Fashion

నృత్యం.. జన జీవనాదం..

నృత్యం.. జన జీవనాదం..

మనసుకు వినసొంపైన సంగీతం శ్రావ్యంగా వినబడితే శరీరం తనకు తానే లయబద్ధంగా కదలికలు చేస్తుంది. దానినే నృత్యం అంటారు. నృత్యం (డ్యాన్స్‌) మానవ జీవితంతో విడదీయరానిది. మన దేశంలోని దేవాలయాల్లో నృత్యానికి సంబంధించిన ఆనవాళ్లు వివిధ భంగిమల్లో శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి. జీవితంలోని కొన్ని దశల్లో.. పుట్టుక, వివాహం, మరణం వంటి అన్ని సందర్భాల్లోనూ డ్యాన్స్‌ పెనవేసుకుని ఉంది. స్త్రీ-పురుష, వయసు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచే రూపం నృత్యం. పండుగలు, ఆచారాలు, జాతరలు తదితర సమయాల్లో నృత్యానికే ప్రాధాన్యం. రాతి యుగంలో కళగా కనిపించి, లోహ యుగానికి వచ్చేటప్పటికి డ్రామా లక్షణాలను సంతరించుకుంది. నేడు ఒక వినోదాత్మక కళగా నృత్యం రూపుదిద్దుకుంది. ప్రచార సాధనాలు రాకతో నృత్యానికి ప్రాముఖ్యత పెరిగింది. తద్వార మారుమూల ప్రాంతాల్లోని నృత్యకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ నేడు నృత్యానికి విలువ, ప్రాధ్యాన్యతను సమకూరుస్తున్నాయి. ఈ కాలంలో శారీరక దేహ దారుఢ్యం, ఆరోగ్యం పెంపొందించుకోవడానికి నృత్యంలో కొత్త కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు.

**నృత్యం మానవజాతి ఆవిష్కరించుకున్న అనేక కళల్లో అతి ప్రాచీనమైనది. సంగీతానికి అనుగుణంగా శరీరం కదలికలు మీద ఆదారపడి వుంటుంది. శ్రమలో కాళ్లూ చేతుల కదలిక నుంచి నాట్యం ఆవిర్భవించింది. ఇది మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపకరిస్తుంది. మానవజాతి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ లక్షలాది ఏళ్లుగా నృత్యం (డ్యాన్స్‌) అనేది జన జీవనంలో ఒక భాగంగా కొనసాగుతోంది. తమకు తెలియకుండానే ఆదిమ యుగం నాటి మనుషులు సంతోషం, దుఃఖం కలిగినప్పుడు శరీరాలను కదిలిస్తూ లయబద్ధంగా నృత్యం చేసేవారు. గెంతడం, దూకడం, పరిగెత్తడం, ఒణికిపోవడం, గుండ్రంగా తిరగడం ఇలా ఏదైనా సంగీతపరంగా అనుసరించే వ్యక్తీకరించే విధానంలోనే నృత్యం ఉద్భవించింది. నృత్యానికి విస్తృతమైన అర్థం ఉంటుంది. అయితే ప్రకృతిని, సూర్యచంద్రుల్ని ఆరాధించిన ఆదిమ మానవులు, అవీ భ్రమణం చేస్తున్నాయని నమ్మేవారు. ఆ క్రమంలో ఆదివాసీలు గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేసే సంప్రదాయం ఆ పాత కాలపు సంప్రదాయానికి కొనసాగింపే అంటున్నారు పరిశోధకులు. రాతియుగపు కాలము నాటి ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇండియా వంటి అనేక దేశాల కొండగుహల్లో ఆదిమానవుల వేట, నాట్యం దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని బట్టి ఆదిమకాలం నుండి నాట్యం మానవ జీవితంలో ఒక భాగం అని అర్థమవుతున్నది. కుల, మత కట్టుబాట్లు, ప్రవృత్తి పెరిగిన కొద్దీ నృత్యరీతి కూడా పెరిగింది. ఇప్పటికీ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా వంటి చోట్ల ఆటవిక జాతుల్లో ఇవి కనిపిస్తాయి. పరిణామ క్రమంలో నృత్యం నుంచి కొంతమేర వేరే కళాత్మకత కొనసాగడం ప్రతిదేశంలోనూ కనిపిస్తుంది. అయితే నాట్యంలో జ్ఞానం, శిల్పం, విద్య, కళ, యోగం, కర్మ వంటివి మిళితమై వుంటాయి. నృత్యం లక్షలాది మందిని ఏకం చేసే ఒక కళారూపం. నృత్యం శతృత్వాన్ని జయిస్తుంది. సోదర భావం పెంపొందిస్తుంది.

**ప్రారంభం ఇలా..
ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుంటారు. 1982లో యునెస్కో సంస్థ అయిన ఎన్‌జిఓ యొక్క ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ కమిటీ మొదటిసారి ఏప్రిల్‌ 29న అంతర్జాతీయ నృత్యదినోత్సవాన్ని నిర్వహించింది. 1760లో రచయిత, ఆధునిక ప్రెంచ్‌ నృత్యనాటికల సృష్టికర్త అయిన జీన్‌ జార్జెస్‌ నోవేర్రే జన్మదినాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రతిపాదించారు. చివరికి 1982లో ఆమోదించారు. నోవేర్రే జీవించిన కాలం 1727-1810. అప్పటి నుంచి ప్రపంచంలోని సుమారు 200 దేశాల్లో ఎక్కడో చోట ఈ దినోత్సవం జరుపుతున్నారు.

**ముఖ్యోద్దేశం..
నృత్యకళ సజీవంగా వికసించాలన్నది ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. సమ్మిళితమైన నృత్యరీతులు ఎన్ని వస్తున్నా ప్రతి జాతీయ సాంస్కృతిక చిహ్నంగా నిలిచే ఆయా ప్రాంత నృత్య కళను సజీవంగా కాపాడాలన్నదే అత్యున్నత లక్ష్యం. ఈ సిద్ధాంతంతోనే యునెస్కో అంతర్జాతీయ డ్యాన్స్‌ కౌన్సిల్‌ను ఏర్పరచింది. నృత్యానికి తగిన వేదికలు, ప్రాముఖ్యతలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. నృత్యం విశ్వ మానవ వికాసానికి దోహదపడేదిగా ఉండాలన్నది ‘కౌన్సిల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌’ ప్రధాన ఆశయంగా చెప్తోంది. మానవీయ కోణంలో ప్రతిఫలించాలన్నది కోరిక అని 2017 కౌన్సిల్‌ అధ్యక్షుడు, కొరియోగ్రాఫర్‌ రోజర్‌ సిన్హా పేర్కొన్నారు.
అయితే ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైన నృత్య దర్శకులు/నర్తకులు ప్రపంచవ్యాప్తంగా చలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానించబడతారు. ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ కమిటీ యొక్క ప్రవేశపత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్యదర్శకులు/ నర్తకులను ఎంపిక చేస్తారు.

** అలసట మరిపించేది..
ఆదిమ సమాజంలో ప్రజలు, పగలంతా కాయకష్టం చేసి సాయంత్రం తమ నివాస స్థలంలో సేదతీరే సమయంలో నిత్యం ఆడి, పాడేవారు. అలసిన శరీరాలకి ఉల్లాసం కలిగించేందుకు అలా ఆటవిడుపుగా, వినోదంగా మొదలైన నృత్యరూపకాలు.. తదనంతర కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ప్రత్యేక నృత్యాలుగా గుర్తింపు పొందాయి. దేశ, విదేశాల్లోనూ ఆయా ప్రాంతాల్లో ఇదే తరహాలో స్థానిక నృత్యరూపకాలు ఉండేవి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక ప్రాంతంలోని సంస్కృతి మరో ప్రాంతానికి విస్తరించి, పరిణామక్రమంలో డ్యాన్స్‌లలో అనేక రకాలు ఆవిర్భవించాయి. మొదట్లో పర్వదినాలు, శుభకార్యాల్లో ఆడిపాడిన కళాకారులు, నృత్యకారులు టెక్నాలజీ రాకతో నేడు సినిమాల్లోనూ, వివిధ సామాజిక మాధ్యమాల్లో తమ కళా నైపుణ్యానికి తగిన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విభిన్న గిరిజన తెగల మధ్య సౌభ్రాతత్వాన్ని పెంపొందించేలా ఈ నృత్యరూపాకాలు పరిణామం చెందుతూ వచ్చాయని తెలుస్తోంది.

** ఆధునిక పోకడలు ఎటువైపు..?
గత కొంతకాలంగా టీవీ షోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణాలు బోలెడు. పిల్లలను డ్యాన్స్‌ చేయమంటున్నారు సరే. కానీ ఎలాంటి పాటలకి? ఐటెమ్‌ సాంగులకి, రొమాంటిక్‌ నంబర్స్‌కి. పైగా ఆ లిరిక్స్‌కి తగ్గట్టుగానే హావభావాలను పలికించమనడం, అసభ్యకరమైన అభ్యంతరకరమైన భంగిమల్లో నర్తింపజేయడం సమంజసమా? ఇది పిల్లల మానసిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు మానసిక నిపుణులు. కేవలం టీఆర్‌పీలే లక్ష్యంగా కార్పొరేట్‌ మీడియా వ్యహరించడం బాధాకరం. దీనికితోడు విపరీతమైన టెన్షన్‌ క్రియేట్‌ చేసి, మరీ రిజల్ట్‌ చెప్పడం.. దీనికి పిల్లలు నిరుత్సాహానికి గురికావడం.. విపరీతంగా ఏడవడం వంటి సందర్భాలూ అనేకం. న్యాయనిర్ణేతల కామెంట్స్‌ కూడా పసి మనసుల్ని కలత చెందేలా చేస్తున్నాయి. వారిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎంతసేపూ నువ్వే గెలవాలి, నువ్వే గెలవాలి అంటే వాళ్లు ఇతరుల గెలుపును ఎందుకు హర్షిస్తారు? తమ ఓటమిని ఎలా తట్టుకుంటారు? పైగా రోజుల తరబడి రిహార్సల్స్‌ చేసి, ఒళ్లు హూనం చేసుకున్నాక కూడా ఓడిపోయామే అన్న బాధ ప్రశాంతంగా ఎలా ఉండనిస్తుంది? ఇవన్నీ సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయాలు.
cs3

*భారతీయ నాట్య ప్రపంచంలో అతి ముఖ్యమైనవి జానపద నృత్యాలు, చిందు భాగవతుల ఆడే ఆట, పులి నృత్యం, ఆదివాసీలు ఆడే దండారీతో పాటు గిరిజన నృత్యాల్లో థింసా, గుసాడి, దండారి కోలాటం, సామంతుల మయూరి నృత్యం, జోడియా, చెంచునృత్యం, లంబాడి, కోయ డ్యాన్స్‌ ఇలా చాలానే ఉన్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకమైనది. వీటినుంచి విడిగా మన జీవితాలను ఊహించలేము. అయితే వీటిని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిని మన సంస్కృతిలో భాగంగానే అమలుచేయాలి. మన తర్వాత తరానికి అందివ్వాలి. ఆనాడే ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవం విజయవంతమవుతుంది. అందులో మనమూ భాగస్వాములమవుదాం.

** సామాజిక చైతన్యం కోసం..
నాట్యంతో సామాజిక చైతన్యం కలిగించిన ఎందరో నృత్యకారులు, కళాకారులూ ఉన్నారు. వారిలో ఒకరు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు. తన నాట్యం ద్వారా ప్రసిద్ధి పొందటమే కాదు కూచిపూడి నృత్యానికి కూడా దేశవిదేశాల్లో గొప్ప ప్రాచుర్యం తెచ్చిపెట్టారు. అనేక కథలను, అందులోని పాత్రలనూ కూచిపూడిలో అభినయించి, వాటికొక ప్రత్యేక ముద్ర వేశారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన నృత్యరూపకం ‘చండాలిక’. భారత సమాజంలోని కులవ్యవస్థను, అంటరానితనాన్ని తీవ్రంగా ప్రశ్నించిన ప్రదర్శన. దానిని కూచిపూడి నృత్యరీతిలోకి మార్చి, శోభానాయుడు చేత చండాలిక పాత్ర చేయించారు వెంపటి చినసత్యం.

* అమెరికాలోని మిన్నెసోటా థియేటర్‌ ఆర్ట్స్‌ అండ్‌ డ్యాన్స్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ అయిన అనన్య చటర్జీ ‘మోరెచికా’ అనే నృత్యరూపకాన్ని సృష్టించారు. తన స్వస్థలమైన బెంగాల్‌లో శాస్త్రీయ నృత్య రూపకమైన ఒడిస్సీ నుంచి ప్రేరణ పొందారు. పర్యావరణం, జాత్యహంకారం, మహిళలపై హింస అనియంత్రిత పెట్టుబడిదారీ విధ్వంసం వంటి సమస్యలపై అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఇలాంటి ఎందరో నృత్య కళలోకి.. సమకాలీన సమస్యను చొప్పించి, ప్రేక్షకులను ఒప్పించటం ఒక గొప్ప ప్రయత్నం. దానిని అవలీలగా, అత్యద్భుతంగా అభినయించి, మెప్పిస్తున్నారు. దేశ విదేశాల్లో ఇలాంటి ఎందరో కళాకారులు ఆయా ప్రాంతాల్లోని సామాజిక, సమకాలీన సమస్యలపై నృత్యరూపకాలతో చైతన్యపరుస్తూ విశేష కృషి చేశారు.. చేస్తున్నారు.

** నృత్య రూపాలు అంతర్జాతీయంగా..
ఫ్లేమెన్కో (స్పెయిన్‌), కోసాక్‌ (ఉక్రెయిన్‌), బరోంగ్‌ (ఇండోనేషియా), అడుము (కెన్యా, టాంజానియా), బ్యాలెట్‌ (రష్యా), కబుకి (జపాన్‌), సూఫీ విర్లింగ్‌ (టర్కీ), సాంబా (బ్రెజిల్‌), జాజ్‌, బ్రేక్‌ డ్యాన్స్‌ (యుఎస్‌ఏ), జింగిల్‌ డ్యాన్స్‌ (ఉత్తర అమెరికా), కాపోయిరా (బ్రెజిల్‌), ఫ్లేమెన్కో డ్యాన్స్‌ (దక్షిణ స్పెయిన్‌), ఐరిష్‌ స్టెప్‌ డ్యాన్స్‌ (ఐర్లాండ్‌), జౌలి మాస్క్‌ డ్యాన్స్‌ (ఐవరీ కోస్ట్‌), రాక్స్‌ షార్కి (ఈజిప్టు), డ్రాగన్‌ డాన్స్‌ (చైనా), హాకా (న్యూజిలాండ్‌).

* జాతీయంగా..
కథక్‌ (ఉత్తర ప్రదేశ్‌), భరతనాట్యం (తమిళనాడు), కూచిపూడి (ఆంధ్రప్రదేశ్‌), భాంగ్రా (పంజాబ్‌), ఘూమర్‌ (రాజస్థాన్‌), కథాకళి (కేరళ), బిహు (అస్సాం), లావని (మహారాష్ట్ర), మణిపురి (మణిపూర్‌), రఫ్‌ (జమ్మూ కాశ్మీర్‌).

* సమకాలీన సమస్యలపై..
విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం సమ్మిళితం.. నృత్యం. ఇందులో తొలినాళ్ల నుంచీ సామాజికాంశాలు కలగలసి ఉన్నాయి. కాలంతో పాటు శాస్త్రాన్ని వదలకుండా, సంప్రదాయాన్ని మార్చుకుంటూ ముందుకెళ్లడం మనం చూస్తున్నాం. సమకాలీన సమస్యలపై స్పందించడం కళాకారుల బాధ్యత. అనేక సందర్భాల్లో బాధితుల సమస్యలు ఇతివృత్తంగా నృత్యరూపకాలు రూపొందించేవారు. ఇప్పటికీ మహిళలపై, సమాజంలో చోటుచేసుకునే హింసకు వ్యతిరేకంగా, కోవిడ్‌ సమయంలోనూ కళాకారుల అవస్థలు ఇతివృత్తంగా పలు నృత్యరూపకాలు మనం చూస్తూనే ఉన్నాం. అమ్మాయిలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగానూ అనేక కళారూపాలను ఇటీవల టీవీ డ్యాన్స్‌ షోల్లో చూస్తూనే ఉన్నాం. ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పడం కన్నా నృత్యరూపకం ద్వారా చెప్పడం వల్ల సామాన్యులకు సైతం సులభంగా అర్థమవుతుంది. అదే నృత్యరూపాలకున్న ప్రత్యేకత.. సౌలభ్యత. అయితే ప్రస్తుత ప్రపంచంలో కళ ద్వారా సామాన్యులను కదిలించడం అంత సులువు కాదు. అందుకోసం కఠోర శ్రమ, అవిశ్రాంత సాధన, సృజన అవసరం. సమాజాన్ని కదిలించే శాస్త్రీయ నృత్యరూపకాలను రూపొందించడం కళాకారుల ముఖ్య కర్తవ్యం. దీంతోపాటు నృత్య కళారూపం ప్రపంచీకరణను ఛేదించడానికి, అన్ని రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులు అధిగమించడానికి, సాధారణ భాషలో గల నృత్య రీతులు ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి, ఒక చైతన్యవంతమైన ఆలోచన కలిగించడానికి కృషి చేయడమే ఈ నృత్య దినోత్సవ లక్ష్యం.

*ఆరోగ్య ప్రయోజనాలు..
నృత్యం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరైనా దీనివల్ల ప్రయోజనాలు పొందవచ్చు. ఇదొక శారీరక వ్యాయామం. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మెదడుకు బూస్టర్‌గా పనిచేస్తుంది. శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నమాట.డ్యాన్స్‌ వల్ల హార్ట్‌రేటు స్థిరంగా ఉంటుంది. అంతేకాదు అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కార్డియో వ్యాస్కులార్‌ వ్యాయామం తరహాలో శక్తి పెరుగుతుంది. అధిక ఒత్తిడికి కారణమైన బిపిని అదుపులో ఉంచుతుంది.కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్న వారికి డ్యాన్స్‌ ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు బలంగా ఉంచుతుంది. అంతేకాదు డ్యాన్స్‌ మనల్ని ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది.వృద్ధాప్యంలో వచ్చే బ్యాలెన్సింగ్‌ సమస్యకూ డ్యాన్స్‌ చక్కటి పరిష్కారం.. చిన్న వయస్సు నుంచి డ్యాన్స్‌ చేసేవారు బ్యాలెన్సింగ్‌ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. వయస్సు పెరిగినా అందరిలాగానే నడవగలుగుతారు.వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంతమందికి జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుంది. అయితే డ్యాన్స్‌ జ్ఞాపకశక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. డ్యాన్స్‌ నేర్చుకోవడం, ఆ స్టెప్పులను గుర్తించుకోవడం వంటివీ జ్ఞాపకశక్తిని పెంచేలా చేస్తాయి.తీవ్ర ఒత్తిడి, నిరుత్సాహాన్ని తగ్గించేందుకు ఇదో పరిష్కారమార్గం. డ్యాన్స్‌తో శరీరం రిలాక్స్‌ అయ్యి, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అయితే ఇలానే చేయాలి.. అలానే చేయాలి.. అని రూలేమీ లేదు. నచ్చిన పాటకు వచ్చిన స్టెప్పులతోనే చిందులేయొచ్చు.
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి ఇదో చక్కటి వ్యాయామం. దీనివల్ల కేలరీలు ఖర్చవుతాయి. సాధారణంగా గంటపాటు డ్యాన్స్‌ చేస్తే 300 – 400 కేలరీలు ఖర్చవుతాయి. శరీర బరువు, డ్యాన్స్‌ చేస్తున్న తీరునుబట్టి కేలరీలు తగ్గుతాయి. ఎరోబిక్‌ డ్యాన్స్‌, జుంబా డాన్స్‌, జాగింగ్‌, సైక్లింగ్‌ చేయడం ద్వారా ఎలా అయితే కేలరీలు ఖర్చవుతాయో.. డ్యాన్స్‌ ద్వారా కూడా అంతే ఖర్చవుతాయి.
నృత్యం.. జన జీవనాదం..

*కళకు కుల మత భేదాలేంటి ?
వారికి మనుషుల సామరస్య జీవనం పట్ల నమ్మకమే తప్ప మతం యొక్క గుడ్డి విశ్వాసాలు, విభజన గీతల పట్ల పట్టింపు లేదు. వారే మాన్సియా తల్లి అమీనా, తండ్రి సయ్యద్‌ అలవికుట్టి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. రూబియా, మాన్సియా. ఇద్దరికీ మూడేళ్ల వయసు నుంచి భరతనాట్యం, కూచిపూడి, కథాకళి నేర్పించారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అద్భుతంగా వీటన్నింటినీ అభ్యసించారు. అనేక దేవాలయాల ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఇది మొదట్లోనే మసీదు పెద్దలకు నచ్చలేదు. 18 ఏళ్ల క్రితం.. రూబియా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తుంటే ముస్లిం పెద్దలు కొందరు అభ్యంతరం లేవదీశారు. దేవాలయాల్లో ప్రదర్శనలు ఇవ్వడం, అసలు ఆ నృత్య అభ్యాసం మానేయమని హుకుం జారీ చేశారు. అలవికుట్టి ఆ మాటలకు తలొగ్గలేదు. ‘నాట్యం ఒక కళ. దానికి మతం లేదు. నా పిల్లలిద్దరికీ నృత్యమంటే ప్రాణం. అందుకే నేర్పించాం. అర్థం చేసుకోండి.’ అని అభ్యర్థించాడు. మత పెద్దలు ఒప్పుకోలేదు. ‘భరతనాట్యం, కథాకళి మానకుంటే ముస్లిం సమాజం నుంచి వెలివేస్తాం’ అన్నారు. ‘అలాగే కానీయండి. మనుషుల నుంచి వెలి వేయలేరు కదా’ అన్నారు అలవికుట్టి, అమీనా. పిల్లల అభిరుచికి, కళకు అంత ప్రాధాన్యం ఇచ్చారువారు. కొద్ది కాలానికే అమీనా క్యాన్సరుతో ప్రాణాలు కోల్పోయింది. మసీదు శ్మశానస్థలిలో ఖననం చేయటానికి ఒప్పుకోలేదు. ఆఖరికి అమీనా పుట్టిన ఊరిలో అంత్యక్రియలు జరిపించారు.

*రూబియా అన్నామలై యూనివర్శిటీ నుంచి భరతనాట్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసింది. వివాహం చేసుకొని, ప్రస్తుతం విదేశాల్లో ఉంది. మాన్సియా భరతనాట్యంలో డాక్టరేట్‌ చేసింది. కాలికట్‌ యూనివర్సిటీ యూత్‌ ఫెస్టివల్‌లో అద్భుత ప్రతిభ ప్రదర్శించి, ‘కళా తిలకం’ పురస్కారం పొందింది. తొలి ప్రదర్శనను గురువాయుర్‌ దేవాలయ ప్రాంగణంలోనే ఇచ్చింది. తాజాగా కేరళలోని త్రిస్సూరు కూడల్మాణిక్యం ఉత్సవాల్లో ఈ నెల 21న భారీఎత్తున 800 మంది నృత్యకళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి ఎంపికైన కళాకారుల్లో 27 ఏళ్ల ముస్లిం మహిళ మాన్సియా వీపీ ఒక్కరు. దీనిపై కొందరు హిందూ ఛాందసులు, బీజేపీ ప్రేరేపిత మతోన్మాదులు రచ్చ మొదలుపెట్టారు. ‘మాన్సియా ముస్లిం కాబట్టి దేవాలయాల్లో నాట్యం చేయటానికి వీల్లేదు’ అని అభ్యంతరం లేవదీశారు. ఈ కారణంగా ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు సమాచారం చేరవేశారు. కాగా దీనిపై మాన్సియా స్పందిస్తూ ‘నేను నాట్యాన్ని ప్రేమిస్తాను. ఒక కళగా ఆరాధిస్తాను. మనిషినీ, మనసునూ కదిలించే ఒక మానవీయ కళగా ప్రదర్శిస్తాను. ఏ మతాన్నీ నమ్మను, మనుషులను తప్ప..’ అంటోంది నవ్వుతూ.