Health

వీళ్లు ఆరోగ్య గురువులు..

వీళ్లు ఆరోగ్య గురువులు..

గూగుల్‌ ఓ సమాచార విప్లవం. సామాజిక మాధ్యమాలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించాయి. నెట్‌వర్కింగ్‌ను విస్తరించాయి. దీనివల్ల మంచి జరిగింది. చెడూ జరుగుతున్నది. ఆ గుట్టల కొద్దీ సమాచారానికి వడపోత అన్నదే లేకుండా పోయింది. దీంతో ‘ఫేక్‌ న్యూస్‌’ రాజ్యమేలుతున్నది. అర్ధసత్యాలు సామాన్యులను అయోమయంలో పడేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషిచేస్తున్నారు కొందరు మహిళలు. హెల్త్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా.. వేలాది జీవితాలను వారు ప్రభావితం చేస్తున్నారు.

చైతన్యం కలిగించాలని
హైదరాబాద్‌కు చెందిన బ్రెస్ట్‌ ఆంకాలజిస్ట్‌, ఆంకోప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రజ్ఞా చిగురుపాటి సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు సంబంధించి అనేక పోస్ట్‌లు షేర్‌ చేస్తుంటారు. “ఇన్‌స్టాగ్రామ్‌లో నా పోస్ట్‌లకు రెస్పాన్స్‌ బాగుంది. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ సోషల్‌ మీడియాలో అకౌంట్‌ ఉంటున్నది. దీంతో నేను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా జనాలకు ఆరోగ్య సమస్యలపై చైతన్యం కలిగించాలని నిర్ణయించుకున్నా. ఒకరోజు నాకు ఈశాన్య రాష్ట్రం నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఓ మహిళ మాట్లాడింది. తనకు రొమ్ము క్యాన్సర్‌ విషయంలో చాలా సందేహాలు ఉన్నట్లు చెప్పింది. సోషల్‌ మీడియా అనేది ఎంతదూరంలోని మనుషులకైనా సమాచారాన్ని చేరవేస్తుందని అప్పుడే నాకు అర్థమైంది. అయితే డాక్టర్‌గా నేను శాస్త్రీయమైన విషయాలను మాత్రమే షేర్‌ చేస్తాను. నెటిజన్లు కూడా ఇంటర్నెట్‌లో ఉన్న ప్రతిదాన్నీ నిజమేనని నమ్మకూడదు. అవగాహన పెంచుకోవడం వరకూ మంచిదే కానీ, వైద్యం కోసం నిపుణుల దగ్గరికే వెళ్లాలి. సోషల్‌ మీడియా పోస్టులు డాక్టర్లకు ప్రత్యామ్నాయం కానేకాదని గుర్తించాలి” అంటారు డాక్టర్‌ ప్రజ్ఞా చిగురుపాటి.

కౌన్సెలింగ్‌ సేవలు కూడా
డిజిటల్‌ పరిజ్ఞానంతో గ్రామీణ మహిళల నెట్‌వర్కింగ్‌ విస్తరించింది. గృహిణులకు కూడా తోటి మహిళలతో పరిచయాలు పెరుగుతున్నాయి. తమ ఆరోగ్య సమస్యలు, పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాలను ఇతరులతో చర్చించే అవకాశాలు లభిస్తున్నాయి. ఛాయా పాండే వంటివారు ముందుకొచ్చి ఆన్‌లైన్‌ బృందాలనూ తయారు చేస్తున్నారు.
ఆసక్తి ఉన్న మహిళలను అందులో చేర్చుకుంటున్నారు. వివిధ కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. “మన దేశంలో ఎంతోమంది తల్లులకు తమ ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక ఉండదు. కుటుంబసభ్యులు కూడా ఆమె కోసం సమయం కేటాయించడం లేదు. సోషల్‌ మీడియా వల్ల చాలామంది గృహిణులు ఆన్‌లైన్‌ గ్రూప్‌లలో చేరుతున్నారు. నేను కూడా సోషల్‌ మీడియాలో ఒక గ్రూప్‌ తయారుచేశాను. ఇప్పటి వరకు మా గ్రూప్‌ ద్వారా ఎంతోమందికి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. సరైన పరిష్కారాలు సూచించాం. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరాలు అందించాం. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం చేశాం. ఇప్పటికీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణుల ద్వారా వైద్య సలహాలు అందిస్తుంటాం” అని వివరిస్తారు ఛాయ.

అమ్మలకు మార్గదర్శి
కొత్తగా మాతృత్వాన్ని పొందిన మహిళల్లో వచ్చే శారీరక మార్పులు, వివిధ సందర్భాల్లో ఎదురయ్యే మానసిక సమస్యలపై సోషల్‌ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు నమ్రత. నిజానికి ఆ సమయంలో వారికి తగిన అండ కావాలి. ధైర్యాన్నిచ్చే గొంతుక కావాలి. “తొలిసారి అమ్మదనంలోని కమ్మదనాన్ని అనుభవిస్తున్న దశలో.. బాలింతలు తినాల్సిన ఆహారం గురించి, పసిబిడ్డకు పాలు ఇస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. చాలా సందేహాలు ఉండేవి. ఎవరిని అడగాలో తెలిసేది కాదు. అలా అని గూగుల్‌లోని ప్రతి విషయాన్నీ గుడ్డిగా నమ్మేందుకు వీల్లేదు. దాంతో నా అంతట నేనే నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించేదాన్ని. భవిష్యత్తులో ఎవరూ నాలా కష్టపడొద్దని, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాను. గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డకు పాలు పట్టే సమయం వరకు తల్లి శరీరంలో వచ్చే మార్పులు, ఇబ్బందులు, వాటికి పరిష్కారాలు పోస్ట్‌ చేశాను. అప్పట్లో వైద్యులు నాకు ఇచ్చిన సలహాలను కూడా నా ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకున్నాను. ఈ సమాచారం ఎంతోమందికి ఉపయోగ పడుతున్నది” అని వివరించారు నమ్రత.

సరైన గైడెన్స్‌ అవసరం..
ఎంత టెక్నాలజీ, ఎంత నెట్‌వర్కింగ్‌ ఉన్నా, ఇప్పటికీ చాలామంది మహిళలకు కొన్ని విషయాల్లో అవగాహన ఉండటం లేదు. సందేహం వస్తే కుటుంబ సభ్యులను అడిగేంత స్వేచ్ఛ కూడా లేదు. అలాంటి వాళ్లకు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో సలహాలు, సూచనలు ఇస్తున్నారు సెక్సువల్‌ హెల్త్‌ ఎడ్యుకేటర్‌, సైకాలజిస్ట్‌ స్వాతి జగదీశ్‌. వివిధ మధ్యమాల ద్వారా తాను తెలుసుకున్న కచ్చితమైన సమాచారాన్ని ఫాలోవర్లకు అందిస్తున్నారు. మాతృత్వ పాఠాలు కూడా షేర్‌ చేస్తున్నారు. “పాలు పట్టడం, పసిపిల్లల సంరక్షణ, పోషణ, నెలసరి ఇబ్బందులు, మెనుస్ట్రువల్‌ కప్స్‌.. మొదలైన ఎన్నో అంశాలను నా బ్లాగ్‌ ద్వారా నలుగురికీ తెలియజేస్తున్నాను. నాలుగేండ్లుగా సోషల్‌ మీడియాలో ఇలా ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాను. గ్రామాల్లోని మహిళలు తమకు అత్యవసరమైన వ్యక్తిగత వస్తువుల కోసం ఇంట్లో వాళ్లను అడగడానికి కూడా సందేహిస్తున్నారు. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తీసుకురావాలని ఆశపడుతున్నా. మానసిక ఆరోగ్యం పట్ల మహిళ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ” అంటున్నారామె.