DailyDose

మైనింగ్ మాఫియా బాధితుడిపైనే కేసులా – TNI తాజా వార్తలు

మైనింగ్ మాఫియా బాధితుడిపైనే కేసులా  – TNI తాజా వార్తలు

*ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ ఆర్‌ఐ మీద కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. మైనింగ్ మాఫియా బాధితుడిపైనే కేసులేంటని ప్రశ్నించారు. రెవెన్యూ, గనుల శాఖ అధికారులు మౌనంగా సరికాదన్నారు. మైనింగ్ మాఫియా బాధితుడైన గుడివాడ ఆర్‌ఐ అరవింద్‌పై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తూ.. తెలుగుదేశం నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు నమోదు చేశారంటే మైనింగ్ మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోందని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడి… రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్ట్ చేయకుండా.. బాధితుడైన ఆర్ఐపై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. బాధితుడిపై కేసు నమోదు చేయడమంటే ప్రజల్లో పోలీసులపై నమ్మకం సన్నగిల్లేటట్లు చేయడమేనని పేర్కొన్నారు. పోలీసుల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మొత్తం వ్యవస్థను నాశనం చేసేలా నేరగాళ్లను కాపాడుతున్నారని విమర్శించారు. రెవెన్యూ, గనుల శాఖ అధికారులు.. దీనిపై మౌనం వహించడంపై కారణాలు వారికే తెలియాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.

*ఏపీలో టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ పర్వం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజీ కలకలం రేపుతోంది. సరుబుజ్జిలి మండలంలోని రొట్ట వలస, సలంత్రీ పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.కాగా నిన్న పలు కేంద్రాల్లో తెలుగు పరీక్షా పత్రం లీక్ అయింది. అయితే ఇది పేపర్ లీక్ కాదని, మాల్ ప్రాక్టీస్ అని విద్యాశాఖ అధికారులు సర్దిచెప్పారు. ఘటనకు సంబంధించిన వారిని అరెస్టు చేశామని సింపుల్‌గా తేల్చేశారు. అయితే ఒక్కచోట పేపర్ లీక్ అయితే ఏదో పొరపాటు అనుకోవచ్చు. కానీ అనేక చోట్ల ఒకేసారి పేపర్ లీక్ కావడాన్ని పొరపాటుగా చూడలేమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*ఆదేశించిన వెంటనేభీకరస్వల్పకాలిక యుద్ధాలకు భారత వాయు సేన (ఐఏఎఫ్) సిద్ధంగా ఉండవలసిన అవసరాన్ని ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు సృష్టిస్తున్నాయని ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి చెప్పారు. గురువారం ఆయన ఓ సెమినార్‌లో మాట్లాడుతూచిన్న చిన్న ఆకస్మిక యుద్ధాలకు సిద్ధమవడం అవసరమన్నారు. మరోవైపు తూర్పు లడఖ్‌లో ఏర్పడిన దీర్ఘకాలిక ప్రతిష్టంభన వంటివాటికి కూడా సిద్ధమవాలన్నారు.
*ఎమ్మెల్యే సమావేశానికి డ్వాక్రా మహిళలు హాజరు కావాలని వెలుగు ఏపీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిర్వహించే సమావేశానికి డ్వాక్రా మహిళలు హాజరు కావాలంటూ వెలుగు ఏపీఎం హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే సమావేశానికి రాకపోతే సంక్షేమ పథకాలు రావని ఆడియోలో మహిళలను బెదిరించారు. వెలుగు ఏపీఎం సరిత ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆదేశాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*పవిత్ర రంజాన్ సందర్భంగా ఈనెల 29న ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈమేరకు ఎల్బిస్టేడియంలో పెద్దయెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.మంత్రి తలసానితో పాటు హోంశాఖ మంత్రి మహమూద్అలీ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం లు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నిమతాల పండగలను ప్రభుత్వం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగలా ఇఫ్లార్ విందును ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

*తార్నాక టీఎస్ ఆర్టీసీ ఆసుపత్రి ప్రాంగణంలో నర్సింగ్ కళాశాలను రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 50 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ ప్రారంభమైందన్నారు. ఆర్టీసీని కాపాడుకోవటమే ప్రభుత్వ లక్ష్యమని, ఆర్టీసీ హాస్పిటల్‌.. కార్పొరేట్ హాస్పిటల్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే ఏడాది 100 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి పువ్వాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

*ఏపీ టూరిజం మంత్రి రోజా గురువారం ఉదయం బాపు మ్యూజియంను సందర్శించారు. పింగళి వెంకయ్య విగ్రహానికి మంత్రి పూలమాల సమర్పించారు. అనంతరం బాపు మ్యూజియంలో ప్రాక్, చారిత్రక యుగ గ్యాలరీ, బుద్ధ జైన్ గ్యాలరీ, హిందూ శిల్పకళా గ్యాలరీ, నాణ్యము లు, టెక్స్ టైల్ గ్యాలరీ, ఆయుధాలు కవచాలు గ్యాలరీని రోజా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బాబు మ్యూజియంను చూస్తే ఫారెన్ కంట్రీలో మ్యూజియంను చూసినట్లు అనిపిస్తుందన్నారు. ముందు తరాలు వారు వాడిన సంస్కృతి మనకు చూపించేందుకు వాణిమోహన్ చాలా కృషి చేశారని కొనియాడారు. రూ.12,800 కోట్లతో జగనన్న ప్రభుత్వం దీనిని ఆధునీకరించారన్నారు. చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే కచ్చితంగా బాపు మ్యూజియానికి రావాలని మంత్రి అన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు వెళ్లే వాళ్లకి ఇక్కడ చరిత్రని చూపిస్తే చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. 360 డిగ్రీ స్క్రీన్ రెడీ అవబోతుందని, ఆదిమానవుల చరిత్రను తెలుసుకునే విధంగా దీన్ని రెడీ చేస్తున్నామన్నారు. స్కూల్ పిల్లలకు టూర్స్ పెట్టేలాగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో సంప్రదింపులు చేస్తానని మంత్రి రోజా వెల్లడించారు.

*కారెక్కడానికి మరో జిల్లా కలెక్టర్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణకు కొన్ని నెలల ముందు అప్పటి సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి గులాబీ కండువా కప్పుకొని పెద్దల సభలో అడుగుపెట్టగా.. ఆయన బాటలో నడిచేందుకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్‌. శర్మన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు నెలల్లో రిటైర్‌ కానున్న శర్మన్‌.. రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారైనట్లు తెలిసింది.కలెక్టర్‌ హోదాలో క్షేత్ర స్థాయిలో జనం సమస్యలు తెలుసుకునేందుకు నిత్యం బస్తీలు, మురికివాడల్లో మోటార్‌ సైకిల్‌పై పర్యటించే ఆయన.. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు సరైన వేదికని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ తీర్థం తీసుకొని రిజర్వ్‌డ్‌ స్థానాలైన ఆదిలాబాద్‌ లోక్‌సభ లేదా ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం.రిక వార్తలపై ఆయన స్పందిస్తూ.. రిటైర్‌మెంట్‌కు రెండు నెలలు సమయం ఉంది కదా అని దాటవేస్తున్నారు. ఆ తర్వాత ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. శర్మన్‌ గ్రూప్‌–1 అధికారిగా చేరి ఐఏఎస్‌ అయ్యే వరకు వివిధ పోస్టులు నిర్వర్తించారు. జీహెచ్‌ఎంసీ అదనపు కార్యదర్శిగా, మహబూబ్‌నగర్‌ జేసీగా, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌గా పనిచేశారు.

*జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు శాఖలో మార్పులు జరుగనున్నాయి. కొత్తగా భీమవరం పోలీస్‌ సబ్‌డివిజన్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన జిల్లాలో ఇప్పటికే ఉన్న నరసాపురం పోలీస్‌ సబ్‌డివిజన్‌తో పాటు భీమవరం సబ్‌ డివిజన్‌ ఏర్పాటుకానుంది. దీంతో పోలీసు శాఖలో పాలనపరమైన ఇబ్బందులు తొలగుతాయని అధికారులు చెబుతున్నారు.ప్రస్తుతం ఓ రెవెన్యూ మండలంలోని గ్రామం మరో మండలంలోని పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని మార్చాలనే డిమాండ్‌ ఏళ్ల తరబడి ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొ త్తగా పోలీస్‌ సబ్‌డివిజన్‌ ఏర్పాటు చేయనుండటంతో స్టేషన్ల పరిధిని సవరించే ఆలోచన ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

*ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న రెండు వేర్వేరు ముఠాలకు చెందిన ఆరుగురిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.75 లక్షల నగదు, బెట్టింగ్‌ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా జోరుగా బెట్టింగ్‌ సాగుతోందని సమాచారం అందింది. అప్రమత్తమైన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. చిలకలగూడ పోలీసులతో కలిసి జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద ఓ ఇంట్లో బెట్టింగ్‌ సాగుతోందని గుర్తించి దాడులు నిర్వహించారు. ప్రధాన నిర్వాహకుడు, చిలకలగూడ నివాసి సాంబారి విజయ్‌కుమార్‌(41), అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు పంటర్లు దగ్గుల రమేశ్‌ (44), మహ్మద్‌ అతీఖ్‌ (38), నందమూడి సంతోష్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.21 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

*యాసంగిలో వరి నాటిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 7 వేల కొనుగోలు కేంద్రాలు అవసరం ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కేంద్రాలు మాత్రమే తెరవడం దారుణమన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 68వ రోజు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర, జింకలగూడెం, అంజనాపురం, పినపాకపట్టీనగర్‌ గ్రామాల మీదగా కొనసాగి రాహుల్‌గాంధీనగర్‌ వద్ద పాల్వంచ మండలంలోకి ప్రవేశించింది. పాదయాత్ర 900 కిలోమీటర్లు పూర్తికావడంతో అక్కడ వైఎ్‌సఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దమ్మపేట సెంటర్‌లో బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. బంగారు తెలంగాణను కేసీఆర్‌ అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. వైఎ్‌సఆర్‌ హయాంలో ఆరు లక్షల ఎకరాల పోడు భూములకు హక్కులు కల్పిస్తే, కేసీఆర్‌ ఒక్క ఎకరానికీ పట్టా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అంతకు ముందు బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామంలో నిర్వహించిన ‘రైతుగోస’ దీక్షలోనూ ఆమె మాట్లాడారు. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో 17లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదన్నారు. వరి నాటని ప్రతి ఎకరానికి 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

*పీజీ వైద్య విద్య కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు సంబంధించి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం తుది మాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి కాగా, ఇంకా ఖాళీగా ఉన్న 153 కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో 29 క్లినికల్‌ సీట్లు, 124 నాన్‌ క్లినికల్‌ సీట్లు ఉన్నాయి. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఈ నెల 27 తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 28న మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

* పీజీ వైద్య విద్య కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు సంబంధించి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం తుది మాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి కాగా, ఇంకా ఖాళీగా ఉన్న 153 కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో 29 క్లినికల్‌ సీట్లు, 124 నాన్‌ క్లినికల్‌ సీట్లు ఉన్నాయి. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఈ నెల 27 తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 28న మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

*తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయవాడకు చెందిన దేవినేని చంద్రశేఖర్‌ (చందు) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు చందుకు రాష్ట్ర పదవి కట్టబెట్టినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 2012లో చంద్రబాబు ’మీ కోసం’ పాదయాత్రలో దేవినేని చందు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం తొలుత విజయవాడ అర్బన్‌ తెలుగు యువత అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి తాజాగా తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించింది.

*మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగామహిళలను కించపరిచేవిధంగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో బుధవారం టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలో జరిగిన ధర్నాలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళా కమిషన్‌ హక్కులను చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన తమకు నోటీసులు ఇచ్చారనిమాకు మాత్రం హక్కులుండవాచట్టం మీకు చుట్టమాఅని ప్రశ్నించారు.

*పంట రుణాల్లో అసలు, వడ్డీ కలిపి చెల్లించాలనడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ కడప జిల్లా వీరపునాయునిపల్లె ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కు తాళం వేసి నిరసన తెలిపారు. రైతుల కథనం మేరకు.. పంట రుణాలు పొందిన రైతుల నుంచి బ్యాంకులో ఏటా వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్‌ చేసేవారు. అయితే, ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలో అసలు, వడ్డీ చెల్లిస్తేనే పంట రుణాలను రెన్యువల్‌ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. తాము తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్నామని, అసలుతో నిమిత్తం లేకుండా వడ్డీ తీసుకుని రుణాన్ని రెన్యువల్‌ చేయాలని కోరారు. బ్యాంకు అధికారులు ససేమిరా అనడంతో సిబ్బందిని బయటకు రప్పించి బ్యాంకుకు తాళం వేశారు.

*విజయవాడ స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం నిర్మాణ పనులను రానున్న అంబేడ్కర్‌ జయంతి నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రుల కమిటీ చైర్మన్‌, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలసి బుధవారం పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు.

*‘ప్రస్తుత వేగవంతమైన సమాచార యుగంలో మాట పెదవి దాటేలోపే పృథ్వి దాటుతోంది. అందుకే ఇచ్చే సమాచారం సరైనదా కాదా అనేది ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సిన అవసరం ప్రసార మాధ్యమాలపై ఉంది’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం నెల్లూరు ఆలిండియా రేడియోను జాతికి అంకితం చేసిన అనంతరం 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్‌ఎం స్టేషన్‌ కార్యక్రమాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఆలిండియా రేడియో ఆవిర్భావంతో దేశంలో సమాచార విప్లవం వచ్చిందన్నారు.

*విద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థంగా పనిచేయాలని, తమ ప్రభుత్వ వీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. విజయవాడలో బాలికపై అత్యాచారం, తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనలను ప్రస్తావించారు. ఒకటి, రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని, మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అందుకు సమర్థమైన ప్రొటోకాల్స్‌ ఉండాలన్నారు.

*వస్తున్నా మీ కోసం’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగిసి బుధవారానికి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ నేతలు బుధవారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో చిన్న కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు ముందు ఈ పాదయాత్ర జరిగింది. 2012 సంవత్సరం అక్టోబర్‌ 2న హిందూపురంలో పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబు మరుసటి ఏడాది ఏప్రిల్‌ 27న విశాఖలో ముగించారు. దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ అధ్యక్షుడు గోనెగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు కేక్‌ కట్‌ చేశారు.

*తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక విభాగం టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో మే 1న విజయవాడలో కార్మిక బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఇక్కడ ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత బలమైన కార్మిక పోరాటాలకు నడుం బిగించాలని టీఎన్‌టీయూసీ నేతలకు సూచించారు.

*సీఎం జగన్‌ చిన్నాన్నవైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు బుధవారం పులివెందుల కోర్టుకు వచ్చారు. రెండు దఫాలు ఏపీపీని కలిసి కేసు విషయమై చర్చించినట్లు తెలిసింది. గతంలో సీబీఐ అధికారులు సమర్పించిన పలు పత్రాల్లోని విషయాలపై కోర్టు ప్రశ్నించడంతో, బుధవారం ఈ విషయమై కోర్టుకు వివరించేందుకు వచ్చారని సమాచారం. ఆ పత్రాల్లో చిన్నపాటి మార్పులు, చేర్పులపై ఏపీపీతో చర్చించినట్లు తెలిసింది.