Politics

ఖైరతాబాద్‌లో గెలుపెవరిది?

ఖైరతాబాద్‌లో గెలుపెవరిది?

ఖైరతాబాద్‌ ఒకనాడు పీజేఆర్‌ అడ్డా. అప్పట్లో హైదరాబాద్‌ లోనే కాదూ, ఉమ్మడి ఏపీ (AP) లోనూ పీజేఆర్‌ నియోజకవర్గంగా ఖైరతాబాద్‌ గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంపై అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే తెలంగాణ గడ్డపై కాషాయం జెండా పాతేందుకు అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తున్న అమిత్ షా .. గ్రేటర్‌ నుంచే జైత్రయాత్ర మొదలు పెట్టేందుకు పక్కా ప్లాన్‌ చేస్తున్నారు. 2018లో చేజారిన ఖైరతాబాద్‎ను తిరిగి దక్కించుకునేందుకు నియోజకవర్గం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలైంది. వచ్చే ఏప్రిల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం కేసీఆర్‌ పక్కా ప్లాన్‌‎తో ముందుకు వెళ్తున్నారు. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ , బీజేపీ లు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్‌ ను చాలా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌ మరోసారి కూడా గెలవాలన్న పట్టుతో ఉన్నారు.

*ఇక పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దాంతో కాంగ్రెస్‎లో పరిస్థితి గందరగోళంగా మారుతోంది. ఆ పార్టీ మూడు గ్రూపులుగా మారిపోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన డాక్టర్ దాసోజు శ్రవణ్‌ మళ్లీ పోటీ చేసేందుకు తన ఏర్పాట్లల్లో తానున్నారు. ఈసారి తప్పక గెలుస్తానని చెబుతున్నా ఆ పార్టీలో వర్గ పోరు పార్టీ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. రేవంత్‌ రెడ్డి బంధువు రోహిన్‌ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన శ్రవణ్‌‎కు సహకరించకపోవడం వల్లే కాంగ్రెస్ ఆ సీటును దక్కించుకోలేక పోయిందనే చర్చ సాగుతోంది. ఈసారి తనకు టిక్కెట్ పక్కా అని ఆశల్లో ఉన్న రోహిన్‌ రెడ్డి కి.. విజయారెడ్డి కాంగ్రెస్‎లో చేరడం మింగుడుపడడం లేదు. టికెట్ హామీతోనే విజయారెడ్డి కాంగ్రెస్‎లో చేరారనే గట్టి టాక్‌ ఖైరతాబాద్ పొలిటికల్‌ సర్కిల్లో వినిపిస్తోంది.

*మరో పక్క జాతీయస్థాయిలో సాధిస్తున్న విజయాలతో బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో ఖైరతాబాద్‌‎లో ఆ పార్టీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈసారి గెలిచి తీరుతామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. బీజేపీ ఇటీవల చేయించిన సర్వేల్లో పక్కాగా గెలిచే సీట్లలో ఖైరతాబాద్ ఉండడం ఆ పార్టీలో ఆశలు రేపుతోంది. 2014లో చింతల రామచంద్రారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్నారు. అయితే ఈసారి కూడా టిక్కెట్‌ తనకే అన్న ధీమాతో ఉన్నా.. కొత్త నేతలవైపు పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తోంది. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తకే టికెట్‌ ఇవ్వాలని డిసైడైనట్టు సమాచారం.మరోవైపు బీజేపీ నేత పల్లపు గోవర్ధన్‌ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుంటున్నారు. టికెట్‌ ఇస్తే గెలుపు తనదేననే ధీమాతో ప్రజల్లో తిరుగుతున్నారు. పార్టీ పెద్దలను కలుస్తూ ఒక్క ఛాన్స్ అంటూ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ సర్వేలు కూడా బీజేపీకి అనూకులంగా రావడంతో టీఆర్ఎస్ మీద వ్యతిరేకత, కాంగ్రెస్‎లో వర్గపోరు తనకు కలిసి వస్తుందన్న సంతోషంలో ఉన్నారు. ఎన్నికలకు సమయం ఉన్నా ఖైరతాబాద్‌ రాజకీయాలు మాత్రం అడ్వాన్స్‌డ్‌‎గా మారుతున్నాయి. గెలుపు గుర్రం ఎవరో అన్న చర్చ జోరుగా సాగుతోంది.