DailyDose

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహాయంతో ఖతార్ జైలు నుంచి ఇంటికి చేరిన మహిళలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహాయంతో ఖతార్ జైలు నుంచి ఇంటికి చేరిన మహిళలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఏ నేరం చేయకుండా ఖతర్‌ జైలులో ఉన్న నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు మహిళలను క్షేమంగా ఇంటికి చేర్పించి కుటుంబ సభ్యుల కన్నీళ్లను దూరం చేశారు. నగరానికి చెందిన ఆసియా బేగం, షేక్‌ నసీమాలు పదినెలల కిందట బతుకుదేరువు కోసం ఖతర్‌ దేశానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనిలో చేరారు. వారు జీతం సరిగ్గా ఇవ్వకపోగా వారిని కొట్టడం, తిట్టడం లాంటి వేధింపులకు గురిచేశారు.

దీంతో బాధితులిద్దరూ అక్కడి నుంచి పారిపోతూ పోలీసులకు చిక్కడంతో జైలులో వేశారు. ఈ విషయం బంధువుల ద్వారా జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారికి తెలియడంతో పూర్తి వివరాలు సేకరించి ఎమ్మెల్సీ కవితకు విషయాన్ని చెప్పారు. వెంటనే స్పందించిన కవిత ఖతర్‌లోని జాగృతి అధ్యక్షులు నందిని అబ్బగౌనికి సమాచారం అందించారు. ఆమె జైలుకు వెళ్లి బాధితులను, అధికారులతో సంప్రదింపులు జరిపి పదిరోజుల్లో ఆమెను జైలు నుంచి బయటకు విడుదల చేయించారు.అనంతరం వారిని స్వదేశానికి పంపించేందుకు గాను ఎంబసీ అధికారులతో మాట్లాడి విమాన టికెట్లను ఏర్పాట్లు చేయడంతో బాధితులిద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

నిజామాబాద్‌కు చేరుకున్న బాధిత మహిళలను శనివారం జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్, రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్, యూత్ జిల్లా అధ్యక్షులు రెహాన్ తదితరులు పరామర్శించారు. తమను క్షేమంగా ఇంటికి చేర్పించిన ఎమ్మెల్సీ కవితకు, ఖతర్‌ జాగృతి అధ్యక్షురాలు నందినికి జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు.