Politics

మోడీ ఫోటో లేదని కలెక్టర్‌ను నిలదీసిన నిర్మలా

Nirmala Sitharman Questions Kamareddy Collector For Modi Photo

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి రవాణా, గోదాం ఖర్చులను భరిస్తూ కేంద్రం ప్రజలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తోందని.. అలాంటప్పుడు రేషన్‌ దుకాణాలపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదంటూ కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను ప్రశ్నించారు. పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన కార్యక్రమంలో భాగంగా మంత్రి రెండో రోజు శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌కు వచ్చారు. సొసైటీ కార్యాలయంలోని రేషన్‌ దుకాణాన్ని తనిఖీ చేశారు. అయిదుగురు లబ్ధిదారులతో మాట్లాడారు. గత నెలలో తక్కువ బియ్యం ఇచ్చారని ఓ లబ్ధిదారు చెప్పడంతో మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత బియ్యం ఇవ్వాలో తెలియదా? అంటూ మండిపడ్డారు. రేషన్‌ బియ్యం కిలో విలువ రూ.34 ఉంటుందని, వీటిని పేదలకు రూ.1కే ఇస్తుంటారని.. ఈ రాయితీలో కేంద్రం రూ.29 భరిస్తుండగా.. రాష్ట్రం రూ.3-4 మాత్రమే వెచ్చిస్తోందన్నారు. కలెక్టర్‌ను పిలిచి.. రేషన్‌ బియ్యంలో కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన కాస్త తడబడుతూ… చెప్పే ప్రయత్నం చేశారు. మరో ఉద్యోగి వివరాలు చెప్పేందుకు ప్రయత్నించగా.. కలెక్టరే చెప్పాలని మంత్రి పట్టుబట్టారు. రేషన్‌ తక్కువగా ఇచ్చారని చెప్పిన లబ్ధిదారు వైపు కోపంగా చూస్తున్న డీలర్‌ను ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఆగ్రహించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. తాను మరోసారి వచ్చేటప్పటికి రేషన్‌ దుకాణాల్లో మోదీ ఫొటో ఉండాలని.. లేకుంటే తానే పెట్టాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తమ పార్టీ కార్యకర్తలు కొన్నిచోట్ల రేషన్‌ దుకాణాలపై మోదీ ఫొటోలు పెట్టినప్పటికీ.. ఇక్కడి అధికార పార్టీ నాయకులు వాటిని తొలగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు.