Movies

ఎన్టీఆర్‌.. ఆహారపు అలవాట్లు అలా ఉండేవి

ఎన్టీఆర్‌.. ఆహారపు అలవాట్లు అలా ఉండేవి

ఒక సాధారణ వ్యక్తిని అసామాన్య శక్తిగా, ఎదురులేని ఏలికగా మార్చిన చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా తెలుగు గడ్డ నిలిస్తే, ఆ నేల గర్వించే ఎత్తులకు ఎదిగిన తెలుగుతేజం నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజల ఇళ్ళలో ఇలవేల్పుగా, గుండెలలో తెరవేల్పుగా శాశ్వత స్థానం సంపాదించుకున్నారాయన. ‘తెలుగు’ అన్న పదం చెప్పగానే తొలిసారిగా స్ఫురించే పేరు ఎన్‌.టి.ఆర్‌. అంటే అతిశయోక్తి కాదు. తెలుగు జాతితో అంత ప్రగాఢమైన సాన్నిహిత్యాన్ని పెనవేసుకున్న వారు మరొకరు మనకు కనిపించరు. మొక్కవోని ధైర్యం, మడమ తిప్పని కార్యదక్షత, క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల, అసంభవాన్ని సంభవం చేయగల సమర్థత..

ఇలాంటి అరుదైన లక్షణాల వల్లే ఎన్‌.టి.ఆర్‌. ‘ఒకే ఒక్కడు’గా అటు సినీరంగంలోను, ఇటు రాజకీయరంగంలోను నిలిచారు. పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసినా, నాయక, ప్రతినాయక పాత్రలను పోషించినా, యువకుడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుడి వరకూ ఏ పాత్ర చేసినా ‘ఎన్‌.టి.ఆర్‌. తప్ప మరెవరూ చేయలేరు’ అని కితాబు అందుకోవడం ఆయనకే చెల్లింది. మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఎదురులేని మనిషిగా ఏలిన ఎన్‌.టి.ఆర్‌. శక పురుషుడు, యుగపురుషుడు కూడా. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొంత ఆసక్తికరమైన సమాచారం.

ఆ రోజులలో అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం… అర్ధరాత్రి దాటిన గంటన్నర తర్వాత మద్రాసు నగరంలో త్యాగరాయ నగర్‌లోని బజుల్లా రోడ్‌లో నందమూరి హౌస్‌లో సందడి మొదలయ్యేది. అప్పటికే నిద్ర లేచిన ఎన్‌.టి.ఆర్‌. మొదట ఓ గంటసేపు వ్యాయామం చేసేవారు. నటుడికి వ్యాయామ శిక్షణ చాలా అవసరం అనేవారాయన. అనుకోని పరిస్థితి ఎదురయి ఏ రోజన్నా వ్యాయామం చేయకపోతే ఆ రోజంతా నిస్సారంగా, భారంగా గడిచేదని ఆయన చెప్పేవారు.

వ్యాయామం అయిన తర్వాత అంటే తెల్లారుజామున మూడు గంటలకు శ్రీమతి బసవతారకం, పిల్లలను తీసుకుని సముద్రతీరానికి వెళ్లేవారు. పిల్లలతో తుమ్మెద పాటలు, జానపద గేయాలు పాడిస్తూ, తను పాడుతూ ఓ గంట సేపు అక్కడే గడిపేవారు. చాలా కాలం పాటు ఈ పద్ధతి కొనసాగింది. స్నానాదులు ముగించుకుని సరిగ్గా అయిదు గంటలకు ఖద్దరు సిల్క్‌ లాల్చీ, సిల్క్‌ ధోవతి, నుదుట తిలకంతో మేడ పైనుండి కిందకు వచ్చి ఆఫీసులో తన కోసం ఎదురుచూసే వారిని కలిసేవారాయన. ఆ సమయానికే నిర్మాతలు, పంపిణీదారులు, మిత్రులతో ఆయన ఆఫీసు సందడిగా ఉండేది. అందరితోనూ మాట్లాడి పంపించి సరిగ్గా ఏడు గంటలకల్లా షూటింగ్‌ స్పాట్‌లో ఉండేవారు ఎన్‌.టి.ఆర్‌.

ఎన్‌.టి.ఆర్‌.కు చికెన్‌ అంటే చాలా ఇష్టం. రోజుకు ఒక కోడిని అవలీలగా తినేవారని ఆయన ఆహారపు అలవాట్లు ఎరిగిన వాళ్లు చెప్పేమాట. అలాగే ఆయనకి టీ అంటే చాలా ఇష్టం. రోజులో చాలా సార్లు టీ తాగుతుండేవారు. అయితే తల్లి మరణం తర్వాత టీ తాగడం మానేశారాయన. దానికి బదులు పాలు లేదా మజ్జిగ తీసుకునే వారు.

వ్యసనాల జోలికి ఎన్‌.టి.ఆర్‌. ఎప్పుడూ వెళ్లలేదు. ధూమపానం, మద్యపానానికి ఆయన వ్యతిరేకి. అయితే, చిత్రరంగంలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో ఖంగుమనే కంఠస్వరం కోసం రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చుట్టలు తాగేవారు. ఆ అలవాటు కూడా క్రమంగా మానుకున్నారు. అలాగే కిళ్లీలు వేసుకునే అలవాటు ఉండేదాయనకి. ఆర్టిస్టులు కిళ్లీలు వేసుకుంటే పళ్లు గారపట్టి అసహ్యంగా కనిపిస్తాయని ఎల్‌.వి.ప్రసాద్‌ చెప్పడంతో ఆ అలవాటు కూడా ఎన్‌.టి.ఆర్‌. మానుకున్నారు.

తను బాగా బిజీగా ఉన్న సమయంలో రోజుకి రెండు కాల్షీట్లు పనిచేసేవారు ఎన్‌.టి.ఆర్‌. ఉదయం ఏడు గంటల నుంచి ఒంటిగంట వరకూ ఒక కాల్షీటు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మరో కాల్షీటు. ఒక్కో సినిమాకి 30 కాల్షీట్లు కేటాయించేవారాయన. విఠలాచార్య వంటి దర్శకుడు ఇంకా తక్కువ వ్యవధిలోనే ఎన్‌.టి.ఆర్‌.తో తన సినిమాలు పూర్తి చేసేవారు.