Business

భారీ లాభాల్లో మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @17,270

భారీ లాభాల్లో మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @17,270

Stock Market: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 679 పాయింట్ల లాభంతో 58,640 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 192 పాయింట్లు లాభపడి 17,273 దగ్గర కొనసాగుతోంది.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 679 పాయింట్ల లాభంతో 58,640 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 192 పాయింట్లు లాభపడి 17,273 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు పుంజుకొని 82.12 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండం, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇరాక్లోని కుర్దిస్థాన్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ముడి చమురు ధరలు గురువారం పెరిగాయి. బ్రెంట్ పీపా ధర 1.2 శాతం పెరిగి 79.20 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు ఎస్ఎంఈ సెగ్మెంట్లో నాలుగు ఐపీఓలకు బిడ్డింగ్ ప్రారంభం కానుంది. దాదాపు రూ.100 కోట్ల వరకు సమీకరణ జరగనుంది. ఎంఓఎస్ యుటిలిటీ, ఇన్ఫీనియం ఫార్మాకెమ్ కంపెనీలు ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లో, ఎగ్జికాన్ ఈవెంట్స్ మీడియా సొల్యూషన్స్, శాన్కోడ్ టెక్నాలజీస్ సంస్థలు బీఎస్ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ మదుపర్లు (FII) గురువారం రూ.1,245.39 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు సైతం రూ.822.99 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

గమనించాల్సిన స్టాక్స్..

రిలయన్స్ ఇండస్ట్రీస్: ఆర్థిక సేవల వ్యాపారాన్ని రిలయన్స్ వేరు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు మే 2న రుణదాతలు, షేర్ హోల్డర్లతో సమావేశం నిర్వహించనుంది. వేరు చేసిన తర్వాత రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్లను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS) గా నామకరణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రిలయన్స్లో ఉన్న ఒక్కో షేరుకు మదుపర్లు జేఎఫ్ఎస్లో ఒక్కో షేరు పొందే అవకాశం ఉందని సమాచారం.

టాటా పవర్: ప్రవీర్ సిన్హాను సీఈఓ, ఎండీగా టాటా పవర్ పునఃనియమించింది. ఆయన ఆ పదవిలో 2027 ఏప్రిల్ 30 వరకు కొనసాగనున్నారు. మరోవైపు రాజస్థాన్లో ఎన్ఎల్ ఇండియా కోసం 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి టాటా పవర్ సోలార్ సిస్టమ్స్కు లెటర్ ఆఫ్ అవార్డ్ లభించింది.

రైల్ వికాస్ నిగమ్: వందే భారత్ ట్రైన్సెట్ల తయారీ, నిర్వహణ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖ నుంచి రైల్ వికాస్కు ‘లెటర్ ఆఫ్ అవార్డ్’ లభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ తయారీ యూనిట్లు, ట్రైన్సెట్ డిపోల ఆధునికీకరణను కూడా చేపట్టాల్సి ఉంటుంది.

హీరోమోటోకార్ప్: నిరంజన్ గుప్తాకు సీఈఓగా పదోన్నతి కల్పిస్తున్నట్లు హీరోమోటోకార్ప్ గురువారం ప్రకటించింది.

భారత్ డైనమిక్స్: భారత సైన్యానికి ఆకాశ్ ఆయుధ వ్యవస్థను అందించేందుకు రక్షణ శాఖతో భారత్ డైనమిక్స్ ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందం విలువ రూ. 8,161 కోట్లు.