WorldWonders

ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై పడిన జేసీబీ.. ముగ్గురు మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై పడిన జేసీబీ.. ముగ్గురు మృతి!

దైవదర్శనం చేసుకొని తిరిగి వస్తున్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది. ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..

రోడ్డు ప్రమాదాలు ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం లాంటివి అధిక ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇలాంటి అనుకోని విషాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. తాజాగా నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తున్న ఒక కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మోర్తాల్ మండలం దొన్కల్​కు చెందిన లక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలసి బడాభీమ్​గల్ ఎల్లమ్మ వద్దకు మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లారు.

బడాభీమ్​గల్ ఎల్లమ్మ ఆలయం నుంచి కారులో మొత్తం ఏడుగురితో తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం రాత్రి భీమ్​గల్​లోని విద్యుత్తు ఉపకేంద్రం దగ్గర ట్రాక్టర్ ట్రాలీ మీద ఉన్న పొక్లెయనర్ వారి కారుపై పడింది. దీంతో అందులో ఉన్న లక్ష్మి కొడుకు ముప్పారపు రాజేశ్వర్ (45), కోడలు జ్యోతి (42), కుమార్తె రమ (41) అక్కడికక్కడే చనిపోయారు. నుజ్జునుజ్జయిన కారు నుంచి మృతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీసేందుకు 108 సిబ్బంది గంటసేపు శ్రమించారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మి, అల్లుడు చుక్కారపు రాజేశ్వర్​ను 108 అంబులెన్స్​లో నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ ట్రాలీ మీద నుంచి జేసీబీ.. ఎదురుగా వస్తున్న కారుపై ఎలా పడింది? ట్రాక్టర్ ట్రాలీని కారు ఢీకొట్టిందా? అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.