Devotional

ఆషాఢమాసం విశిష్టత ఇదే

ఆషాఢమాసం   విశిష్టత ఇదే

ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక వారానికి, ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ/వ్రతం/పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.
ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.

**ఆషాఢమాసంలోచేసి తీరాల్సిన పనులు!
వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసంతో తనతో కొన్ని ఆచారాలనూ తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చుగాక! కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనకా ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి…

*పేలాల పిండి
ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే! ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తికి మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలిఏకాదశి రోజున తప్పకుండా పేలాలపిండి తినాలని చెబుతూ ఉంటారు.

*మునగాకు
మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటిసమస్యలన్నీ తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మునగాకు చేదుగా ఉంటుంది. పైగా విపరీతమైన వేడి. అలాంటి మునగాకుని తినేందుకే ఇదే అనువైన కాలం. లేత మునగాకు దొరకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా ఫర్వాలేదనుకున్నా… వర్షాకాలమే అనువైన సమయం. మునగాకుతో బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడినీ పెంచినట్లవుతుంది. అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశమూ దక్కుతుంది.

*దానాలు
ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం, పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతుంటారు. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు. ముఖ్యంగా గొడుకు, చెప్పులు దానం చేయమని సూచిస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ రెండు వస్తువులూ ఎంత అవసరమో చెప్పనవసరం లేదు ..

*సముద్రస్నానాలు
ఆకామావై పేరుతో సముద్రస్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢమాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకూ సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్షరుతువుతో పాటుగా అందులోకి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాలలో ఉన్న ఔషధగుణాలని తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సముద్రస్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది.

*గోరింటాకు
ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయన్న విషయం తెలిసిందే! అలా తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు. ఇక పొలం పనులలో పాల్గొనేవారైతే రోజూ నీటిలో తడవక తప్పదు. దాంతో గోళ్లు సందున నీరు చేరి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గోళ్లు కూడా పెళుసుబారిపోతాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసే సత్తా గోరింటాకుకి ఉంది. పైగా గోరింటాకుని పెట్టుకోవడం వల్ల కఫసంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు.