DailyDose

అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు పెరుగుతున్నాయా… హాస్పిటల్స్, రైల్వే స్టేషన్‌లలో కూడా ఎలా జరుగుతున్నాయి?

అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు పెరుగుతున్నాయా… హాస్పిటల్స్, రైల్వే స్టేషన్‌లలో కూడా ఎలా జరుగుతున్నాయి?

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏప్రిల్ 22న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
పల్నాడు జిల్లాలోని గురజాల రైల్వే స్టేషన్ సమీపంలో ఒడిశాకు చెందిన ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఏప్రిల్ 16న ఈ ఘటనపై కేసు నమోదయ్యింది.గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ వివాహిత హత్యకు గురయింది. గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. చివరకు ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి హత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన ఏప్రిల్ 27న జరిగింది.బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో వలస కూలీ కుటుంబంపై దాడి చేసి, ఆ కుటుంబానికి చెందిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సహా పలువురు స్పందించారు. ఏప్రిల్ 30వ తేదీన ఈ ఘటన జరిగింది.
దాదాపుగా 15రోజుల వ్యవధిలోనే రాజధానికి సమీపంలోని ఉన్న జిల్లాల్లో నాలుగు గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, మహిళలపై దాడులు వంటివి వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.వరుస ఘటనలతో సామూహిక అత్యాచారాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయా? గడిచిన మూడేళ్లలో గణాంకాలు ఎలా ఉన్నాయి?

లెక్కలు ఏం చెబుతున్నాయి?
2019 నుంచి మూడేళ్లలో పాత గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా పోలీసు స్టేషన్‌ల పరిధిలో సామూహిక అత్యాచారాల కేసుల వివరాలు పరిశీలిస్తే ఈ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. 2019లో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలుచేశారు. 2020లోనూ లాక్‌డౌన్‌ అమలు చేశారు.2020, 21 సంవత్సరాల్లో ఏప్రిల్ మాసంలో గ్యాంగ్ రేప్‌లకు సంబంధించి రెండు చొప్పున కేసులు ఈ జిల్లాల పరిధిలో నమోదయ్యాయి. 2019 ఏప్రిల్‌లో మూడు కేసులు నమోదయ్యాయి.ఈఏడాది ఏప్రిల్‌ నెలలో మాత్రం కేవలం 15రోజుల వ్యవధిలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు, ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఒక కేసు నమోదు కాగా ఏప్రిల్ నెల మొత్తంలో ఐదు కేసులు నమోదయినట్టు రికార్డులు చెబుతున్నాయి. దాంతో గతంతో పోలిస్తే ఈ సారి అత్యాచార సంబంధిత నేరాలు పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది.ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం ఏపీలో 2019లో 1084 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 1104 మంది బాధిత మహిళలపై జరిగిన లైంగిక దాడుల్లో ఈ కేసులు నమోదయ్యాయి.

2020కి వచ్చేసరికి ఈ కేసులు 1090కి పెరిగాయి. బాధిత మహిళలు 1107 మంది ఉన్నారు.2021లో కూడా ఏపీలో అత్యాచార కేసులు పెరిగాయి. వాటి సంఖ్య 1100 దాటినట్టు రాష్ట్ర పోలీస్ అధికారుల నివేదికలు చెబుతున్నాయి.అత్యాచారాలతో పాటుగా ఈ కాలంలో గ్యాంగ్ రేప్ ఘటనలు ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళనను పెంచుతోంది. నేరాలు అదుపులోకి రాకపోవడంపై రిటైర్డ్ డీఎస్పీ వి రామ్ గోపాల్ మాట్లాడారు.‘‘లైంగిక వేధింపుల కేసులు గతం కన్నా ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. గతంలో వాస్తవ నివేదికలకు, మహిళలపై దాడులకు పొంతన ఉండేది కాదు. కానీ ఇటీవల అది మారింది. ఎక్కడ మహిళలపై దాడులు జరిగినా వెంటనే ఫిర్యాదులు తీసుకోవడం, వాటిని కేసులుగా నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవడం పెరిగింది. అయినా నేరాలు అదుపులోకి రావడం లేదు. గతంలో మహిళలకు అండగా పోలీసుల నిఘా పెంచే ప్రయత్నం సాగింది. కానీ ఖాళీ పోస్టులు, ఇతర పని ఒత్తిళ్ల మూలంగా పోలీసులు దృష్టి సారించే అవకాశం తగ్గిపోయింది. ఇది కూడా సామూహిక అత్యాచారాలు పెరగడానికి ఓ కారణం’’అని అన్నారు రిటైర్డ్ డీఎస్పీ వి రామ్ గోపాల్.పోలీసు సిబ్బందిని సరిపడా సంఖ్యలో నియమించి, మహిళా పోలీస్ స్టేషన్లు సహా అన్నింటినీ పటిష్టం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Whats-App-Image-2022-05

జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలే..
గతంలో జనాలు పెద్దగా లేని చోట, ఎవరూ గుర్తించరని భావించిన చోట ఎక్కువగా ఈ తరహా నేరాలకు ఆస్కారం ఉండేది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా నిత్యం అనేకమంది రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మహిళలపై సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి.ఈ విషయంపై ఏపీ న్యాయవాదుల సంఘం నాయకురాలు కే దుర్గా భవాని బీబీసీతో మాట్లాడుతూ.. “ఆస్పత్రిలోనే సామూహిక అత్యాచారం, రైల్వే స్టేషన్‌లోనే అత్యాచారం అంటే ప్రభుత్వ వైఫల్యాలను చాటుతోంది. నేరాల తీవ్రతను తెలుపుతోంది. కఠిన చర్యలు అవసరమని అర్థమవుతోంది”అని అన్నారు.మరోవైపు ఈ విషయంపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ.. “మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అక్కరకు రావడం లేదు. రాష్ట్రంలో అన్ని మూలలా నిత్యం దారుణాలు జరుగుతున్నాయి. దిశ చట్టం పేరుతో చాలా ప్రచారం నిర్వహించారు. చివరకు దిశ యాప్‌కే పరిమితమయ్యారు. కానీ అవి సామాన్య, వలస కూలీ మహిళలను ఎలా కాపాడుతాయి. ఇంతగా పెచ్చరిల్లుతున్న వారిని అదుపు చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమయింది. మహిళల భద్రతకు భరోసా లేకుండా పోయింది”అని ఆమె అభిప్రాయపడ్డారు.స్తవానికి మహిళలపై నేరాలే అదుపు చేసేందుకంటూ జగన్ ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో కొత్త చట్టం తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో దిశ ఘటన తర్వాత ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం చట్ట సవరణ చేసి ‘దిశ చట్టం’ తీసుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019తో పాటు ‘ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ కోర్ట్ ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌- 2019’ కూడా ఆమోదించి అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది.ఏపీలో శాసన ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చట్టంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఇండియన్ పీనల్ కోడ్‌లో మార్పులు తీసుకురావడం వల్ల ఈ చట్టం అమలు కావాలంటే కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది.తాము లేవనెత్తిన అంశాలకు ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా పలుమార్లు వెల్లడించింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు ఆమోదించాలని రాష్ట్ర ఎంపీలు కోరినప్పటికీ వివరణలపై స్పష్టత రావాల్సిందేనని కేంద్రం తెలిపింది.

అత్యాచార ఘటనపై రాజకీయ దుమారం
రాష్ట్రంలో వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్న తరుణంలోనే పాలక, విపక్ష నేతల మధ్య రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.విజయవాడ ఆస్పత్రిలో బాధితురాలి పరామర్శ సమయంలో విపక్ష నేత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మధ్య వాగ్వాదం జరిగింది. దాని చుట్టూ రాజకీయ దుమారం కూడా రేగింది.దుగ్గిరాల ఘటనలో పరామర్శకు వెళ్లిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని అడ్డుకునే యత్నం జరిగింది. ఆ సమయంలోనూ రాజకీయ రచ్చ సాగింది.రేపల్లె ఘటనపై మంత్రుల వ్యాఖ్యలు వివాదానికి తావిచ్చాయి. హోం మంత్రి తానేటి వనిత తొలుత తల్లుల తీరుని తప్పుబట్టడాన్ని మహిళా సంఘాలు ఖండించాయి.ఆ వెంటనే రేపల్లెలో నిందితులు రేప్ చేయడానికి రాలేదని, కేవలం డబ్బులు కోసమే అక్కడికి వచ్చారని, డ్రింక్ చేసి ఉండడంతో అతనిపై దాడిని అడ్డుకున్న భార్యపై అనుకోని రీతిలో అప్పటికప్పుడు జరిగిందన్నట్టుగా సామూహిక అత్యాచారం గురించి హోం మంత్రి తానేటి వనిత మాట్లాడడాన్ని పలువురు తప్పుబట్టారు.వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఈ అత్యాచారాల వెనుక టీడీపీ వాళ్లున్నారని ఆరోపించారు.

అత్యాచార బాధితులకు పరామర్శలు – విమర్శలు
రెండు పార్టీల నేతల మధ్య అత్యాచార ఘటనలు రాజకీయాలకు కేంద్ర బిందువు కావడంపై సామాజికవేత్త పీఏ దేవి విస్మయం వ్యక్తంచేశారు.”గ్యాంగ్ రేప్ ఘటనలపై రాజకీయాలు అత్యంత విషాదకరం. వారి తీరుతో చివరకు బాధితుల వ్యవహారాలు కూడా బయటపడుతున్నాయి. నిబంధనల ప్రకారం అత్యాచారానికి గురయిన వారి సమాచారం బయటకు రాకూడదు. కానీ పరామర్శల సమయంలో రాజకీయాల మూలంగా బాధితుల సంబంధీకుల గుట్టురట్టవుతోంది. సహజంగా నిందితులకు ఫలానా పార్టీ అంటూ ఉండదు. అయినా నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అరాచకాలకు పాల్పడుతున్న వారిని అదుపు చేసేందుకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. అందుకు భిన్నంగా విపక్షాల మీద విమర్శలకు ప్రయత్నించడమే విడ్డూరంగా ఉందంటూ”అని సామాజికవేత్త పీ ఏ దేవి వ్యాఖ్యానించారు.అరాచకాలు ప్రబలకుండా, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం నుంచి స్పందన అత్యంత పేలవంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి దారుణాలు వెలుగులోకి రాగానే తగిన రీతిలో స్పందన కనిపించలేదని బీబీసీతో అన్నారు.

కఠిన చర్యలు తీసుకుంటున్నాం
“గతంలో ఎన్నడూ లేని రీతిలో వేగవంతంగా విచారణ జరుగుతోంది. గుంటూరు రమ్య కేసు అందుకు ఉదాహరణ. నిందితుడికి ఉరిశిక్ష పడింది. సామూహిక అత్యాచార ఘటనలన్నింటిపైనా తీవ్రంగా స్పందిస్తున్నాం. పోలీసు అధికారులతో సమీక్ష చేశాం. మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం భరోసాగా ఉంటోంది. జగన్ హయంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతం కన్నా మహిళలపై నేరాలు అదుపులోకి వచ్చాయి. విపక్షాల విమర్శల కన్నా సామాన్య మహిళల రక్షణే మాకు ముఖ్యం. అందుకు తగ్గట్టుగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం”అని ఏపీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు.బాధిత కుటుంబాలను ఆదుకోవడం, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయడం వంటి చర్యలు ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.