మీ వాట్సాప్ (WhatsApp) చాట్స్, ఫైల్స్, ఫొటోస్, వీడియోస్ బ్యాకప్ తీసుకుందామంటే.. మీ డ్రైవ్ సైజ్ సరిపోవడం లేదా? దీంతో కొత్త మొబైల్లోకి ఆ డేటా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారా? అయితే మీ కోసం వాట్సాప్ ఓ ఆప్షన్ తీసుకురాబోతోంది. క్లౌడ్/ డ్రైవ్ బ్యాకప్ అవసరం లేకుండా పాత మొబైల్ నుంచి కొత్త మొబైల్కు డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారానే. ఈ మేరకు ఓ ఫీచర్ను సిద్ధం చేస్తున్నారు. వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ షేర్ ఇట్ తరహాలోనే జరుగుతుంది. రెండు మొబైల్స్ ఒకే నెట్వర్క్కు కనెక్ట్ అయి ఉంటే చాలు.. డేటా సులభంగా ట్రాన్స్ఫర్ చేసేయొచ్చు. వైఫై డైరెక్ట్ సాంకేతికత ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది. షేర్ ఇట్ యాప్ను వాడిన వాళ్లకు ఈ ఫీచర్ వినియోగించడం చాలా సులభం అని చెప్పొచ్చు.
ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఫీచర్ను వాట్సాప్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఓ వీడియోలో చేసి చూపించారు. చిటికెలో చాట్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చని తెలిపారు. దీని కోసం WhatsApp -> Chats -> Chat transfer ఆప్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది. దాంతో కొత్త మొబైల్లోని వాట్సాప్ యాప్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పాత మొబైల్లోని వాట్సాప్ డేటా మొత్తం కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఈ విధానం ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన చాట్ హిస్టరీ పూర్తిగా ఎన్క్రిప్ట్ మోడ్లో ఉంటుందని, ఆ సమాచారం ఇతరులకు షేర్ అయ్యే అవకాశం లేదని వాట్సాప్ తెలిపింది. క్లౌడ్ స్టోరేజీలో సేవ్ చేయలేనంత పెద్ద వాట్సాప్ బ్యాకప్ ఉన్నవాళ్లకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని పేర్కొంది.