Business

ఇంటర్నెట్‌ ఆరు నెలల్లో 15 వేల కోట్లు నష్టం జరిగింది

ఇంటర్నెట్‌ ఆరు నెలల్లో  15 వేల కోట్లు నష్టం జరిగింది

ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,590 కోట్లు) నష్టం వాటిల్లిందని ఒక తాజా నివేదిక పేర్కొంది. ఈ ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు దాదాపు 118 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 968 కోట్లు) విదేశీ పెట్టుబడుల నష్టానికి కారణమయ్యాయని, 21,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ లాభాపేక్షలేని ఇంటర్నెట్ సొసైటీ తన నివేదిక ‘నెట్‌లాస్’లో పేర్కొంది. ఇంటర్నెట్‌ నిషేధ ప్రభావం ఉత్పత్తి నష్టానికే పరిమితం కాదని, నిరుద్యోగ రేటులో మార్పు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోల్పోవడం, భవిష్యత్తులో షట్‌డౌన్‌ల ప్రమాదాలు, పని చేసేవారి జనాభా మొదలైన అంశాలపైనా ప్రభావం చూపుతుందని వివరించింది. ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు అశాంతిని అణచివేస్తాయని, తప్పుడు సమాచార వ్యాప్తిని ఆపివేస్తాయని లేదా సైబర్‌ సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తాయని ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. కానీ ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని అని నివేదిక పేర్కొంది. అల్లర్లను నియంత్రించడానికి భారత్‌ ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లను ఒక సాధనంగా ఉపయోగించడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటివరకు భారతదేశానికి 16 శాతం షట్‌డౌన్ రిస్క్ ఉందని, ఇది 2023 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని తెలిపింది.

ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ల వల్ల ఈ-కామర్స్‌  వ్యాపారాలు స్తంభిస్తాయి. తద్వారా కాలాధారమైన లావాదేవీలు నష్టాలను మిగుల్చుతాయి. నిరుద్యోగాన్ని పెంచుతాయి. వ్యాపార సంస్థలు, కస్టమర్ల కమ్యూనికేషన్‌లకు అంతరాయం కలిగిస్తాయి. కంపెనీలకు ఆర్థికంగా నష్టాలను మిగిల్చడమే కాకుండా పరపతికి భంగం కలిగిస్తాయని నివేదిక ఉద్ఘాటించింది.