DailyDose

దుల్హన్ పధకంపై వెంటనే నిర్ణయం తీసుకోండి -TNI తాజా వార్తలు

దుల్హన్ పధకంపై వెంటనే నిర్ణయం తీసుకోండి -TNI  తాజా వార్తలు

* రాష్ట్రంలో నిలిపివేసిన దుల్హన్ పధకం పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.గతంలో దుల్హన్ పధకం అమలు చేయడం లేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత షుబ్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. దుల్హన్ పధకాన్ని రద్దు చేశామని, నిధులు లేకపోవడం వల్ల ఉపసంహరించుకున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఈరోజు మరోసారి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దుల్హన్‌ ఆపేశామన్నారు కదా.. ఏం జరిగిందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దుల్హన్ పధకం రద్దు చేశామని చెప్పడం పొరబాటని దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇదే చివరి అవకాశమని వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున సీనియర్ న్యాయవాది మొహ్మద్ సలీం భాషా వాదనలు వినిపించారు.

*ఉపాధ్యాయుల సంఘాలు లేవనెత్తిన సమస్యలపై వారితో చర్చించానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సానుకూల నిర్ణయం తీసుకుంటామని వారికి చెప్పానన్నారు. జీఓ 117లో ఉన్న అభ్యంతరాలపై సవరించిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. పాఠశాలల్లో అంగ్ల మాద్యమం ప్రభుత్వ విధానమని… దానికి కట్టుబడి ఉన్నామని.. వెనక్కి తగ్గబోమని వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలపై సంతోషంగా ఉన్నాయనే అనుకుంటున్నామని బొత్స వెల్లడించారు.

* శంషాబాద్‌లో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, కంపెనీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు. రూ. 1200 కోట్ల పెట్టుబ‌డితో ఫెసిలిటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసింది. ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంట‌ర్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి.

*మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నారాయణ మూర్తికి భార్య, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగిగా ఉన్న ఆయన రాజకీయాల్లో చేరి ప్రజాసేవకు అంకితమయ్యారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న నారాయణమూర్తి మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. నారాయణమూర్తి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

*యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ వంతుగా బంగారం విరాళంగా ఇస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ 30 తులాల బంగారాన్ని విరాళంగా సమర్పించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆలయ ఈవో గీతకు ఆయన సతీమణి బోయినపల్లి మాధవి అందజేశారు.

*తుంగభద్ర జలాశయా నికి వరద ఉధృతి పెరుగుతోంది. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం:1618.87 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ: 105.788 టీఏంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ: 58.212 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 59.757 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో: 248 క్యూ సెక్కులుగా ఉంది.

*రాణీపేట జిల్లా వాలాజా పేట సమీపంలోని తిరుప్పార్‌ కడల్‌లో వున్న రంగనాఽథస్వామి ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం ఘనంగా జరిగింది. వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో మూడు రోజులుగా యాగశాల పూజలు నిర్వహించారు. అనంతరం బుధవారం మహాకుంభాభిషేకం జరిగింది. ఈ ఉత్సవానికి వందలాదిమంది భక్తులు తరలివచ్చారు.

*నిజామాబాద్: నగరంలో వెలుగు చూసిన ఉగ్ర శిక్షణ పై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆటోనగర్‌లోని శిక్షకుడు, పీఎఫ్ఐ (PFI) ప్రతినిధి అబ్దుల్ ఖాదర్‌తో పాటు అతనికి ఆర్థిక సహకారం అందించిన మరో ముగ్గురని అరెస్ట్ చేశారు. అబ్దుల్ ఖాదర్ ఇంటిపై శిక్షణ కోసం గదిని నిర్మించేందుకు రూ.6 లక్షలు ఇచ్చిన షేక్ షాదుల్లా, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మొబిన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ అనంతరం నేడు మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శిక్షణ పొందిన వారికోసం గాలింపు కొనసాగుతోంది.

*పార్లమెంట్ సభ్యులందరికీ ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి తనపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసి సీబీ.. సీఐడీ అధికారులతో కస్టోడియల్ టార్చర్ చేశారన్నారు. తాజాగా మరోసారి తన నివాసం వద్ద పోలీసులు రెక్కీ నిర్వహించారని ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు.

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డూఆపూ లేకుండా పెంచుతున్న గ్యాస్ ధరలపై మహిళా సమైక్య నిరసనకు దిగింది. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ వినూత్నంగా కుంపటితో ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టింది. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నారా అంటూ మహిళా సమైక్య ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న సబ్సిడీ కూడా ఇంతవరకు ఇవ్వటం లేదని, గ్యాస్ సిలిండర్‌పై మరో 50 రూపాయలు ఏ రకంగా పెంచారని మండిపడింది. ఒకప్పుడు రూ.400 ఉండే గ్యాస్ బండ ధర ఇప్పుడు రూ.1160 ఉందని.. ఇప్పుడు దానిపై మరో రూ.50 పెంచారని మహిళా సమైక్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

*ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల రైతుల జీవనాధారమైన తుంగభద్ర జలాశయం నీటితో కళకళలాడుతోంది. గత మూడు రోజుల నుంచి కర్ణాటకలోని మలనాడు ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పైన ఉన్న తుంగ, భద్ర నదుల నుంచి తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. బుధవారం టీబీ బోర్డు అధికారులు ఉదయం వేసిన నీటి లెక్కల ప్రకారం డ్యాంలో 52.989 టీఎంసీల నీరు చేరాయి. ఇన్‌ఫ్లో కూడా 34,074 క్యూసెక్కులు వస్తోంది. ఇది గంటగంటకూ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురుస్తుండం వల్ల తుంగభద్రకు నీరు ఉధృతంగా చేరుతున్నాయి. తుంగభద్ర జలాశయం కింద ఖరీఫ్‌ సాగు నీటి విడుదలకు ఇప్పటికే ఐసీసీ సమావేశంలో తేదీలు ఖరారు చేశారు. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల్లో జరుగుతున్న అధునికీకరణ పనులు వేగవంతం చేయాలని బోర్డు అఽధికారులకు సూచనలు ఇస్తున్నారు. ఐసీసీ సమావేశంలో నిర్ణయించిన తేదీల కన్నా ముందుగానే కాలువలకు నీరు విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తుంగభద్ర నుంచి నీటి కోటా ప్రకారం రెండు రాష్ట్రాలు ఇంకా ఇండెంట్‌ కోరలేదు. దీని బట్టి నీరు ఎప్పడు వదిలేది అధికారులు నిర్ణయం తీసుకుంటారు. తుంగభద్రలో నీరు పెరుగుతుండడంతో పరిసర రైతులు జలాశయాన్ని చూస్తూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

*ఉపాధ్యాయుల సంఘాలు లేవనెత్తిన సమస్యలపై వారితో చర్చించానని మంత్రి బొత్స సత్యనారాయణ ) పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సానుకూల నిర్ణయం తీసుకుంటామని వారికి చెప్పానన్నారు. జీఓ 117లో ఉన్న అభ్యంతరాలపై సవరించిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. పాఠశాలల్లో అంగ్ల మాద్యమం ప్రభుత్వ విధానమని… దానికి కట్టుబడి ఉన్నామని.. వెనక్కి తగ్గబోమని వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలపై సంతోషంగా ఉన్నాయనే అనుకుంటున్నామని బొత్స వెల్లడించారు.

*రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 32లక్షల ఎకరాలకు చేరింది. అన్ని పంటలు కలిపి ఇప్పటివరకు 43.31 లక్షల ఎకరాల్లో సాగైనట్లు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక సమర్పించింది. ఈ వానాకాలంలో 75లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. దాంట్లో ఇప్పటి వరకు రైతులు 5% వరకు సాగు చేశారు. కంది సాగు లక్ష్యం 15లక్షల ఎకరాలు కాగా… 2.72 లక్షల ఎకరాల్లో ఇప్పటిదాకా వేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

* తపాలా శాఖ హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని 5120 పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులతో పార్సిల్‌ సర్వీసులను వినియోగించుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తపాలా శాఖ సహాయ సంచాలకుడు సీహెచ్‌. రామకృష్ణ తెలిపారు. అలాగే 11 ప్రదేశాల్లో సురక్షిత, ట్యాంపర్‌ ప్రూఫ్‌ ప్యాకేజింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కస్టమర్‌ ఫ్రెండ్లీ ఇండియా పోస్టల్‌ పార్శిల్‌ ేసవలను బుధవారం జనగామ ప్రధాన పోస్టాఫీసులో హైదరాబాద్‌ రీజియన్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పీవీఎ్‌స.రెడ్డి లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు. గ్రామ స్థాయిల్లో ఔత్సాహిక వ్యాపారుల సహకారంతో 654 ఫ్రాంఛైజీ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌లలోనూ పార్సిళ్లను బుక్‌ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. గద్వాల్‌, పోచంపల్లి కేంద్రాల నుంచి పార్సిళ్లను సురక్షితంగా చేరవేయడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామన్నారు.

* రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల అనుబంధానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతి లేకుండా జేఎన్టీయూ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేయడం పట్ల భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్‌ (యూఎ్‌సఎ్‌ఫఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మాదం తిరుపతి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ కాలేజీల గుర్తింపు విషయంలో జేఎన్టీయూ అధికారులు నిబంధనలు ఎందుకు పాటించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

*జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ నిజమైన వారసుడు ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఆర్టికల్‌ 370, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి నిర్ణయాలు అందులో భాగమేనని పేర్కొన్నారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం, దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్‌ ముఖర్జీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.

*ఇష్టదైవానికి భక్తులు సమర్పించే బంగారు ఆభరణాల లెక్కను పక్కాగా ఉంచేందుకు దేవాదాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా దేవాలయాల్లోని నగల విలువను అంచనా వేసి సంబంధిత రిజిస్టర్లను రాష్ట్ర ఆర్కీవ్స్‌ విభాగానికి దేవాదాయశాఖ అందజేస్తోంది. అందులో భాగంగా తాజాగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ఆభరణ రిజిస్టర్‌ని దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌.. ఆర్కీవ్స్‌ విభాగానికి అందజేశారు. కాగా.. ఇప్పటికే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి వంటి ప్రముఖ ఆలయాల్లోని బంగారు ఆభరణాల లెక్కలు హైదరాబాద్‌లోని ఆర్కీవ్స్‌ ప్రధాన కార్యాలయానికి చేరాయి.

*ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది తిండి లేక ఆకలి సమస్యతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. వీళ్లలో 92 కోట్ల మంది తీవ్ర ఆహార భద్రత ముప్పును ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు. అంటే ఈ భూమ్మీద ఉన్న జనాభాలో పావు వంతుకు పైగా ప్రజలు ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. 2021 సంవత్సరానికి సంబంధించిన ుప్రపంచ ఆహార భద్రత నివేదిక్‌ను యూఎన్‌ విడుదల చేసింది. 34 కోట్ల మంది తీవ్ర ఆహార కొరతతో అలమటిస్తున్నారని వాపోయింది. శరీరానికి అవసరమైనంత మేర పోషకాహారం తీసుకోలేని వాళ్ల సంఖ్య 310 కోట్లకు పెరిగినట్టు అందులో పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార ధరలు మానవ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తున్నాయో చెప్పేందుకు ఇది నిదర్శనమని తెలిపింది.

*బల్కంపేట ఎల్లమ్మ తల్లి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. కల్యాణ ఘట్టంలో చివరి అంకమైన ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించి హారతి ఇచ్చి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం 6.00 గ ంటలకు ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైంది.

* ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొనే జగన్‌రెడ్డి తన సొంత పత్రికను వలంటీర్లకు ఉచితంగా ఇవ్వలేరా? అని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘‘వలంటీర్లకు నెలకు రూ.ఐదున్నర కోట్లు ప్రభుత్వ సొమ్ము ఇచ్చి వారితో సొంత పత్రిక సాక్షి కొనిపించి, ఆ డబ్బులు తన ఖజానాలో వేసుకోవడానికి సీఎం జగన్‌రెడ్డి కన్నింగ్‌ ఆలోచనలు అమలు చేస్తున్నారు. జగన్‌రెడ్డి ఏం చేసినా ప్రభుత్వ ఖజానాను తను… తన మనుషులు దోచుకోవడానికేనని ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతోంది. రాష్ట్ర ప్రజలపై అమితమైన పన్నుల భారాలు వేసి ఆ డబ్బును సాక్షి పత్రిక ఖజానాకు తరలిస్తున్నారు. పేదలకు ఉపయోగపడే పథకాలకు నిధులు ఇవ్వడానికి మాత్రం జగన్‌రెడ్డికి చేతులు రావడం లేదు. ఇంత దుర్మార్గంగా మరే ప్రభుత్వం వ్యవహరించలేదు’’ అని విమర్శించారు. ‘‘జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులను కాలి కింద బానిసల మాదిరిగా చూస్తోంది. ఈ మూడేళ్లలో మొదటి తేదీన జీతాలు అందుకొన్న నెలలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. రివర్స్‌ పీఆర్‌సీతో ఉన్న జీతాల్లో కోత విధించారు. కాని తమ పార్టీ కార్యకర్తలైన వలంటీర్లకు మాత్రం నిధులు కురిపిస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకంలో ప్రజలను పీడించుకొని లంచాలు తింటున్న వలంటీర్లకు సేవా రత్న, సేవా వజ్ర అంటూ అవార్డుల పేరుతో ఏటా రూ.485 కోట్లు దోచి పెడుతున్నారు’’ అని యనమల విమర్శించారు. కాగా ఇదే అంశంపై దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం ట్వీట్‌ చేశారు. జగన్‌రెడ్డి తన సొంత పత్రికకు రూ.కోట్లు దోచిపెట్టడంపై మండిపడ్డారు. వివిధ వృత్తులు చేసుకొనే వారిపైనా పన్ను వేయాలన్న ప్రభుత్వ ఆలోచనను దునుమాడారు.

*రాష్ట్రంలోని తపాల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి విజయవాడలో ఈనెల 22న డాక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు తపాల శాఖ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ అభినవ్‌ వాలియా తెలిపారు. తమ సమస్యలను ఆర్జీదారులు కాగితంపై రాసి కవర్‌లో కె.సుధీర్‌బాబు, అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌(పీజీ అండ్‌ వెల్ఫేర్‌), చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌, ఏపీ సర్కిల్‌ చిరునామాకు పంపాలని తెలిపారు. కవర్‌పై డాక్‌ అదాలత్‌ అని రాసి పంపాలని సూచించారు.

*సోమందేపల్లి మండలం గుడిపల్లిలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర నారాయణ కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త కళ్యాణ్ఇం టి‌పై మూకుమ్మడి దాడి చేశారు. ఇంటికి కరెంట్ సరఫరా కట్ చేసి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. అడ్డు వచ్చిన మహిళలపైనా విచక్షణా రహితంగా దాడి చేశారు. సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర నారాయణ సోదరుడు మల్లికార్జున అనుచరులని బాధితులు చెబుతున్నారు.

*అమర్తలూరు మండలం ఇంటూరులో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనకు వ్యతిరేకంగా గ్రామ, పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనపడుతోందని, వైసీపీలో మోసానికి గురైన వారు టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. విజయమ్మ, షర్మిళ చేతిలో బైబిల్ పట్టుకున్నారని దళితులు ఎగబడి ఓట్లు వేశారని, అయితే ప్రస్తుతం జగన్ మాత్రం స్వామీజీల దగ్గర, గంగలో మునిగి జంజం వేసుకున్నాడని పేర్కొన్నారు. అసలు జగన్ మోహన్ రెడ్డి హిందువో… క్రిస్టియనో ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు. సీబిఐ కేసు దర్యాప్తు ప్రారంభమయితే జగన్ జైలుకి వెళ్తారని అన్నారు.

*పాఠశాల విద్య గందరగోళంగా మారిన నేపథ్యంలో గురువారం ఉపాధ్యాయ సంఘాలతో విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరపనున్నారు. ఉదయం 8 గంటలకు విజయవాడలోని తన కార్యాలయానికి చర్చలకు రావాలంటూ పాఠశాల విద్యాశాఖ సంఘాలను ఆహ్వానించింది. ప్రతి సంఘం నుంచి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది.

*నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి 100 మంది విద్యార్థులతో అడ్మిషన్లు ప్రారంభించడానికి అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయగిరిలోని ఎంఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(మెరిట్స్‌)ని సందర్శించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఏఎన్‌జీఆర్‌ఏయూ, డీఏఆర్‌ఈ- ఐసీఏఆర్‌ నిబంధనల ప్రకారం ఎంఆర్‌ఆర్‌ సంస్థలోని అన్ని మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని, ప్రస్తుతమున్న సిబ్బందితో మేకపాటి గౌతమ్‌రెడ్డి వ్యవసాయ కళాశాల స్థాపనకు రూ.1,877.10 లక్షల బడ్జెట్‌తో ప్రభుత్వం అనుమతించింది.

*ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ.పాల్‌ ‘ప్రజాయాత్ర’ చేపడుతున్నట్టు ఆ పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల కో-ఆర్డినేటర్‌ ఎం.సుస్మిత తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆమె యాత్ర షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ నెల 9న విశాఖపట్నంలో పారంభమయ్యే ఈ యాత్ర ఈ నెల 22న కర్నూల్లో ముగుస్తుందన్నారు.

*విజయవాడలోని రైల్వేకోర్టుకు టీడీపీ నేతలు బుధవారం హాజరయ్యారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసు ఆంక్షలను ఉల్లంఘించి ఆందోళన చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి రైల్వే కోర్టుకు హాజరయ్యారు. విచారణ తదుపరి కేసును న్యాయమూర్తి ఈ నెల 15కి వాయిదా వేశారు.

*‘రాష్ట్రంలో గడచిన మూడేళ్లుగా బీజేపీ, వైసీపీ రంకు రాజకీయం చేస్తున్నాయి. బీజేపీతో వైసీపీ వివాహం కాకుండానే సహజీవనం చేస్తోంది’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడ దాసరి భవనంలో మీడియాతో బుధవారం మాట్లాడారు. ‘‘ఈ బంధంపై 2024 తర్వాత స్పష్టత ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. జరగాల్సిన పనులన్నీ జరిగిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నట్టుగా ఈ పార్టీల తీరు ఉంది. పైగా 2024 ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా షరతుతో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములవుతామని వైసీపీ చెప్పడం సిగ్గుచేటు. జగన్‌ పత్రికను ఒక కరపత్రంగా చేసుకుని రూ.కోట్లు దోచి పెడుతున్నారు. ఇతర పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఎందుకు ఇవ్వడం లేదు? ఏకపక్షంగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడానికి అది ప్రభుత్వ సొమ్మా? లేక జగన్‌ సొంత సొమ్మా? అంత ఖర్చు చేయడం కన్నా ఆ పత్రికను ఆర్టీసీ మాదిరిగా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే మంచిది’’ అని సూచించారు. పత్రికలకు ప్రకటనల విషయంలో జరుగుతున్న అన్యాయంపై పాత్రికేయ సంఘాలతో కలిసి ఢిల్లీ స్థాయిలో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతామని రామకృష్ణ ప్రకటించారు.

*కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు జూలై 7 నుంచి ఏడు రోజుల పాటు జరగనున్నాయి. 700 ఏళ్ల తర్వాత ఓరుగల్లు గడ్డపై కాకతీయుల వారసులు కాలు మోపబోతున్నారు. 22వ తరం వారసుడు కమల్ చంద్ భంజ్ దేవ్ కాకతీయకు ఘన స్వాగతం పలికేందుకు కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‌లో ఏర్పాట్లు చేశారు. భద్రకాళీ అమ్మవారి దర్శనం అనంతరం ఆయనను అశ్వక దళంతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. 700 మంది పేరిణి కళాకారులతో మహా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. కోటలో అశ్వక విన్యాసాలు అబ్బుర పరుస్తున్నాయి

*ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ‘ప్రజాయాత్ర’ చేపడుతున్నట్టు ఆ పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల కో-ఆర్డినేటర్‌ ఎం.సుస్మిత తెలిపారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆమె యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 9న విశాఖపట్నంలో పారంభమయ్యే ఈ యాత్ర ఈ నెల 22న కర్నూల్‌లో ముగుస్తుందన్నారు. ప్రజలు తమ సమస్యలను కేఏ పాల్‌కు స్వయంగా తెలియజేయవచ్చని సుస్మిత తెలిపారు.

*ఇతర దేశాలపై దాడి చేయడానికి తమ భూభాగాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వబోమని ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ సుప్రీం లీడర్ హెబతుల్లా అఖుండ్‌జాదా బుధవారం చెప్పారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఇతర దేశాలను కోరారు. ఈద్-ఉల్-అజా కు ముందు ఆయన ఈ సందేశాన్ని ఇచ్చారు.

*ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ మండలం గుండారానికి చెందిన షేక్ షాదుల్లా, మల్లెపల్లి వాసి మహ్మద్ ఇమ్రాన్, దారుగల్లీ వాసి మహ్మద్ అబ్దుల్ మొబిన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల నుంచి 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ నాగరాజు మాట్లాడారు. పీఎఫ్‌ఐ ప్రతినిధులుగా ముగ్గురు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ముగ్గురూ కలిసి ఆటోనగర్‌లో అబ్దుల్ ఖాదర్ ఇంట్లో యువతకు శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. అమాయకులైన యువకులను చేరదీసి విచిన్నకర భావజాలం నేర్పుతున్నారని సీపీ తెలిపారు.

*భద్రాచలం సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు వచ్చింది. రామాలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో బుధవారం ఆలయ హుండీల లెక్కింపు నిర్వహించారు. ఇందులో రూ.1,82,33,186 నగదు, 130గ్రాముల బంగారం, ఒక కేజీ 900 గ్రాముల వెండి, 467 అమెరికా డాలర్లు, 10 యూఏఈ దీరామ్స్‌, ఇతర దేశాల కరెన్సీ వచ్చింది. ఇదిలాఉండగా దేవస్థానం హుండీలను చివరిసారిగా మే 2న లెక్కించామని, 65 రోజుల అనంతరం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించినట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు.

*రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉత్తర బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌బీఎస్‌టీసీ) సహాయంతో ఒక ప్రైవేట్ బస్సు ఆపరేటర్ సిలిగురి-కక్కర్‌విట్ట-ఖాట్మండు బస్సు సర్వీసును ప్రారంభించారు.రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఈ బస్సు సర్వీసును ప్రారంభించారు.ఈ బస్సు టెన్జింగ్ నార్గే బస్ టెర్మినస్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు రోజూ నడుస్తుంది. 615 కిలోమీటర్లు ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఖాట్మండు చేరుకుంటుంది. ఒక్కొక్కరికి బస్సు టికెట్ ధర రూ.1500.‘‘చాలా గ్యాప్ తర్వాత ఈ బస్సు సర్వీసు ప్రారంభించటం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. ఉత్తర బెంగాల్, నేపాల్ మధ్య పర్యాటకం వృద్ధి చెందుతోంది, భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు.

* రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 32లక్షల ఎకరాలకు చేరింది. అన్ని పంటలు కలిపి ఇప్పటివరకు 43.31 లక్షల ఎకరాల్లో సాగైనట్లు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక సమర్పించింది. ఈ వానాకాలంలో 75లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. దాంట్లో ఇప్పటి వరకు రైతులు 5% వరకు సాగు చేశారు. కంది సాగు లక్ష్యం 15లక్షల ఎకరాలు కాగా… 2.72 లక్షల ఎకరాల్లో ఇప్పటిదాకా వేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

*ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆగస్టు నెలలో ఆహార భద్రత కార్డులు కలిగిన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి. అనిల్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌-19 సంక్షోభం ఏర్పడినప్పటినుంచి ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ కింద కేంద్రం పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న విషయం విదితమే! 2022 జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఈ పంపిణీ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా అప్పుడప్పుడూ కోటాకు కోత పెడుతూ వస్తోంది. గత మే నెలలో మొత్తానికే ఉచిత బియ్యం పంపిణీని ఎత్తివేసింది.

*ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు అన్ని రకాల పాఠశాలలకు నెలలో రెండో శనివారం సెలవు ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ జూలై నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు ఇది అమల్లో ఉంటుందని, ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు తరగతులు, సెషన్లు కూడా నిర్వహించడానికి వీల్లేదని స్పష్టంచేసింది.

* ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌-2022 పరీక్షల్లో మూడో రోజు 94.25శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఉదయం సెషన్‌లో 19,419 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 19,382 మంది పరీక్ష రాశారని వివరించింది.

*రాష్ట్రంలో మూడు జిల్లాలకు కొత్త డీఎంహెచ్‌వోలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా వైద్యాధికారిగా ఆర్‌.రామనారాయణరెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఆయన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమానికి జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్యాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ యు.శ్రీహరిని తిరుపతి జిల్లా డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు. ఒంగోలు జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ ఎస్‌.ఖాన్‌ను గుంటూరు జిల్లా డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఏడు రోజుల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు కింద కేంద్రప్రభుత్వం రూ.879.08 కోట్లు విడుదల చేసింది. నిధుల పంపిణీ తర్వాత లోటు ఏర్పడిన రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ నిధులిచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.10,549 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేయగా.. ఇప్పటి వరకు కేంద్రం రూ.3,516.33 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం జూలై నెలకు సంబంధించి ఆంధ్ర సహా 14 రాష్ట్రాలకు కలిపి రూ.7,183.42 కోట్లు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

*అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సుబేదార్‌ కుంట చెరువును ఆక్రమించడాన్ని సవాల్‌ చస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, అనంతపురం కలెక్టర్‌, కళ్యాణదుర్గం ఆర్డీవో, తహశీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణల విషయంలో సుమోటోగా నమోదు చేసిన పిల్‌తో ప్రస్తుత వ్యాజ్యాన్ని జతచేయాలని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. కళ్యాణదుర్గంలోని సుబేదార్‌కుంట చెరువు ఆక్రమణను అడ్డుకోవాలని కోరుతూ కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జి ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ చెరువును పూడ్చి ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైసీపీకి చెందిన ఓ మంత్రి, అనుచరుల ప్రోద్బలంతో కబ్జా ప్రక్రియ సాగుతోందన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

*ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని నందిగామ నెహ్రూనగర్‌లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం ఉదయం టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ), టీడీపీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానంపై ఆందోళనకు దిగారు. గతంలో ఉన్న విద్యా విధానాన్ని అమలు చేయాలని తంగిరా సౌమ్య డిమాండ్ చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెనను తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. నాడు నేడు పేరుతో నాణ్యత లోపాలతో నిర్మాణాలు జరుగుతున్నాయని సౌమ్య ఆరోపించారు.