DailyDose

సంతూర్ స్వర మాంత్రికుడు

సంతూర్ స్వర మాంత్రికుడు

కశ్మీరీ జానపద సంగీత వాయిద్యం సంతూర్‌కి శాస్త్రీయ గౌరవాన్ని సాధించిన సంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ. అప్పటిదాకా కేవలం సూఫీ గాయకుల సహ వాయిద్యంగా ఉన్న సంతూర్‌ని హిందుస్తానీ సంగీత సమ్మేళనాల్లో ప్రధాన సంగీత వాయిద్యంగా ఉన్నతీకరించినవారాయన. శాస్త్రీయ సంగీత ప్రపంచంలో విశేషమైన పేరు, గౌరవాన్ని అందుకున్న శివకుమార్ శర్మ మే 10న తన 84వ ఏట ముంబైలో కన్ను మూశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. సంతూర్‌తో ఆయన అందించిన సంగీత ఫలాలు అనితర సాధ్యమయినవి. ‘వర్తమానంలో జీవించాలి.. అదే మానవ జీవన తాత్వికత, కానీ అందరమూ గతంలో జీవిస్తూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం’ అంటారు శివకుమార్ శర్మ. అంతే కాదు మన అహాన్ని లొంగదీసుకోకుంటే అసలైన వాస్తవం అర్థం కాదు అని కూడా అన్నారాయన. అట్లా సంగీత సృజనాత్మక రంగంలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న ఆయన సంతూర్ వాయిద్యానికి శాస్త్రీయ స్థాయిని సాధించేందుకు కృషి చేశారు. సంతూర్‌ని రూపంలోనూ, దాన్ని వాయించే సరళిలోనూ విశేష మార్పులు, చేర్పులు చేసారు. ప్రయోగాలు చేసి అనేక విజయాలు సాధించారు. సంతూర్ వాయిద్యం మొదట 100 తీగలతో 25 వంతెనలుగా ఉండేది. దాదాపు చతుర్భుజాకారంలో ఉండి రెండు కర్రలతో వాయించేవారు. కానీ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ఒరవడికి తగ్గట్టు తీగల సంఖ్యను, రూపాన్ని మార్చారు. అంతేకాదు వాయిద్య స్టాండ్‌ను తొలగించి తన ఒడిలోకి తీసుకుని ఉపయోగించడం మొదలుపెట్టారు. అట్లా అనేక మార్పులతో సంతూర్‌కు మీండ్, గమక్, ఆందోలన్ లాంటి హిందుస్తానీ సంగీత లక్షణాల్ని సమకూర్చారు. సంతూర్‌కు ఖ్యాతిని, శాస్త్రీయతని సంతరింపజేసిన శివకుమార్ శర్మ 14 ఏండ్ల వయసునాటికే తబలా, గాత్ర సంగీతాల్లో శిక్షణ పొందారు. కానీ శ్రీనగర్ ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న శివకుమార్ తండ్రి ఉమాదత్ శర్మ తన కుమారుణ్ణి సంతూర్ నేర్చుకొమ్మని సూచించారు. అప్పటిదాకా కనీసం వినని వాయిద్యం ఎట్లా అని భావించినా తండ్రి ఆదేశాన్ని గురువు ఆదేశంగా పాటించి సంతూర్‌ని నేర్చుకోవడం ఆరంభించారు. శివకుమార్ శర్మ తన 17వ ఏట బొంబాయిలో మొదటి ప్రదర్శన ఇచ్చారు. అలా ఆరంభమయిన ఆయన సంగీత ప్రస్థానం నిరంతరం కొనసాగింది.