DailyDose

జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక! – TNI తాజా వార్తలు

జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక!  –  TNI  తాజా వార్తలు

* ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్టు ఆ పార్టీ ఆకివీడు మండల కమిటీ అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు తెలిపారు. ఆకివీడులోని ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన వీర్రాజు పార్టీ మండల కార్యాలయంలో కొద్దిసేపు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్‌ 7న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వస్తారని వీర్రాజు చెప్పినట్లు తెలిపారు.

* ర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద వైకాపా నాయకుల కార్లను.. ఆ మార్గంలో ప్రయాణించిన వాహనాలు ఢీకొన్నాయి. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా వెళుతున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కారు అకస్మాత్తుగా ఆగింది. ఈ క్రమంలో వెనుకనుంచి కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే కార్లలో ఉన్న నాయకులెవరికీ ఇబ్బంది కలగలేదు. ఈ ప్రమాదానికి కారణం మీరంటే మీరంటూ నాయకుల అనుచరులు, సాధారణ వాహన ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.

*యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

*మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని కొలువైన మహాకాళేశ్వరుడిని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆదివారం దర్శించుకున్నారు. హెలీకాప్టర్‌లో ఉజ్జయినికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌, సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో పాటు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం హెలీప్యాడ్‌ నుంచి రాష్ట్రపతి కాళిదాస్‌ అకాడమీకి చేరుకున్నారు. పండిట్‌ సూర్యనారాయణ వ్యాస్‌ సంకుల్‌లో జరిగిన అఖిలభారత ఆయుర్వేద మహాసమ్మేళన్‌ 59వ సమావేశాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

*కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టవద్దని అమలాపురంలో నిర్వహించిన ఆందోళన విధ్వంసక పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు విధించిన ఆంక్షలను పొడిగించారు. ఇంటర్నెట్‌ సేవలను మరో 24 గంటల పాటు పొడిగించగా 144 సెక్షన్‌ను ఐదు రోజుల పాటు పొడిగించారు. ఈనెల అమలాపురంలో యువకులు భారీ ర్యాలీని నిర్వహించారు. పోలీసులు సైతం ఊహించని విధంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

*పాకిస్థాన్ నుంచి భారత దేశంలో ప్రవేశించబోతున్న ఓ డ్రోన్‌ను ఆదివారం ఉదయం జమ్మూ-కశ్మీరులోని కథువా జిల్లా, హీరానగర్ సెక్టర్‌, అంతర్జాతీయ సరిహద్దుల్లో కూల్చేసినట్లు పోలీసులు తెలిపారు. టల్లి హరియా చక్ ప్రాంతంలో దీనిని కూల్చేసినట్లు తెలిపారు. భారత్‌లో అక్రమంగా చొరబడేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులు ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారనే సంగతి తెలిసిందే.

*నలుగురు భారతీయులు సహా 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. పర్యాటక నగరమైన పోఖరా నుంచి ఈ ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ అయిన విమానం 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ చిన్న విమానం మిస్సయిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ కోసం రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.

*తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉండవల్లి కరకట్ట ప్రక్కన పంట అయిపోయిన అరటి తోటకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. కరకట్టకు ఇరువైపుల మంటలు వ్యాపించాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ప్రక్కనే ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 2న నాగోల్ జై కన్వెన్షన్ సెంటర్‌లో ఉద్యమకారులతో సమావేశం నిర్వహిస్తున్నామని బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమకారులందరిని ఏకతాటిపై తెస్తామన్నారు. మరో పోరాటానికి ఉద్యమకారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తీరు వల్ల ఎంతోమంది తెలంగాణ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు స్వామీగౌడ్ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు రావాలని కోరారు.
ఉద్యమకారులను టీఆర్ఎస్ మర్చిపోయిందన్నారు. బీజేపీ నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ..నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌ను కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. ఐటీ కేసులు ఉన్నవారికి పదవులు ఇచ్చి ఉద్యమ కారులను కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

* జగన్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో జరిగింది. అయితే మంత్రుల సభ వెలవెలబోయింది. శ్రీనివాస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభకు జనం కరువయ్యారు. సభలో కనీసం రెండు వరుసల కుర్చీలు కూడా నిండలేదు. మంత్రుల సభ అట్టర్ ప్లాప్ అయింది. ఈ సభకు వైసీపీ నేతలు కష్టపడి జనాలను తీసుకువచ్చారు. అయితే మంత్రులు మాట్లాడే సమయానికి వచ్చిన జనం కూడా వెనుదిరిగారు. సభలో జనం లేకపోవడంతో కేవలం ఇద్దరు మంత్రులే మాట్లాడారు. కర్నూలులోనూ మంత్రుల సభ వెలవెలబోయింది.

*తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పలేదని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు అనూహ్య సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారని వెల్లడించారు.కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండు సంవత్సరాలపాటు భక్తులు తిరుమలకు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పని చేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని చైర్మన్ అభినందించారు.

*అమ‌రావ‌తిలో జూన్ 5 నుంచి 9వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్షణ
అమ‌రావ‌తిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 5 నుంచి 9వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. జూన్ 9న ఉద‌యం 7.30 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు విగ్రహ‌ప్రతిష్ట‌, మ‌హాసంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. 4న సాయంత్రం శోభాయాత్ర‌, రాత్రి 7 గంట‌ల‌కు పుణ్యాహ‌వ‌చ‌నం, ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం, మృత్సంగ్రహ‌ణం, అంకురార్పణ నిర్వహిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

*తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బూర్గంపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల 40 నుంచి 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

*రామగుండం ఎరువుల కర్మాగారానికి పొల్యూషన్ బోర్డు షాక్ ఇచ్చింది. నేటి నుంచి యూరియా ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఎఫ్‌సీఎల్ నిబంధనలు పాటించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. గ్యాస్ లీకేజీలతో స్థానికులు అస్వస్థతకు గురవుతున్నారు. యూరియా, అమ్మోనియా, డస్ట్ లీకేజ్‌లపై ఫిర్యాదులు చేసినా నిర్లక్ష్యం వ్యవహరించడంపై రామగుండం ఎమ్మెల్యే ఫిర్యాదుతో కాలుష్య మండలి తనిఖీలు చేపట్టింది.

* ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.

*శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు సీతారాముల దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో తీర్థప్రసాదాలను అధికారులు నిలిపివేశారు. రూ.100 దర్శనానికి ప్రత్యేకంగా అధికారులు రెండు క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు.

*వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి శనివారమిక్కడ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిశారు. ఆమె భర్త రితీశ్‌ ఇప్పటికే టీడీపీలో ఉన్నారు. ఆమె అత్త విజయమ్మ కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే (ఈమె మాజీ మంత్రి బి.వీరారెడ్డి కుమార్తె). కైవల్య తన భర్తతో కలిసి టంగుటూరులో బస చేసిన లోకేశ్‌తో మాట్లాడినట్లు సమాచారం. అత్తగారి కుటుంబం ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నా ఆమె ఇంతవరకూ తెర ముందుకు రాలేదు. ఇప్పుడు తండ్రి ఆశీస్సులతో ఆమె రంగప్రవేశం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారని అంటున్నారు. ఆత్మకూరులో కొంత భాగానికి (అప్పట్లో రాపూరు నియోజకవర్గంలో ఉండేది) గతంలో ఆమె తండ్రి ఆనం ప్రాతినిధ్యం వహించారు.
*వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ తెలిపారు.

*టీటీడీ ప్రసాదాల్లో వినియోగిస్తున్న జీడిపప్పు, నెయ్యి, యాలకల్లో నాణ్యతాలోపం బట్టబయలైంది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. కాంట్రాక్టర్లు సరఫరా చేసే సరకుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన క్వాలిటీ కంట్రోల్‌ విభాగం, ఫుడ్‌ సేఫ్టీ విభాగం, మార్కెటింగ్‌ విభాగం ఎవరి ఒత్తిళ్ల వల్ల మిన్నకుండిపోయిందనే సందేహం కలిగే పరిస్థితి నెలకొంది. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ గోడౌన్‌ను వైవీ సుబ్బారెడ్డి శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పులో దుమ్ముతో పాటు విరిగిపోయిన పప్పులు ఎక్కువ శాతం కన్పించాయి. అనంతరం యాలకల నాణ్యతను గురించి అధికారులను అడగ్గా టీటీడీ నిబంధనల మేరకు వాసన లేదని వారు తెలిపారు. నెయ్యి నిల్వలను చూసి వాసన గొప్పగా లేదని అసహనం వ్యక్తం చేశారు. నాణ్యతలేని జీడిపప్పు, యాలకులు, నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్‌ ఆదేశించారు. ఏడాదికి రూ.500 కోట్ల విలువైన జీడిపప్పు, నెయ్యి, యాలకలను టీటీడీ కొనుగోలు చేస్తుందని, వీటి నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావటంతో తనిఖీ చేసినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. నాణ్యత ప్రమాణాల తనిఖీ కోసం శాంపిల్స్‌ను తిరుమలలోని టీటీడీకి చెందిన క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌తోపాటు, ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ ఫుడ్‌ అండ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌కు కూడా పంపాలని ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు.

*భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 31వ తేదీన నిర్వహించునున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దిల్లీరావు అధికారులకు సూచించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమ నిర్వాహణపై శనివారం అధికారులతో కలెక్టర్‌ కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ దిల్లీరావు మాట్లాడుతూ ఈనెల 31న నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు.

*రుతుక్రమం సమయంలో పరిశుభ్రత పాటించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్‌ దిల్లీరావు అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ రుతుక్రమం పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో పరిశుభ్రతపై మునిసెఫ్‌ రూపోందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజయ్‌ మాట్లాడారు. పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారి జి.ఉమాదేవి, ఉమామహేశ్వరరావు ఉన్నారు.

*జాన్‌ 5వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రజలను పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యవంతులుగా చేయాలని కలెక్టర్‌ దిల్లీరావు అధికారులకు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన కలెక్టర్‌ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ దిల్లీరావు మాట్లాడుతూ పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల జీవవైవిధ్యం దెబ్బతినడంతోపాటు అనేక ఉపద్రవాలు సంభవిస్తున్నాయన్నారు.

*నాణ్యతా ప్రమాణాలతో నిర్మించి కార్పొరేట్‌ భవనాలకు దేశవిదేశాల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన హంగులను మార్కెట్లోకి తీసుకురావడమే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌ ప్రధానలక్ష్యమని సంస్థ అమరావతి చాపటర్‌ చైర్‌పర్సన్‌ తెర్లీ బలార్కా తెలిపారు. స్థానిక దికె హోటల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్‌ మాసంలో హైదరాబాద్‌ నగరంలో 3, 4, 5 తేదీల్లో ఇంటీరియర్‌ రంగంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న సంస్థలతో ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐఐఐడీ సంస్థ హైదరాబాద్‌ రీజినల్‌ చాపటర్‌ మెంబర్‌ ఎన్‌.వి.సుబ్బారావు, ఐఐఐడీ సంస్థ అమరావతి కార్యదర్శి గిల్డా కోమల్‌, ఐఐఐడీ సంస్థ కో ఆపరేటివ్‌ మెంబర్‌ మహ్మద్‌ ఉస్మాన్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

*కోనసీమ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ పాల్‌రాజు తెలిపారు. అయితే…పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి పాలిసెట్‌ పరీక్షను ఆదివారం నిర్వహించనున్న నేపథ్యంలో ఇంటర్నెట్‌ లేకపోవడం వల్ల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై స్పందించిన తీరుపట్ల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

*శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు శతజయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం రణస్థలం మండలం వీఎన్‌ పురంలో ఎన్టీఆర్‌ ఆలయ నిర్మాణానికి సర్పంచ్‌ కలిశెట్టి రమణమ్మ శంకుస్థాపన చేశారు. బడుగుల అభివృద్ధి కోసం అన్న ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని ఆమె పేర్కొన్నారు. గ్రామపెద్దలు, దాతల సహకారంతో ఎన్టీఆర్‌కు ఆలయాన్ని నిర్మించనున్నట్టు వెల్లడించారు.

*మాజీ సీఎం ఎన్టీఆర్‌ కీర్తి అజరామరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొనియాడారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం సందేశమిచ్చారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘విభిన్న రంగాల్లో మహా నాయకుడిగా విశ్వ విఖ్యాతులైన ఎన్టీఆర్‌ నూరవ ఏట ప్రవేశించారు. 50వ దశకం ఆరంభంలో తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా 80వ దశకం వరకు తెలుగువాళ్లను మదరాసీలనే పిలిచేవారు. ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తట్టి లేపిన తరువాతే తెలుగు జాతికి విశిష్ఠమైన గుర్తింపు లభించనారంభించింది. అఖిలాంధ్ర ప్రజానీకం నీరాజనాలుపట్టి ఆయనకు అపూర్వ విజయం ప్రసాదించి దేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయన పుట్టిన రోజులు జరుపుకుంటూనే ఉంటారు. తెలుగు ప్రజలు ఎన్నెన్నో శత జయంతులు జరుపుతూనే ఉంటారు. ఆయన కీర్తి అజరామరం. ఆ మహానాయకుడికి, మార్గదర్శకుడికి నా నమస్సులు’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

* శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు సిద్ధం చేసిన జీడిపప్పును స్వయంగా పరిశీలించారు. మూడు కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా ఒక కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పులో దుమ్ము, విరిగిపోయినవీ చాలా ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు.

* అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్యశాఖ మంత్రిని పదవి నుంచి బర్తరఫ్‌ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 424 మంది ప్రముఖులకు సెక్యురిటీ రద్దు చేశారు. ప్రముఖులకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు శనివారం ప్రకటించారు. గత నెలలో కూడా 184 మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను రద్దు చేస్తూ భగవంత్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

*నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులు వర్క్‌ ఏజెన్సీల ప్రతినిధులను రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు శనివారం ఆయన అమరుల స్మారక చిహ్నం నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అమరుల స్మారక చిహ్నం మెయిన్‌ ఎంట్రీ ఫ్లోరింగ్‌ ఎస్కలేటర్‌ లిఫ్ట్‌ ఏరియా క్లాడింగ్‌ పనులను పరిశీలించారు.

*కరోనా వల్ల రెండేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు శనివారంతో ముగిశాయి. ప్రధాన పరీక్షలన్నీ పూర్తవ్వగా.. వొకేషనల్‌ విద్యార్థులకు మాత్రం జూన్‌ న చివరి పరీక్ష ఉంది. జూన్‌ లోపు ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్‌ తేదీ వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహించనున్నారు. పది ఉమ్మడి జిల్లా కేంద్రాలను స్పాట్‌ వాల్యుయేషన్‌ సెంటర్లుగా ఏర్పాటు చేశారు. కాగా శనివారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో ఒక మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదైనట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.

*గ్రేటర్‌ వరంగల్‌ పరిధి మూడో డివిజన్‌లోని ఆరెపల్లి పోచమ్మ దేవాలయం వద్ద గ్రామసభలో పాల్గొన్న ‘తీన్మార్‌’ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను కాజీపేట ఏసీపీ శ్రీనివాస్‌ నేతృత్వంలో పోలీసులు శనివారం బలవంతంగా అరెస్టు చేశారు. రింగురోడ్డు నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్‌ పూలింగ్‌ పథకంపై జరుగుతున్న రైతు గ్రామసభలో ఆయన ప్రసంగిస్తుండగా పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చారు. మల్లన్నను అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, స్థానిక మహిళలు ‘పోలీస్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు మాత్రం తీన్మార్‌ మల్లన్నను బలవంతంగా అరెస్టు చేసి వేలేరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

*తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలు విజయశాంతి ఇటీవల అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళతో భేటీ అయ్యారు. శశికళ జైలు నుంచి బయటికొచ్చాక ఆమెను పరామర్శించి వెళ్లిన విజయశాంతి.. మళ్లీ ఇటీవల చిన్నమ్మను కలుసుకుని చర్చించారంటూ ఆమె సన్నిహితులు తెలిపారు. భవిష్యత్తు రాజకీయాలపై వారిద్దరూ చర్చించుకున్నారంటూ వారు లీకులు ఇచ్చారు.

*హిందువులు, ముస్లింల మధ్య శాంతి, సామరస్యాలకు భంగం కలిగిస్తూ పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని పలువురు మేధావులు కోరారు. ఈ మేరకు 50 మంది మేధావులు, విద్యావంతులు, రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, జర్నలిస్టులు హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సకు లేఖ రాశారు. ఈ లేఖను సుమోటో పిటిషన్‌గా స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంజయ్‌ ఓ ర్యాలీలో మాట్లాడుతూ ‘అన్ని మసీదులను తవ్వుతాం.. శవాలు దొరికితే మీకు, శివలింగాలు దొరికితే మాకు’ అంటూ తీవ్ర అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

*సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు బొగ్గు లోడ్‌తో తొలి రైలు ట్రయల్‌ రన్‌ను శనివారం విజయవంతంగా నిర్వహించారు. పర్యావరణహితంగా బొగ్గు రవాణా చేయాలన్న లక్ష్యంతో సింగరేణి-దక్షిణ మధ్య రైల్వే(ఎ్‌ససీఆర్‌) సంయుక్తంగా నిర్మించిన 54 కిలోమీటర్ల ఈ రైలు మార్గం ఇటీవల పూర్తయింది. సత్తుపల్లి వద్ద గల జె.వి.ఆర్‌. ఓపెస్‌ కాస్ట్‌ గనులు, కిష్టారం ఓపెన్‌ కాస్ట్‌ గనుల నుంచి రోజుకు 30 వేల టన్నుల బొగ్గు, ఏడాదికి 100 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసే లక్ష్యంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించారు. ఎస్‌సీఆర్‌ నిర్మించిన రైల్వే లైన్లలో ఈ మార్గం అత్యంత వేగంగా, అతి తక్కువ సమయంలో పూర్తయింది. ఈ బొగ్గును వందలాది లారీల ద్వారా 60 కిలోమీటర్ల దూరంలో గల కొత్తగూడెం (రుద్రంపూర్‌), కోల్‌హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌(సి.హెచ్‌.పి.)కు రవాణా చేసి.. అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా పాల్వంచ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు, ఇతర రాష్ట్రాల థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు, పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు.

*రెవెన్యూశాఖలో భూముల వివాదాల పరిష్కారాలకేకాదు.. అధికారులు పోస్టింగులు దక్కించుకోవడానికీ నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతోకాలంగా ఎదురుచూసున్న 13 మంది తహసీల్దార్లకు వివిధ జిల్లాల్లో పోస్టింగులు ఇస్తూ సీసీఎల్‌ఏ ఇన్‌చార్జ్‌ సోమేశ్‌ కుమార్‌ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. తహసీల్దార్లు జి.లక్ష్మణ్‌, జె.సంజీవను ములుగు జిల్లాలకు పంపారు. కె.కిశోర్‌కుమార్‌ను మహబూబాబాద్‌కు, బి.భాస్కర్‌ను రాజన్న-సిరిసిల్ల జిల్లాకు, ఎ.నిర్మలను హైదరాబాద్‌కు, ప్రేమలత, ఎ.కె.అనురాధ, మజహర్‌అలీలను హెచ్‌ఎండీఏకు, జి.జగదీశ్వర్‌, వి.దయాకర్‌రెడ్డిలను నారాయణపేట జిల్లాకు, మహ్మద్‌ అశ్వాక్‌పాషాను జీహెచ్‌ఎంసీకి, ఇలియాస్‌ అహ్మద్‌ను మైనార్టీ సంక్షేమశాఖకు, పి.శ్రీనివాసరావును నాగర్‌కర్నూలు జిల్లాలకు కేటాయించారు.

*కరోనా వల్ల రెండేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు శనివారంతో ముగిశాయి. ప్రధాన పరీక్షలన్నీ పూర్తవ్వగా.. వొకేషనల్‌ విద్యార్థులకు మాత్రం జూన్‌ 1న చివరి పరీక్ష ఉంది. జూన్‌ 25లోపు ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్‌ 2 నుంచి 11వ తేదీ వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ నిర్వహించనున్నారు. పది ఉమ్మడి జిల్లా కేంద్రాలను స్పాట్‌ వాల్యుయేషన్‌ సెంటర్లుగా ఏర్పాటు చేశారు. కాగా, శనివారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5029 మంది గైర్హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో ఒక మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదైనట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.

* బెజవాడలో మాజీమంత్రి వెల్లంపల్లి అనుచరులు ఏలూరు రోడ్డులోని ఓ బిల్డింగ్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బిల్డింగ్‌పై కోర్టులో విచారణ జరుతుండగా.. వెల్లంపల్లి అనుచరుల దౌర్జ్యనానికి పాల్పడుతున్నారని, పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు వాపోతున్నారు. వెల్లంపల్లి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

*నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. 1వ తేదీ శ్రీకాకుళం జిల్లా, 2న విజయనగరం జిల్లా, 3 న విశాఖపట్నం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటిస్తారు. జనసేన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి దిశానిర్దేశం చేస్తారు. నాగబాబు సమక్షంలో జనసేన‌ పార్టీలో వివిధ పార్టీలు నాయకులు చేరనున్నట్లు సమాచారం.