Business

వావ్‌…హోండా యాక్టివా 7జీ కమింగ్‌ సూన్‌..! – TNI వాణిజ్య వార్తలు

వావ్‌…హోండా యాక్టివా 7జీ కమింగ్‌ సూన్‌..! –  TNI  వాణిజ్య వార్తలు

*హోండా 2వీలర్స్ తన కస్టమర్లకు మరో చక్కటి స్కూటర్‌ను అందించనుందా. కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్‌ ఈ అంచనాలనే బలపరుస్తోంది. “కమింగ్ సూన్” అంటూ రానున్న హోండా యాక్టివా స్కూటర్‌పై వినియోగదారులను ఆకట్టుకుంటోంది.రానున్న కొత్త స్కూటర్ ఫీచర్లు లాంటి విషయాలపై హోండా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ టీజర్‌లోని సిల్హౌటీని చూసి హోండా యాక్టివా 7జీ కావచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా 6జీని తీసుకొచ్చింది. ఫ్రంట్ టర్న్ ఇండికేటర్లు, హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, హ్యాండిల్ బార్స్‌తోపాటు, కొత్త డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో హోండా యాక్టివా 7జీ రానుంది. అయితే యాక్టివా 6 జీ మోడ్‌తో పోలిస్తే ఫీచర్లను మరింత అప్‌గ్రేడ్‌ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి.

* హోండా బిగ్‌వింగ్‌ హైదరాబాద్‌ విపణిలోకి సరికొత్త ప్రీమియం బైక్‌ సీబీ300ఎ్‌ఫను విడుదల చేసింది. దేశంలో రైడింగ్‌ సంస్కృతి పెరుగుతోందని.. ఈ నేపథ్యంలో స్ట్రీట్‌ఫైటర్‌ మోటార్‌సైకిళ్లకు ఆదరణ లభిస్తోందని హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (ప్రీమియం మోటార్‌సైకిల్‌ బిజినెస్‌) అధిపతి రాజగోపి తెలిపారు. 293 సీసీ, 4 వాల్వ్‌ ఎస్‌ఓహెచ్‌సీ ఇంజిన్‌ తదితరాలు ఈ బైక్‌ ప్రత్యేకతలు. సీబీ300ఎఫ్‌ బైక్‌ ధర రూ.2.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

* అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గురుగావ్‌లో దాదాపు 650 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం నయతి హెల్త్‌కేర్‌ అండ్‌ రిసెర్చ్‌ ఎన్‌సీఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 5.63 ఎకరాల స్థలాన్ని దాదాపు రూ.450 కోట్లకు కొనుగోలు చేసినట్లు అపోలో హాస్పిటల్స్‌ వెల్లడించింది. హరియాణాలోకి అడుగుపెట్టడం అపోలోకు ఒక కీలక మైలురాయని, రెండేళ్లలో ఆసుపత్రి సిద్ధం అవుతుందని అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు.

*కావేరీ సీడ్స్‌ మొదటి త్రైమాసికంలో రూ.241 కోట్ల స్టాండ్‌అలోన్‌ నికర లాభాన్ని ప్రకటించింది. లాభాల మార్జిన్‌ 29.56 శాతం నుంచి 32.88 శాతానికి పెరిగింది. సమీక్ష త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 7.26 శాతం వృద్ధితో రూ.682.41 కోట్ల నుంచి రూ.731.95 కోట్లకు చేరింది.

*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ రూ.107.54 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. సమీక్ష త్రైమాసికానికి ఆదాయం 270 కోట్ల నుంచి రూ.350 కోట్లకు చేరింది.

*గత వారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లలో లాభాల స్వీకరణ కారణంగా నెగిటివ్‌గా క్లోజయ్యాయి. నిప్టీ కీలకమైన 17500 స్థాయిని చేరుకోవటం ఒక్కటే సానుకూల అంశం. ఈ వారం కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ ట్రెండ్స్‌.. దేశీయ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి. మంగళవారం మొహర్రం కారణంగా మార్కెట్లకు సెలవు. ఈ వారం కూడా గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిఫ్టీ అప్‌ట్రెండ్‌ను కనబరిస్తే 17500-17650 వద్ద నిరోధ స్థాయిలుంటాయి. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తే 17300-17150 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఈ వారం కూడా గరిష్ఠ స్థాయిల వద్ద కొంత కన్సాలిడేషన్‌కు అవకాశం లేకపోలేదు. ట్రేడర్లు అగ్రెసివ్‌ బెట్స్‌ జోలికి వెళ్లకుండా స్టాక్‌ ఆధారిత విధానాన్ని అనుసరించటం మంచిది.

*దేశంలో మరో బడ్జెట్‌ విమానయాన సంస్థ ప్రారంభమైంది. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులతో ఏర్పడిన ‘ఆకాశ ఎయిర్‌’ ఆదివారం నుంచి వాణిజ్య స్థాయిలో తన విమాన సర్వీసులు ప్రారంభించింది. ముంబై-అహ్మదాబాద్‌’ మధ్య తొలి ఆకాశ ఎయిర్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా వర్చువల్‌గా ప్రారంభించారు. కేవలం 12 నెలల్లో తమ విమానయాన సంస్థకు అన్ని అనుమతులు ఇచ్చినందుకు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా.. సింథియాకు కృతజ్ఞతలు తెలిపారు. భారత విమానయాన చరిత్రలో ఇదో కొత్త అధ్యాయమని సింథియా అన్నారు.

*బీమా కంపెనీలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) మరింత పటిష్ఠం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న ఫిర్యాదుల సమగ్ర పరిష్కార వ్యవస్థ (ఐజీఎంఎస్‌) ను సమూలంగా పునర్‌వ్యవస్థీకరిస్తోంది. ‘బీమా భరోసా’ పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించనుంది. పాలసీదారులు ఈ పోర్టల్‌ ద్వారా బీమా కంపెనీలపై 13 ప్రాంతీయ భాషల్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. తమ ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఏ దశలో ఉందీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఫిర్యాదుల నమోదు, పరిష్కార ప్రక్రియ, పరిష్కారం అంతా ఈ పోర్టల్‌ ద్వారానే జరగనుంది. నిర్ణీత గడువులోగా బీమా కంపెనీలు ఈ ఫిర్యాదులు పరిష్కరించాలి. పాలసీదారులు ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే వారి మొబైల్‌/ఈ-మెయిల్‌కు సమాచారం వచ్చేలా ప్రత్యేక ఏర్పాటు చేస్తారు.

*ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ).. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.392 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.327 కోట్లు)తో పోల్చితే లాభం 20 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం మాత్రం రూ.5,607 కోట్ల నుంచి రూ.5,028 కోట్లకు తగ్గింది. ఈ కాలంలో ఎన్‌పీఏలు తగ్గటం.. లాభం పెరిగేందుకు దోహదపడిందని పేర్కొంది. కాగా నికర వడ్డీ మార్జిన్‌ 2.34ు నుంచి 2.53 శాతానికి పెరిగింది. బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏలు 11.48ు నుంచి 9.03 శాతానికి, నికర ఎన్‌పీఏలు 3.15ు నుంచి 2.43 శాతానికి తగ్గాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.132 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.124 కోట్లతో పోలిస్తే స్వల్పంగా ఆరు శాతమే పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం రూ.1,886 కోట్ల నుంచి రూ.2,620 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.

* ఇండోనేషియా కంపెనీలతో ఎలాన్‌ మస్క్‌ భారీ ఒప్పందం!
మైక్రో బ్లాగింగ్‌ దిగ్గజం ట్విట్టర్‌ నుంచి టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయినా సరే మస్క్‌ తన వ్యాపార కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల లిథియం అయాన్‌ బ్యాటరీల్లో ఉపయోగించే నికెల్‌ కోసం ఇండోనేషియా ప్రాసెసింగ్ యూనిట్లతో 5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాల్ని కుదుర్చుర్చుకున్నారు.ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని మొరోవాలీ కేంద్రంగా నికెల్ ప్రాసెసింగ్ కంపెనీలతో టెస్లా ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండోనేషియా సీనియర్ క్యాబినెట్ మంత్రి తెలిపారు. టెస్లా లిథియం బ్యాటరీల్లో ఈ నికెల్ మెటీరియల్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎలాన్‌ మస్క్‌ ఇండోనేషియాలో టెస్లా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా?అన్న ప్రశ్నలకు మంత్రి లుహుత్ పాండ్జైటన్ స్పందించారు. కార్ల ఉత్పత్తి కేంద‍్రం ఏర్పాటుపై ఆగస్ట్‌లో ఎలాన్‌ మస్క్‌తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. “మేం టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌తో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చల ఫలితంగా మస్క్‌ ఇండోనేషియా నుంచి రెండు ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. కానీ ఆ ప్రొడక్ట్‌లు ఏంటనేది చెప్పేందుకు మంత్రి లుహుత్‌ నిరాకరించారు.