Movies

కొత్త జీవితం ప్రారంభించబోతున్నా: మంచు మనోజ్

కొత్త జీవితం ప్రారంభించబోతున్నా: మంచు మనోజ్

మంచు మోహన్ బాబు కుమారుడు, ప్రముఖ నటుడు మంచు మనోజ్ ఈరోజు కడపలోని పెద్ద దర్గాని సందర్శించుకొని చాదర్ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఈ దర్గా గురించి నేను చాలాకాలంగా వింటున్నాను. నా కుటుంబంలోవారు, నా స్నేహితులు చాలామంది ఈ దర్గాని సందర్శించుకొన్నారు కానీ నేను రాలేకపోయాను. నా స్నేహితుడు సూచన మేరకు ఇవాళ్ళ ఈ దర్గాని దర్శించుకొన్నాను. ఇక్కడకి వచ్చి ప్రార్దన చేస్తే నాకు చాలా మనశాంతి కలిగినట్లు అనిపిస్తోంది. త్వరలోనే నేను కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నాను. అప్పుడు మళ్ళీ నా కుటుంబంతో కలిసి మరోసారి దర్శనం కోసం ఇక్కడకి వస్తాను. వచ్చే ఏడాది ఫిభ్రవరి నుంచి మళ్ళీ నా సినిమాలు కూడా మొదలుపెట్టబోతున్నాను,” అని చెప్పారు.

మంచు మనోజ్ ప్రేమ, పెళ్ళి రెండూ విఫలమవడంతో దాదాపు ఏడాదిగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. పెళ్ళికి ముందు తాను ప్రేమించిన భూమా మౌనిక(భూమా నాగిరెడ్డి కుమార్తె)తో మళ్ళీ ప్రేమలో పడ్డారు. సీతాఫల్ మండీలో జరిగిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలలో వారిద్దరూ కలిసి పూజలు చేస్తూ తొలిసారిగా మీడియా ముందుకి వచ్చారు. త్వరలోనే వారిరువురూ పెళ్ళిచేసుకోబోతున్నారు. కనుక వారిద్దరి జీవితాలు మళ్ళీ గాడినపడుతున్నట్లే భావించవచ్చు.

మంచు కుటుంబంలో అందరూ ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవితో పోటీ పడిన మంచు మోహన్ బాబు చివరిగా తీసి నటించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ అట్టర్ ఫ్లాప్ అవడమే కాక ప్రేక్షకులు లేక థియేటర్లలో నుంచి సినిమాని తీసేయవలసి రావడం చాలా అవమానకరమే. ఆయన రెండో కుమారుడు మంచు విష్ణు ‘మా’ ఎన్నికలలో గెలిచి మా అధ్యక్షుడైనప్పటికీ మాలో ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నాడు. తాజాగా అతను నటించిన జిన్నా అట్టర్ ఫ్లాప్ అవడంతో అతను ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు.

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నిన్ననే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ పెట్టారు. తన జీవితంలో కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. కానీ ఇప్పుడు నేను మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా మారాను,” అంటూ సందేశం పెట్టారు.