Devotional

ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

ఆగస్టు 5న తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. ఇందుకోసం రూ.1,001/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, బ్రేక్ ద‌ర్శ‌నాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ వ్ర‌తం టికెట్లను త్వ‌ర‌లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తారు.

2. దుర్గగుడి హుండీల ఆదాయం రూ.1.70 కోట్లు
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలోని హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మొత్తం 45 హుండీలలో 43 హుండీల ఆదాయాన్ని లెక్కించారు. గడిచిన 10 రోజుల్లో రూ.1,70,04,484ల నగదు, 538 గ్రాముల బంగారం, 3 కేజీల 745 గ్రాముల వెండి వస్తువులను భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఈ-హుండీ ద్వారా రూ.35,626లు లభించింది. సగటున రోజుకు రూ.17లక్షల చొప్పున ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈవో భ్రమరాంబ హుండీల లెక్కింపును పర్యవేక్షించారు.

3. ముగిసిన శాకంబరీ ఉత్సవాలు
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు బుధవారం పూర్ణాహుతితో విజయవంతంగా ముగిశాయి. దేవస్థానంలో ఈ నెల 11 నుంచి శాకంబరీ దేవీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. చివరి రోజైన బుధవారం దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం 8గంటల నుంచి సప్తశతి హవనము, మహావిద్య పారాయణం, శాంతి పౌష్టిక హోమం నిర్వహించారు. 11గంటలకు పూర్ణాహుతి, కుష్మాండబలి, మార్జనము, కలశోద్వాసనం, ఆశీర్వాదం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈవో డి.భ్రమరాంబ పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంలో మూడు రోజుల పాటు శాకంబరీ దేవి ఉత్సవాలు విజయవంతంగా ముగిసాయని, ఉత్సవాలు విజయవంతానికి సహకరించిన దాతలకు ఈవో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..శాకంబరీదేవీ ఉత్సవాలు చివరిరోజు, ఆషాఢపౌర్ణిమ, ఆషాఢ సారెను పురస్కరించుకుని దుర్గమ్మను దర్శించుకోవాడానికి బుధవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, కొండ దిగువున, క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఆలయ అధికారులు రద్దీని క్రమబద్దీకరించి భక్తులకు త్వరగా అమ్మవారి దర్శనం కల్పించారు. పలు భక్తబృందాలు అమ్మవారికి ఆషాఢసారె సమర్పించారు. నిత్య ఆర్జిత సేవలలో, ఇతర సేవలలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు

4. పురాణాలు… చరిత్ర ప్రతిబింబాలు
వేదాల అనంతరం వచ్చిన స్మృతుల రచన క్రీస్తుశకం 220 నుంచి 400 సంవత్సరాల మధ్య జరిగింది. పురాణాలు ఆ తరువాత… అంటే క్రీస్తుశకం 700 సంవత్సరాల తరువాత కాలం నాటివి.. పురాణాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అష్టాదశ పురాణాలు. ‘పురాణం’ అంటే ‘పూర్వకాలంలో ఈ విధంగా చెప్పినది’ అని అర్థం. వీటిలో చరిత్ర పెద్దగా కనిపించదు. కానీ ‘పురాణాలే చరిత్ర’ అని నమ్మించే పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే వాటిని ‘పుక్కిటి పురాణాలు’ అని కొట్టిపారేయనవసరం లేదు. ఒక కాలంలో ఏ సాహిత్య సృష్టయినా జరిగిందంటే… అది ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. వాటి రచన జరిగి, ప్రజలు విస్తృతంగా వాటిని విశ్వసించారంటే… అది ఏదో ఒక సామాజిక పరిణామక్రమాన్ని ప్రతిఫలించే ఉంటుంది. అది ఉన్నది ఉన్నట్టు కాకపోవచ్చు… సంకేతాత్మకంగా కావచ్చు. మొత్తం మీద ఆనాటి సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి అవి కొంతమేర ఉపయోగపడతాయి. ‘‘పురాణాలు గంట వేటగాండ్ర వంటివి. తమలోని అర్థాలను ఓ పట్టాన బయలుపడనీయవు’’ అని తిరుపతి వెంకటకవులు అన్నారంటే… వాటిలో ఎంత గజిబిజి ఉందన్నది స్పష్టమవుతుంది. గంట వేటగాళ్ళు… అడవిలో జింకలను, లేళ్ళను వేటాడడానికి గంటలు మోగించుకుంటూ వస్తారు. అలా వాళ్ళు నలువైపుల నుంచీ చుట్టుముట్టినప్పుడు… ఎటువెళ్ళాలో తెలియక, జింకలు ఆ వేటగాళ్ళకు దొరికిపోతాయి. ఆ వేటగాళ్ళలా పురాణాలు కూడా మనుషుల్ని ఆ వలయంలో చిక్కుకుపోయేలా చేస్తాయన్నది తిరుపతి వెంకట కవుల భావం. వాటిలో చిక్కుకుపోకుండా, అదే చరిత్ర అని ఆరాధించకుండా, పురాణాల కారుమేఘాలను ఛేదించుకోవాలి. వాటికన్నా ముందున్న స్మృతులు, అంతకన్నా ముందున్న సూత్రాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, వేద సంహితలు… అలాగే వేద కాలం కన్నా ముందు కాలంనాటి సింధు, హెల్మెండ్‌, స్వాత్‌ లోయల నాగరికతలు, వాటికి సమకాలీనమైన ఇతర దేశాల నాగరికతలను అర్థం చేసుకుంటేనే అసలు విషయాలు తెలుస్తాయి.
***అనేక లక్షల సంవత్సరాల్లో…
అనేక అవతారాలు ఎత్తిన తరువాత… మనిషి ఈ భూమిమీద ఈనాటి మానవుడి దశకు చేరుకున్నాడు. ఈ అంశాలన్నీ అవగాహన చేసుకున్నప్పుడే… నిన్నటి మానవుడు ఎక్కడ నుంచి వచ్చాడో, నేడు ఎక్కడున్నాడో, భవిష్యత్తులో ఎటువైపు అడుగులు వేయాలో తెలుసుకోగలుగుతాడు.
**ఋగ్వేద భాష మూలాలు, పరిణామంఋగ్వేదం ఒక మతపరమైన గ్రంథం. ఆ కాలానికి లిపి లేదు. క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల తరువాతనే లిపిని కనుక్కోవడం జరిగింది. మనకు తెలిసిన ప్రాచీన లిపులు అరామిక్‌, ఖరోష్టి, బ్రహ్మీ లిపి. ఈ బ్రహ్మీ లిపిని ఎడమ నుంచి కుడికి రాస్తారు. ఖారోష్టి లిపిని కుడి నుంచి ఎడమవైపు రాస్తారు. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దానికి ముందు అక్షరాల వినియోగానికి సంబంధించిన ఆధారాలేవీ లేవు. ఆచరణలో అచ్చులకు, హల్లులకు మధ్య ఎలాంటి విభజనా లేదు. ఆ కారణం వల్ల… కేవలం మౌఖిక భాష ఉండేది. ప్రపంచంలోని అనేక భాషలు… వివిధ భాషా కుటుంబాలుగా ఉన్నాయని ఆధునిక పరిశోధనల ద్వారా భాషాపండితులు, చరిత్రకారులు గుర్తించారు. ఋగ్వేదం ఇండో-యూరోపియన్‌ భాషా కుటుంబానికి చెందినది. అలాంటిదే ద్రావిడ భాషా కుటుంబం. దానిలోనిదే మన తెలుగు. ద్రావిడ భాషా కుటుంబంలో ముఖ్యమైన తెలుగు ఒక స్వతంత్ర భాష. తమిళ, కన్నడ, మలయాళ భాషలు… మన తెలుగుకు తోబుట్టువులు. ‘తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకును’అంటూ… దాని నుంచే తెలుగు పుట్టిందని భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు. ద్రావిడ భాషా కుటుంబంలో ఉత్తర ద్రావిడం, మద్య ద్రావిడం, దక్షిణాది ద్రావిడం అనే మూడు భాగాలు ఉన్నాయ. వీటిలో ఇరవై ఒక్క భాషలకు పైగా ఉన్నాయి. ఇక్కడ చర్చ ఋగ్వేద భాష పుట్టుపూర్వోత్తరాల గురించి కాబట్టి… ఆ వివరాలలోకి వెళ్దాం.ఇండో-ఆర్యన్‌ భాషకు సంబంధించిన తొలి రుజువు విషయానికొస్తే… ఋగ్వేద సంస్కృతానికి భిన్నంగా కాకపోయినా, దానికి దగ్గ్గరగా ఉండే సమీప సాక్ష్యం ఉత్తర సిరియా నుంచి లభించింది. ఇండో-ఆర్యన్‌ భాషకు సంబంథించిన పేర్లు, పదాలతో కూడిన సాక్ష్యాలు వివిధ స్థలాలలో దొరికాయి. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల కాలంలో… ఉత్తర సిరియాలో ఇండో-ఆర్యన్‌ భాషను పోలిన భాషను మాట్లాడేవారని… క్రీస్తుపూర్వం పదహారో శతాబ్దపు హిట్టైట్‌, మితాని తెగల ఒప్పందాన్ని బట్టి తెలుస్తోంది.