Devotional

మ‌ల్ల‌న్న ప‌ట్నాలు ఎలా వేస్తారు? కొముర‌వెల్లి, ఐన‌వోలు ప‌ట్నాల ప్ర‌త్యేకత ఏంటి?

మ‌ల్ల‌న్న ప‌ట్నాలు ఎలా వేస్తారు? కొముర‌వెల్లి, ఐన‌వోలు ప‌ట్నాల ప్ర‌త్యేకత ఏంటి?

ప్రజలకు ఏ కష్టమొచ్చినా.. ఇంటి దైవాన్ని తలుచుకుంటారు. గండాలు దాటితే, కోరికలు నెరవేరితే.. ఎత్తు బంగారం, కోడె కట్టడం, కోళ్లు/ యాటలను కోయడం, తలనీలాలు సమర్పించడం.. ఇలా ఒక్కో తీరుగా మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి మొక్కుల్లో ప్రత్యేకమైనది.. మల్లన్న పట్నం. తెలంగాణలోని మల్లికార్జున స్వామి ఆలయాల్లో ఈ మొక్కులు సుప్రసిద్ధం.

తెలంగాణలోని వివిధ కులాల ప్రజలు మల్లన్నను కులదైవంగా, ఇంటి దేవుడిగా పూజిస్తారు. ఏటా లేదా రెండుమూడేండ్లకు ఒకసారి మల్లన్న పట్నాలు వేసి, పండుగ చేసుకుంటారు. మల్లికార్జున స్వామి కొలువైన కొమురవెల్లి, ఐనవోలు ఆలయాల్లో ‘పట్నం’ వేసి మొక్కు చెల్లించుకోవడం వందల ఏండ్లుగా కొనసాగుతున్న ఆచారం.

ఓ ప్రత్యేక కార్యక్రమం..
పట్నం అంటే ముగ్గు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమం. ప్రకృతి సిద్ధమైన పంచ (ఐదు) రంగులను ఉపయోగించి పట్నం వేస్తారు. ఇందుకోసం పసుపు, కుంకుమ, గులాబీ రంగు కుంకుమ, ఆకుపచ్చ పొడి (తంగేడు, చిక్కుడు ఆకులను ఎండబెట్టి పొడిగా చేస్తారు), తెల్ల పిండి (బియ్యపు పిండి)ని వాడుతారు. ప్రత్యేకమైన చెక్క అచ్చుల ద్వారా పట్నం వేస్తారు. పట్నానికి ‘మల్లికార్జున స్వామి కల్యాణం’ అనే అర్థం కూడా ఉంది. పట్నం మొక్కు.. తెలంగాణలో పెండ్లికి ముందు నిర్వహించే ‘పోలు బియ్యం’ సంప్రదాయాన్ని పోలి ఉంటుంది.
mallanna-patnalu
మూడు రకాలు
మల్లన్న స్వామికి మొక్కులుగా వేసే పట్నాలు మూడు రకాలు. నిడివి, కొలతను బట్టి ఒక్కో పట్నం వేయడానికి దాదాపు గంట నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. కొమురవెల్లి, ఐనవోలు ఆలయాల్లో భక్తులు తాము బస చేసిన ప్రదేశంలో బోనం ఎదుట వేసే పట్నాన్ని ‘చిలక పట్నం’ అంటారు. కొమురవెల్లి ఆలయంలో గంగరేగు చెట్టు సమీపంలో వేసే పట్నాన్ని ‘నజర్‌ పట్నం’గా వ్యవహరిస్తారు. ఆలయం లోపల మండపం దగ్గర వేసే పట్నం.. ముఖ మండప పట్నం. వీటితోపాటు మహా శివరాత్రి, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ‘పెద్ద పట్నం’ వేస్తారు.

పెద్ద వేడుక.. పెద్ద పట్నం
కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా, శివరాత్రి, శ్రీకృష్ణాష్టమి లాంటి ప్రత్యేక సందర్భాల్లో ‘పెద్ద పట్నం’ వేస్తారు. ఈ పట్నానికి చాలా ప్రాధాన్యం ఉంది. వేల మంది భక్తులు, వందలాది శివసత్తుల మధ్య ఈ వేడుక నిర్వహిస్తారు. దాదాపు 50 గజాల వైశాల్యంతో వివిధ ఆకారాలలో 42 వరుసలతో పట్నం వేస్తారు. పెద్ద పట్నం వేసే ముందు ఒగ్గు పూజారులు తమ ఆచారం ప్రకారం గర్భాలయంలోని మూల విరాట్టుకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి, కోనేట్లో స్నానం ఆచరింపజేస్తారు. పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన తర్వాత, గొంగళిలో బియ్యం పోసి మైలపోలు తీస్తారు. స్వామివారు ధరించే ఒకటే కొమ్ము ఉన్న శూలం (ఒరగొమ్ము), డమరుకాన్ని నెలకొల్పుతారు. పసుపు, కుంకుమ, తెల్ల పిండి, సునేరు, పచ్చ రంగులను ప్రమథ గణాలుగా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చిత్ర కన్ను నెలకొల్పి శివలింగాన్ని చిత్రిస్తారు. రకరకాల డిజైన్లతో సర్వాంగ సుందరంగా పట్నాన్ని తీర్చిదిద్దుతారు.

పట్నం దాటడం..
పెద్ద పట్నం వేసిన తర్వాత ఒగ్గు కళాకారులు మల్లన్న స్వామి చరిత్రను కథల రూపంలో వినిపిస్తారు. మల్లికార్జున స్వామిని ఆవహింపజేసి మొక్కులు చెల్లిస్తారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను తీసుకొని పూజారులు పట్నం దాటుతారు. వారి తర్వాత.. శివసత్తులు పట్నం పైనుంచి నడుస్తారు. ఈ వేడుకను చూసేందుకు, పట్నం ముగ్గుపొడిని సేకరించుకొనేందుకు భక్తులు పోటీ పడతారు. ఈ ముగ్గును పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పట్నాల మొక్కుల తర్వాత భక్తులు అగ్ని గుండాల కార్యక్రమంలో నిప్పుల మీద నడుస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు.