Business

మిస్త్రీ మృతిపై బెంజ్ నివేదిక

Benz Delivers Report On Cyrus Mistry Death

టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్‌ మిస్త్రీ(54) కారు ప్రమాదంపై మధ్యంతర నివేదిక రూపొందించింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌. మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ పోలీసులకు అందజేసిన దీంట్లో .. దుర్ఘటనకు ముందు పరిస్థితుల్ని వివరించింది. కారులోని ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ మాడ్యూల్‌ను విశ్లేషించి ఈ విషయాలు తెలుసుకున్నట్లు మెర్సిడెజ్‌ బెంజ్‌ సంస్థ తెలిపింది. రోడ్డు డివైడర్‌ను ఢీకొనడానికి ఐదు సెకన్ల ముందే కారుకు బ్రేకులు వేసినట్లు వెల్లడించిందని సీనియర్‌ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. మెర్సిడెస్‌ బెంజ్‌కు చెందిన నిపుణుల బృందం సోమవారం హాంకాంగ్‌ నుంచి ముంబయికి చేరుకుని కారును తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు కారు ప్రమాదంపై దర్యాప్తులో అధికారులకు సహకరిస్తున్నామని జర్మనీకి చెందిన మెర్సిడెస్‌ బెంజ్‌ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల గుజరాత్‌ నుంచి ముంబయి వస్తుండగా ప్రయాణిస్తున్న కారు పాల్‌ఘర్‌ జిల్లాలో డివైడర్‌ను ఢీకొనడంతో మిస్త్రీ, ఆయన స్నేహితుడు జహంగీర్‌ పండోల్‌ ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ ఘటనలో అనహితా పండోల్‌, ఆమె భర్త డేరియస్‌ పండోల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ‘పోలీసులకు మెర్సిడెస్‌ బెంజ్‌ ఇచ్చిన మధ్యంతర నివేదికలో.. ప్రమాదం జరగడానికి కొన్ని సెకన్ల ముందు కారు 100 కి.మీ. వేగంలో ఉన్నట్లు తెలిపింది. డివైడర్‌ను ఢీకొన్నప్పుడు 89 కి.మీ.వేగంతో ఉన్నట్లు వెల్లడించింది. దుర్ఘటన జరగడానికి 5 సెకన్ల ముందు బ్రేకులు వేసినట్లు పేర్కొంది’ అని పాల్‌ఘర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ బాలాసాహెబ్‌ పాటిల్‌ వివరించారు.