Politics

పవన్ కు బి.ఆర్.ఎస్.భారీ ఆఫర్ తెలుగు రాష్ట్రాలలో పొత్తుకు సిద్ధమైతే

పవన్ కు బి.ఆర్.ఎస్.భారీ ఆఫర్ తెలుగు రాష్ట్రాలలో పొత్తుకు సిద్ధమైతే

*ఎన్నికల ఖర్చంతా నాదే *
కాపులే లక్ష్యంగా కేసీఆర్‌!

ఎం.పి.రాజకీయాలలో
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగబోతున్నారు. గత ఎన్నికల్లో ఆదుకున్నట్టుగానే రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జగన్‌కు సాయపడటానికి కేసీఆర్‌ వ్యూహ రచన చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్న ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు పడవని తెలుసు కనుకే కాపు సామాజిక వర్గాన్ని చేరదీసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రణాళికను ఆయన రచించారు. రాజకీయంగా చంద్రబాబు అంటే కేసీఆర్‌కు గిట్టదు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడంతో ఆయనకు అధికారం దక్కకుండా చేయడం ఎలా? అన్నదానిపై కేసీఆర్‌ దృష్టి సారించారు. భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసిందిగా కొంత కాలం క్రితం కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వద్దకు కేసీఆర్‌ దూతలు వచ్చారు.
ఆయన నిరాకరించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను ఎంచుకున్నారు. ఈ దశలో తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని వార్తలు రావడంతో కేసీఆర్‌ ఉలిక్కిపడ్డారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడం, దానికి ప్రజలు భారీగా తరలి రావడంతో కేసీఆర్‌ తన మెదడుకు పనిపెట్టారు.
తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదరకుండా అడ్డుకోవడంపై ఆయన ఇప్పుడు దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకొనే ఆలోచనను విరమించుకొని భారత రాష్ట్ర సమితితో చేతులు కలిపితే భారీగా ఆర్థిక సహాయం చేస్తానని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వద్దకు ప్రతిపాదనలు పంపుతున్నారు.
‘‘వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చయినా ఫర్వాలేదు, నేను సమకూరుస్తాను మీరు నాతో చేతులు కలపండి’’ అని పవన్‌ వద్దకు ఇప్పటికే దూతలను పంపినట్టు తెలిసింది. కేసీఆర్‌కు ఇంత ధనం ఎలా సమకూరింది? ఆయన ఏయే రాష్ర్టాలలో ఆర్థిక సాయం చేయబోతున్నారన్నది మరో సందర్భంలో చెప్పుకొందాం.
చంద్రబాబు నుంచి పవన్‌ కల్యాణ్‌ను దూరం చేయగలిగితే జగన్‌ అధికారానికి ఢోకా ఉండదని కేసీఆర్‌ బలంగా నమ్ముతున్నారు. అదే సమయంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య అవగాహన ఏర్పడితే దాని వల్ల తనకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా కేసీఆర్‌ దృష్టిసారించారు. కాపు సామాజిక వర్గాన్ని చేరదీయాలని అనుకోవడానికి ఇది కూడా కారణం.
తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం కంటే కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉంటారని కేసీఆర్‌ అభిప్రాయపడుతున్నారట. ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం తనకు అండగా ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగితే ఆ వర్గం దూరమవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయంగా కాపులను చేరదీయాలని నిర్ణయించుకున్నారట.
ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణలో ఉంటున్న కాపులు కూడా ప్రస్తుతం జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో ఉన్నారు. ఇప్పుడు జాతీయ నాయకుడినని చెప్పుకొంటూ ఇకపై తాను దేశం కోసమే ఆలోచిస్తానంటున్న కేసీఆర్‌, మరోవైపు మరో రాజకీయ పార్టీ అయిన తెలుగుదేశం ఉనికిని తెలంగాణలో భరించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కనిపిస్తే కమ్మ సామాజిక వర్గం తనను వదిలేస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు.
అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టల సిద్ధాంతాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఏదో ఒక విధంగా ఒప్పించి తనవైపు తిప్పుకోగలిగితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డికి మేలు చేసినట్టు అవుతుంది. దానితోపాటు తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం దూరమైనా కాపులతో ఆ నష్టాన్ని భర్తీచేసుకున్నట్టు అవుతుంది– అన్నది కేసీఆర్‌ వ్యూహంగా చెబుతున్నారు. కేసీఆర్‌ ప్రతిపాదనలకు పవన్‌ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.
జనసేనను కలుపుకొని ఎంపిక చేసిన యాభై నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయన్నది కేసీఆర్‌ ఆలోచనగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుతామని, కనీసం 30 స్థానాలు గెలుచుకోగలిగితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభిస్తుందని పవన్‌ కల్యాణ్‌కు నచ్చజెప్పే ప్రయత్నాలకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు.
2019 ఎన్నికల్లో తాను అమలుచేసిన వ్యూహాన్ని వచ్చే ఎన్నికల్లో కూడా అమలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. 2019 ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డికి భారీగా ఆర్థిక సాయం చేయడంతో పాటు హైదరాబాద్‌ నుంచి చంద్రబాబుకు నిధులు అందకుండా పోలీసుల ద్వారా కేసీఆర్‌ కట్టడి చేశారు.
ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా హైదరాబాద్‌ నుంచి చంద్రబాబుకు నిధులు అందకుండా చేయబోతున్నారట. ఈ క్రమంలో హైదరాబాద్‌లో స్థిరపడిన కొంతమంది కాపు ప్రముఖులతో కూడా కేసీఆర్‌ మంతనాలు జరిపినట్టు తెలిసింది.
తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టకుండా పవన్‌ కల్యాణ్‌కు నచ్చజెప్పడానికి కొంత మంది కాపు ప్రముఖులను ఎంపిక చేసి కేసీఆర్‌ ప్రయోగిస్తున్నారు. కేసీఆర్‌ ప్రయోగిస్తున్నవారు పవన్‌ కల్యాణ్‌ను కలిసి బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు మానసికంగా సిద్ధపడిన పవన్‌ కల్యాణ్‌ ఈ కారణంగా ఒక దశలో డైలమాలో పడ్డారు.
చంద్రబాబుతో చేతులు కలిపినా ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టవలసిందిగా కేసీఆర్‌ ప్రయోగించిన దూతలు పవన్‌ కల్యాణ్‌పై ఒత్తిడి పెంచారు. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇందుకు అంగీకరించదు కనుక పొత్తు ప్రతిపాదన ముందుకు సాగదన్నది కేసీఆర్‌ అండ్‌ కో వ్యూహంగా చెబుతున్నారు.
ఈ పరిణామాలు అన్నీ గమనించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్‌ నాయకుడు ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిసి హితబోధ చేసినట్టు తెలిసింది. చెప్పుడు మాటలు వింటే మొదటికే మోసం వస్తుందని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు మెగాస్టార్‌, పవర్‌స్టార్లు కలసి కూడా అధికారంలోకి రాలేకపోయిన విషయాన్ని ఆయన పవన్‌ కల్యాణ్‌కు గుర్తు చేశారు. ఆ తర్వాత జనసేనానికి క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్‌ చేయబోయే ప్రయత్నాలు పవన్‌ కల్యాణ్‌పై ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.