Devotional

వెంకన్నకు ఆగస్టు నెలలో వందకోట్ల ఆదాయం – TNI ఆధ్యాత్మికం

వెంకన్నకు ఆగస్టు నెలలో వందకోట్ల ఆదాయం – TNI ఆధ్యాత్మికం

కరోనామహమ్మారి నుంచి ఈ ఏడాదే కాస్త విముక్తి లభించింది. అప్పటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సైతం భక్తులను పెద్ద సంఖ్యలో అనుమతిస్తోంది. దీంతో ఆరు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయంరికార్డ్ స్థాయిలో వస్తోంది. ఐదు నెలలుగా రూ.100 కోట్ల మార్కును దాటుతూ వస్తున్న స్వామివారి హుండీ ఆదాయం.. ఆరో మాసంలో ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటింది. ప్రస్తుతం రద్దీ సాధారణంగానే ఉంది. అయినప్పటికీ శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ మాసంలో 5, 5.15, 5.30, 5.86.. ఇలా 4 సార్లు రూ.5 కోట్లకు పైగా కానుకలను భక్తులు సమర్పించారు. ఆగస్ట్ మాసంలో కేవలం 22 రోజులకే శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్కును దాటేసింది. 22 రోజుల్లో శ్రీవారికీ హుండీ ద్వారా 100 కోట్ల లక్ష రూపాయల ఆదాయం లభించింది. ఈ మాసంలో కూడా శ్రీవారి హుండీ ఆదాయం రూ.140 కోట్లకు చేరే అవకాశం ఉంది

2. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బంగారు లాకెట్ల విక్రయాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారి రూపం, సుదర్శన నారసింహ యంత్రాన్ని లాకెట్‌ రూపంలో తయారు చేసి విక్రయించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు బంగారంతో లాకెట్లను తయారు చేయించారు. ఒక్కో లాకెట్‌ను 3 గ్రాముల బంగారంతో తయారు చేశామని, లాకెట్‌ ధర రూ.17,500గా నిర్ణయించామని దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. రెండు బంగారు లాకెట్లను విక్రయించినట్లు వెల్లడించారు. కొండపైన శివాలయం ముందు ఏర్పాటు చేసిన దేవస్థాన ప్రచార శాఖ ద్వారా లాకెట్‌ విక్రయాలు జరుపుతున్నట్టు వివరించారు. ప్రస్తుతం 60 లాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాగా, వెండి, రాగి లోహాలతోనూ లాకెట్లను తయారు చేస్తున్నామని, అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.

3. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. శ్రావణమాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, బాలాత్రిపురాసుందరీదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమపూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం రెండు గంటలకుపైగా సమయం పట్టగా, కోడెమొక్కు చెల్లింపు కోసం మూడు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

4. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లఘు దర్శనం అమలు చేస్తుండడంతో నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారి రుద్రాభిషేకం, అన్నపూజ, స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, కుంకుమపూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తుల సంఖ్య ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం మూడు నుంచి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. కోడెమొక్కు చెల్లింపు కోసం భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు.

5. అక్టోబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జితసేవా టికెట్ల కోటాను ఆగస్టు 24వ తేదీ బుధవారం టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌లో టీటీడీ ఈ కోటాను విడుదల చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు లక్కీడిప్‌ ప్రక్రియ కూడా మొదలుకానుంది. అక్టోబరు నెలకు సంబంధించి వర్చువల్‌ సేవలైన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటా ఆగస్టు24న సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.