట‌ప‌డుతున్నడు

నాసాలో జాబ్ వ‌దిలేసి.. రైతుల కోసం క‌ష్ట‌ప‌డుతున్నడు

ఓ చిన్న పరికరం. అమెరికాలో కొంటే వేల డాలర్లు. భారతదేశంలో అయితే లక్షకుపైగా. అదే ఇప్పుడు పదివేల రూపాయలకే లభిస్తున్నది. వాతావరణం గురించి తెలుసుకోవడానికి రైతు ఇకనుంచి ఆకాశం వైపు చూడాల్సిన పన్లేదు. ఓ చిన్న మీట నొక్కితే చాలు. సమస్త సమాచారం కనిపిస్తుంది, వినిపిస్తుంది. అవసరమైతే హెచ్చరిస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలో లక్షణమైన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి.. ఓ యువకుడు చేసిన అవిష్కరణ ఇది.

రైతు బాగుంటే.. రాజ్యం బాగుంటుంది, ప్రజలూ సంతోషంగా ఉంటారు. మరి, ఆ రైతు బాగుండాలంటే పంటలు పండాలి. అన్నిటికీ మించి ప్రకృతి చల్లగా ఉండాలి. రైతు ఆరుగాలం కష్టపడతాడు. శ్రమకోర్చి, చెమటోడ్చి పెట్టుబడి పెడతాడు. ఒకట్రెండు రోజుల్లో పంట ఇంటికి చేరుతుందని అనుకుంటున్న సమయంలో ఏ తుఫానో వచ్చి సమస్తం తుడిచేసి పోతుంది. దీంతో రైతు దీనంగా కూర్చుంటాడు. కొన్నిసార్లు గిట్టుబాటు ధర లేక గిలగిలా కొట్టుకుంటాడు. ఇంకొన్నిసార్లు ఏ పిడుగుపాటుకో పంట బూడిదైపోతుంది. ఒకటిరెండు దెబ్బలైతే తట్టుకుంటాడు. వరుస గాయాలు ఆ బక్కమనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇక సేద్యానికి శాశ్వతంగా రాజీనామా చేస్తాడు. అదే జరిగితే.. ఆకలి చావులే!

ముప్పును ముందస్తుగా..
వాతావరణంలో తీవ్ర మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు వంటి ఉత్పాతాల గురించి రైతుకు ముందుగా తెలియజేయడమే ఈ సమస్యకు పరిష్కారం. ఈ సమాచారాన్ని అందించడానికిగాను వాతావరణ, విపత్తు నిర్వహణ, వ్యవసాయ శాఖలు ఉన్నాయి. కానీ, ఆ అంచనాలు చాలాసార్లు తల్లకిందులు అవుతున్నాయి. రైతు కూడా ఆ వ్యవస్థలపై నమ్మకం కోల్పోయాడు. ఇలాంటి సమయంలో విశ్వసనీయత కలిగిన ఓ తోడు కావాలి. అప్పుడే రైతు పంట నష్టాన్ని తగ్గించుకొంటాడు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతాడు. మహారాష్ట్రలో నాసిక్‌కు చెందిన పరాగ్‌ నార్వేకర్‌ అభిప్రాయమూ ఇదే.
st-AMP-jpg1
నాసాకు గుడ్‌బై..
2003లో ఐఐటీ- బాంబే నుంచి ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీలో పీజీ చేసిన పరాగ్‌ నాసాలో ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం, డేటా ప్రాసెసింగ్‌ విభాగాల్లో పనిచేశాడు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అని భావించి, 2016లో నాసాకు గుడ్‌బై చెప్పాడు. తన స్టార్టప్‌కు రూపమిచ్చే క్రమంలో పరాగ్‌ నాసా, ఐఐటీ- బాంబే, ఇస్రో, ఐఐఎస్సీ, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, జపాన్‌ ఏరోస్పేస్‌.. శాస్త్రవేత్తల సహకారం తీసుకున్నాడు. సెన్సార్‌టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా తక్కువ ఖర్చులో రైతులకు కీలకమైన సమాచారాన్ని అందించే వాతావరణ కేంద్రాన్ని నిర్మించాడు. ‘సహ్యాద్రి ఫార్మ్స్‌’లో చేపట్టిన ప్రయోగాత్మక వినియోగం సత్ఫలితాలను ఇచ్చింది. రైతులు ఉమ్మడిగా దీనిని అమర్చుకొనే అవకాశమూ ఉంది. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకొంటే సరిపోతుంది. దాదాపు వంద రైతు బృందాలు ఇప్పటికే వాడుతున్నాయి. మరో 250 మంది ఆర్డర్‌ చేశారు. ఈ తరహా సెన్సర్లను కొనాలంటే గతంలో లక్ష రూపాయలకు పైగా ఖర్చుపెట్టాల్సి వచ్చేది. పరాగ్‌ కేవలం పదివేల రూపాయలకే అందిస్తున్నాడు. ఈ సాంకేతికత సమాచారానికే పరిమితం కాదు. వాతావరణ పరిస్థితులను బట్టి, నేల స్వభావాన్ని బేరీజు వేసి, చీడపీడల తీవ్రతను పసిగట్టి.. ఏ సమయంలో ఏ పంటవేయాలి, ఏ దశలో ఏ మందు పిచికారీ చేయాలి.. తదితర సూచనలనూ అందిస్తుంది. ‘అమెరికాలో ఈ సాంకేతికత సామాన్య రైతులకూ అందుబాటులో ఉంది. మన దగ్గర మాత్రం ఇప్పటికీ వ్యవసాయమంటే రుతుపవనాలతో పేకాటే’ అంటారు పరాగ్‌. నీ లాంటి ఆంత్రప్రెన్యూర్స్‌ చొరవతో ఆ పరిమితుల్ని అధిగమించే రోజు ఎంతోదూరం లేదు పరాగ్‌!

ఆపరేషన్‌ ‘సెన్సార్టిక్స్‌’
పరాగ్‌ నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా)లో పన్నెండేండ్లు సేవలందించాడు. కరువు, వరదలు, వడగండ్లు, చీడపీడలు వంటి సమస్యలకు ఆధునిక సాంకేతికత ద్వారా పరిష్కారం చూపాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో నాసాను వదిలేసి నాసిక్‌ వచ్చాడు. ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యే అనిశ్చిత వాతావరణ పరిస్థితులను అధిగమించేందుకు ‘సెన్సార్టిక్స్‌’ అనే స్టార్టప్‌ ప్రారంభించాడు. ఉపగ్రహాల ద్వారా సమాచారాన్ని సేకరించి డీకోడ్‌ చేస్తారిక్కడ. నేల రకం, పంట, తేమ, నీటి నిర్వహణ, పోషకాల నిర్వహణ, గాలి దిశ, కిరణజన్య సంయోగక్రియ వంటి వివరాల సాయంతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు.