Politics

వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్రవేశపెట్టనున్న యూసీసీ బిల్లు

వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్రవేశపెట్టనున్న యూసీసీ బిల్లు

ఒకే దేశం.. ఒకే చట్టం నినాదంతో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) బిల్లును వీలైనంత త్వరగా చట్ట రూపంలోకి తేవాలని తేవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు యూసీసీ(Uniform Civil Code) బిల్లును రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది.

జులై 17వ తేదీ నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే అభిప్రాయసేకరణలో భాగంగా లా కమిషన్‌ ఒక నోటీసు జారీ చేసింది. మరోవైపు ఈ బిల్లును పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీకి సిఫార్సు చేసి.. అభిప్రాయసేకరణ ద్వారా వీలైనంత త్వరగా బిల్లు ఆమోదింపజేసుకోవాలని  కేంద్రం యోచిస్తోంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ అధ్యక్షతన 31 సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ  భేటీ అయ్యేందుకు సిద్ధమైంది. అఖిలపక్ష అభిప్రాయం కోసం జులై 3వ తేదీన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల UCC గురించి చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉమ్మడి పౌర స్మృతి అంశంపై భోపాల్‌లో తాజాగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూనే..  ఇంతా నెలరోజుల గడువులోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. యూసీసీ బిల్లు కోసం కేంద్రం వేగం పెంచింది.

మరోవైపు జూన్‌ 14వ తేదీనే లా కమిషన్‌ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మత సంస్థల అభిప్రాయ సేకరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తద్వారా సమగ్ర పద్ధతిలో తాము ముందుకెళ్తున్నట్లు కమిషన్‌ దేశానికి చాటి చెబుతోంది. అదే సమయంలో.. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటుకు సమర్పించి, అనంతరం దానిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించే అవకాశం ఉందని, వివిధ వర్గాల వాదనలను ఆ కమిటీ స్వీకరిస్తుందని తెలుస్తోంది.బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో యూసీసీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రాజ్యాంగంలోని అధికరణ 44 కూడా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని చెప్తోంది. అయితే.. ప్రతిపక్షాలు, కొన్ని మత సంఘాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలుపగా, కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ హింసాకాండ వంటి సమస్యలు ఉన్నాయని, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ యూసీసీ అంశాన్ని లేవనెత్తుతున్నారని దుయ్యబడుతున్నాయి.ఒకే రకమైన చట్టం..ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి.. దేశం మొత్తం పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. మత చట్టాలు పక్కనపడిపోతాయి. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి అంశాల్లో దేశంలోని ప్రజలందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు అమలవుతున్నాయి. అయితే యూసీసీపై పలు అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి.