NRI-NRT

35వేల నుండి లక్షా95వేలకు పెరగనున్న ఆస్ట్రేలియా PRల సంఖ్య

35వేల నుండి లక్షా95వేలకు పెరగనున్న ఆస్ట్రేలియా PRల సంఖ్య

ఆస్ట్రేలియాకు శాశ్వతంగా వలస వచ్చేవారిని ప్రోత్సహించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాకు శాశ్వత వలసలను 35,000 నుంచి 1,95,000కు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా సిబ్బంది కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యాపారాలకు ఈ నిర్ణయంతో ఊరట లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా కొవిడ్‌కు భయపడి రెండేళ్లపాటు దేశ సరిహద్దులను మూసివేయడం, ఉపాధి కోసం వచ్చినవారు, విదేశీ విద్యార్థులు దేశాన్ని వీడటంతో వ్యాపార సంస్థలకు అవసరమైన సిబ్బంది లభించడంలేదు. ‘‘మా వలస విధానాలను మార్చుకొనే అవకాశం కొవిడ్‌ కారణంగా లభించింది. ఈ అవకాశాన్ని మేము పూర్తిగా వాడుకోవాలని అనుకొంటున్నాం. దీని ప్రకారం మరింత మంది నర్సులు, వేలకొద్దీ ఇంజినీర్లు ఇక్కడ స్థిరపడనున్నారు’’ అని ఆస్ట్రేలియా హోం అఫైర్స్‌ మినిస్టర్‌ క్లారె ఓనీల్‌ వెల్లడించారు. మరోవైపు వీసా ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసేందుకు వచ్చే తొమ్మిది నెలల్లో మరో 500 మంది సిబ్బందిని నియమించుకుంటామని ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ మినిస్టర్‌ ఆండ్రూ గైల్స్‌ పేర్కొన్నారు.