Devotional

గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఏర్పాటు చేస్తారు?

గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఏర్పాటు చేస్తారు?

గుడికి వెళ్లగానే ముందుగా కనిపించేది ధ్వజస్తంభమే. గర్భగుడిలో ప్రతిష్ఠించే దేవతా విగ్రహం వంటిదే ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం. ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ధ్వజస్తంభం ఉండే దైవక్షేత్రాన్ని మాత్రమే దేవాలయం అంటారు. దేవాలయాల్లో షోడశోపచార పూజలు జరగాలంటే ఈ ధ్వజస్తంభం తప్పనిసరిగా ఉండాలి. మూలవిరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దీనిని ప్రతిష్ఠిస్తారు.
గర్భగుడిలో ఉండే దైవానికి చేసే అనుష్ఠాన అర్చనల ప్రభావం వల్ల, ధ్వజస్తంభానికి కూడా శక్తి కలుగుతుంది. అందుకే మూలవిరాట్టును దర్శించుకోవడానికి ముందే దీనికి నమస్కార, ప్రదక్షిణలు చేయాలి. ద్వాపరయుగంలో మణిపుర రాజు మయూరధ్వజుడి త్యాగశీలాన్ని మెచ్చిన శ్రీకృష్ణుడు, అతని కోరిక మేరకు దైవసన్నిధిలో స్తంభమై కొలువుదీరమని వరాన్ని ప్రసాదించాడు. ఈ క్రమంలో మయూరధ్వజుడి ఆత్మస్వరూపంగా అదే పేరుతో ఆలయాల్లో ధ్వజస్తంభాన్ని విధిగా ఏర్పాటుచేసే సంప్రదాయం మొదలైందని జైమినీ భారతం చెపుతుంది. ఆలయంలో మూలమూర్తికి జరిగే దీపారాధనలు, నైవేద్యం తదితర ఉపచారాలన్నీ ధ్వజస్తంభానికి కూడా విధిగా చేస్తారు. తొలుత ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాతే ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలన్న నియమం ఉంది.