NRI-NRT

భారతీయ నిపుణుల కోసం జర్మనీ అన్వేషణ..

భారతీయ నిపుణుల కోసం జర్మనీ అన్వేషణ..

నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల కోసం జర్మనీ అన్వేషిస్తోంది.ఐటీ నిపుణులతో పాటు నర్సులు, మేసన్లు వరకు జర్మనీ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం పూర్తయిన వెంటనే ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం వుంటుంది.

ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ నేతృత్వంలోని జర్మన్ సంకీర్ణ ప్రభుత్వం సరైన నైపుణ్యాలు కలిగిన భారతీయ వలసదారులకు రెడ్ కార్పెట్‌ను పరిచేందుకు సిద్ధమైంది.

భారత్‌లో జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్ (Dr.Philipp Ackermann)ఓ జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.జర్మనీలో భారతీయ కమ్యూనిటీ 2,00,000 వరకు వున్నారని కానీ ఇది విస్తరించాల్సిన అవసరం వుందన్నారు.

జర్మనీ(Germany) ప్రభుత్వం కార్మికుల కొరతను పరిష్కరించేందుకు ఇప్పటికే కొన్ని చట్టాలను రూపొందించిందని అకెర్‌మాన్(Ackerman) తెలిపారు.నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను అధిగమించేందుకు గాను వివిధ స్థాయిలలో వలసలను సులభతరం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

జర్మనీలోని ఒక కంపెనీతో నిర్ణీత వేతన స్థాయి, నిర్ధిష్ట కాల వ్యవధికి జాబ్ కాంట్రాక్ట్ వున్న భారతీయ నిపుణుల కోసం వర్క్ పర్మిట్ బ్లూ కార్డులను తక్కువ సమయంలోనే ప్రాసెస్ చేస్తామని అకెర్‌మాన్ వెల్లడించారు.అంచనాల ప్రకారం.

ప్రస్తుతం జర్మనీలో దాదాపు 21,000 మంది భారతీయులు బ్లూకార్డ్‌లతో వున్నారు.

ఇక జర్మన్ భాషా నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడానికి నర్సులకు, కేర్ టేకర్‌ల కోసం కేరళలో(Kerala) ఒక కార్యక్రమాన్ని నడుపుతున్నట్లు అకెర్‌మాన్ వెల్లడించారు.అక్కడి నుంచి మొదటి విడతలో 150 మంది అభ్యర్ధులు జర్మనీకి బయల్దేరతారని ఆయన పేర్కొన్నారు.అలాగే హస్తకళాకారులను కూడా జర్మనీకి స్వాగతిస్తున్నట్లు అకెర్‌మాన్ వెల్లడించారు.

భవన నిర్మాణానికి సంబంధించి తాపీ మేస్త్రీలకు కూడా బెంగళూరులో శిక్షణ ఇస్తున్నామని ఆయన చెప్పారు.

డిసెంబర్ 2021 నాటికి జర్మనీలో 1,60,000 మంది భారతీయ పౌరులు… 43,000 మంది భారతీయ సంతతికి చెందినవారు నివసిస్తున్నారని అంచనా.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అకెర్‌మాన్ పేర్కొన్నారు.అలాగే జర్మనీలో 34 వేలకు పైగా భారతీయ విద్యార్ధులు చదువుకుంటున్నారని ఆయన చెప్పారు.