Kids

అమ్మకానికి పసిబిడ్డ .. అడ్డుకున్న ప్రజలు

అమ్మకానికి పసిబిడ్డ  .. అడ్డుకున్న ప్రజలు

ఏలూరు: ద్వారకా తిరుమల శేషాచల కొండపై నాలుగు నెలల పసిబిడ్డ విక్రయం కలకలం రేపింది. పొత్తిళ్లలో పాలు తాగాల్సిన పసిబిడ్డను అమ్మకానికి పెట్టారు తల్లిదండ్రులు.అయితే ధర విషయంలో తలెత్తిన వివాదంతో వ్యవహారం బయటకు తెలిసింది. భక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పసిబిడ్డతో పాటు తాత, తల్లిదండ్రులను స్టేషన్‌కు తరలించారు.రాజమండ్రికి చెందిన శాంతి, రాజు భార్యాభర్తలు. వీరికి నాలుగు నెలల మగ బిడ్డ సంతానం. ఆర్థిక పరిస్థితులో లేక ఇతర కారణాలవల్లో రాజు తన భార్య శాంతి, తండ్రి ప్రసాద్‌తో కలిసి సుమారు నెలరోజులుగా ద్వారకా తిరుమలలో నివాసం ఉంటున్నాడు. దొరికిన పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే రాజు, శాంతి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ బిడ్డను విక్రయించి, వచ్చిన డబ్బును పంచుకుని ఇద్దరు విడిపోవాలని అనుకుని భీమరానికి చెందిన పిల్లలు లేని ఓ వ్యక్తికి పసిబిడ్డను బేరం పెట్టారు. ముందుగా అనుకున్నట్టుగానే రాజు, శాంతి, ప్రసాద్ పసిబిడ్డను విక్రయించేందుకు శేషాచల కొండపైగల పార్కింగ్ ప్రదేశానికి వెళ్లారు. భీమవరానికి చెందిన పిల్లలు లేని వ్యక్తి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలో రాజుకు అతని తండ్రి ప్రసాద్‌కు బిడ్డ విక్రయ ధరలో వాగ్వాదం చోటుచేసుకుంది. రూ. 2 లక్షలకు బిడ్డను ఇచ్చేద్దాం అని రాజు, కాదు.. ఇంకా ఎక్కువ ధరకు ఇద్దామని ప్రసాద్ గొడవపడ్డారు. వీరి వ్యవహారాన్ని గమనించిన భక్తులు వెంటనే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం పసిగట్టిన బిడ్డను కొనే వ్యక్తి అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు పసిబిడ్డ సహా శాంతి, రాజు, ప్రసాద్‌ను స్టేషన్‌కు తరలించారు.