DailyDose

గోవా వెళ్తున్నారా? అక్క‌డ త‌క్కువ ధ‌ర‌లో దొరికే ల‌గ్జ‌రీ విల్లాలు ఇవే..

గోవా వెళ్తున్నారా? అక్క‌డ త‌క్కువ ధ‌ర‌లో దొరికే ల‌గ్జ‌రీ విల్లాలు ఇవే..

సమ్మర్‌ వెకేషన్‌కు గోవా వెళ్తున్నారా? పసిడి అందాల ఇసుక, ధగధగ మెరిసే నీలి జలాలు.. పచ్చ పచ్చని వరి పొలాలు, ఒంపు సొంపుల కొబ్బరిచెట్లు.. ఇండో-పోర్చ్‌గీస్‌ వాస్తులో నిర్మించిన అతిథి గృహాలు మనకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఏ విడిది బాగుంటుంది? ఎంత చార్జ్‌ చేస్తారు? వాటి ప్రత్యేకతలు ఏమిటి? తదితర వివరాలు మీ కోసం..

*ఆర్కో ఐరిస్‌ బొటిక్‌ హోమ్‌స్టే
గోవాలోని కర్టోరిమ్‌లో ఉందీ రెండువందల ఏండ్లనాటి పోర్చుగీసు కట్టడం. మొత్తం 1.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. జువారీ నదికి కూతవేటు దూరం. పోర్చుగీసు భాషలో ఆర్కోఐరిస్‌ అంటే ‘ఇంద్ర ధనస్సు’ అని అర్థం. పేరుకు తగినట్టే రంగురంగుల్లో ఐదు విశాలమైన గదులు ఉన్నాయి. ఒక రాత్రి బస చేయడానికి రూ.6000కు పైగా చార్జ్‌ చేస్తారు.

*కాపెల్లా ఫారెస్ట్‌ రిట్రీట్‌
శివార్లలోని గ్రామీణ ప్రాంతంలో ఉంది. కొండపై మూడు గదులతో నిర్మించారు. కుటుంబంతో వచ్చేవారికి మంచి హోమ్‌స్టే స్పాట్‌. విలాసవంతమైన ఈ భవంతి పచ్చదనానికి చిరునామా. ప్రకృతిని ప్రేమించేవారికి సరైన ఎంపిక. ఇక్కడి నుంచి ఐదు నిమిషాల్లో వివిధ బీచ్‌లకు వెళ్లొచ్చు. కాపెల్లాలో స్టే చేయడానికి ఒక రాత్రికి రూ.5000 చెల్లించాలి.

*కాసా మెనెజస్‌
గోవా రాజధాని పంజిమ్‌ నుంచి 13 కిలో మీటర్లు. చుట్టూ పచ్చదనం ఆవరించి ఉంటుంది. ‘డిమెనెజెస్‌’ కుటుంబానికి చెందిన 300 ఏండ్లనాటి ఇల్లు ఇది. టేకు, ఓక్‌, రోజ్‌వుడ్‌తో తీర్చిదిద్దిన ఇంటీరియర్స్‌ దీని ప్రత్యేకత. ఒక పూటకు రూ. 6000 చార్జ్‌ చేస్తారు.

*పెరీరాస్‌ గోవన్‌ విల్లా
వాస్కోడగామాలోని పెరారీస్‌ గోవన్‌ విల్లా ఓ సొగసైన కట్టడం. గోవా, భారతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయి.

*ఓ అబ్రిగో
పంజిమ్‌లో ఇంకా మిగిలి ఉన్న కొన్ని పాత భవంతులలో ఇదొకటి. అడుగడుగునా కళాఖండాలే. హైస్పీడ్‌ వైఫై, ఇతర సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కరాత్రి ఉండాలంటే రూ. 3,200 చార్జ్‌ చేస్తారు.

*బెర్తాస్‌ రివర్‌వ్యూ
ఉత్తర గోవాలోని రెండు వందల సంవత్సరాలనాటి ఇల్లు ఇది. సరదాగా చేపలు పట్టాలనుకునేవారికి ఓ మంచి అవకాశం. స్టే చేయాలంటే పూటకు రూ. 2,200 చెల్లించాలి.

*కాన్సియోస్‌ హౌస్‌
ఈ ఇల్లు ఉత్తర గోవాలోని అల్డోనాలో ఉంది. 500 విశాలమైన గదులు, పురాతన ఫర్నిచర్‌ దీని ప్రత్యేకత. పక్కా గోవా వంటకాలు లభిస్తాయి. ఇవే కాదు.. ఓలాలిమ్‌ బ్యాక్‌యార్డ్స్‌, మిస్‌ జెన్నీస్‌ హోమ్‌స్టే, మంగాళ్‌ ఫార్మ్‌స్టే, దూద్‌సాగర్‌ ఫామ్‌ స్టే, కాసా సుసేగడ్‌ – ప్రతి భవంతీ దేనికదే ప్రత్యేకం. అతిథులకు మరపురాని యాత్రానుభూతిని మిగులుస్తాయి.