NRI-NRT

రాజీనామాకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సిద్ధం

రాజీనామాకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్  సిద్ధం

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు ఆ దేశ మీడియా గురువారం వెల్లడించింది. న్జర్వేటివ్ ప్రభుత్వం నుంచి రాజీనామాల పర్వం ప్రభంజనంలా సాగుతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత మంగళవారం నుంచి దాదాపు 40 మంది మంత్రులు, సహాయకులు ప్రభుత్వం నుంచి వైదొలగారు. ఈ రాజీనామాలు కొనసాగుతున్నాయి. బోరిస్ జాన్సన్‌తో బుధవారం ఆయన మంత్రివర్గ సహచరులు సమావేశాలు జరిపి, పదవి నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుత కమ్యూనిటీస్ సెక్రటరీ మైఖేల్ గోవ్ 2016లో జరిగిన బ్రెగ్జిట్ రిఫరెండం ప్రచారంలో బోరిస్‌కు మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోంది. గోవ్ ఓ పాము వంటివాడని బోరిస్ సన్నిహితుడొకరు బ్రిటిష్ మీడియాతో అన్నారు. గోవ్ 2016లోనూ, 2019లోనూ కన్జర్వేటివ్ లీడర్‌షిప్ కోసం బోరిస్‌తో పోటీ పడ్డారు. నన్ను పదవి నుంచి తొలగించాలంటే మీ చేతులు రక్తంతో తడవాల్సిందేనని బోరిస్ తన సహచరులతో అన్నారని బ్రిటిష్ మీడియా చెప్తోంది. ఆయన పార్లమెంటరీ ప్రైవేట్ సెక్రటరీ జేమ్స్ మాట్లాడుతూ, బోరిస్ జాన్సన్ పోరాడతారని చెప్పారు.