Sports

ఐసీసీ కూడా టీమిండియాని చూసి భయపడుతుంది! కానీ మేం కాదు… – పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ

ఐసీసీ కూడా టీమిండియాని చూసి భయపడుతుంది! కానీ మేం కాదు… – పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ

ఐసీసీ కూడా బీసీసీఐ ముందు చేతులు కట్టుకుని నిలబడుతుంది… మేం ఓ నిర్ణయం తీసుకున్నాం, దానికే కట్టుబడి ఉంటాం… పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ కామెంట్లు.

ఆసియా కప్ 2023 వేదిక గురించి దాదాపు 8 నెలలుగా చర్చ జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. అయితే కొన్నేళ్లుగా భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు సరిగా లేవు. దీంతో పాక్‌లో అడుగుపెట్టేది లేదని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించి తీరుతామని కామెంట్ చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా…

ఆసియా కప్ 2022 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌కి ముందు చేసిన ఈ కామెంట్లు… పీసీబీకి మంటపుట్టేలా చేశాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకుని, ప్రకటన చేసి ఉంటే మరోలా ఉండేదేమో. కానీ బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా… ఇలా పాక్ క్రికెట్ బోర్డు అభిప్రాయంతో సంబంధం లేకుండా తటస్థ వేదికపై ఆసియా కప్‌ 2023 టోర్నీ నిర్వహిస్తామని ప్రకటించడం వివాదాస్పదమైంది…

ఎవరైనా తమ కాళ్ల మీద తాము నిలబడలేకపోతే, ఎదుటివాళ్లు చెప్పినదానికి తల ఊపాల్సి ఉంటుంది. మాకు ఆ కర్మ పట్టలేదు. పీసీబీ, భారత్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితిలో లేదు. ఇండియా కళ్లు ఉరిమి చూస్తే వణికిపోవడానికి మేం వాళ్ల బానిసలం కాదు…

వాళ్లను వాళ్లు బలవంతులం అని అనుకుంటే సరిపోదు. దాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది కూడా. ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఎక్కడ నిర్వహించాలనేది మేం డిసైడ్ చేయాలి. ఆసియా కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా? లేక ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీని పాకిస్తాన్ బాయ్‌కాట్ చేస్తుందా.. అనే విషయాలు నాకు తెలీదు..

అయితే మేం ఓ నిర్ణయాన్ని తీసుకున్నాం. దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలని ఫిక్స్ అయ్యాం. ఇలాంటి సందర్భాల్లో ఐసీసీ కలగచేసుకుంటే బాగుంటుంది. అయితే ఐసీసీ కూడా బీసీసీఐని కాదని ఏమీ చేయలేదు.. కానీ మేం అలా కాదు…’ అంటూ వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ..

వచ్చే నెలలో మరోసారి ఏషియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆసియా కప్ 2023 టోర్నీ వేదిక గురించి క్లారిటీ రానుంది. ఒకవేళ పాక్‌లో నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబడితే, టీమిండియా… ఆసియా కప్‌ 2023టోర్నీకి దూరంగా ఉంటుంది. మరి భారత జట్టు, ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్‌కి వెళ్లకపోతే పాక్ టీమ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఇండియాకి వస్తుందా? అనేది చూడాలి..

సెప్టెంబర్‌లో వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. పాక్‌లో నిర్వహించకపోతే తటస్థ వేదికకు తరలించినందుకు నష్టపరిహారంగా కొంత మొత్తాన్ని పీసీబీ కోరి, సంధి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. నష్ట పరిహారం కోసమే పీసీబీ, పాక్‌లో పెట్టాల్సిందేనని పట్టుబడుతోందని కూడా టాక్ వినబడుతోంది. త్వరలో ఇందులో నిజానిజాలు ఎంతనేది తేలిపోనుంది..