Business

TCS: క్రెడిట్ కార్డు వాడే వారికి గుడ్ న్యూస్

TCS: క్రెడిట్ కార్డు వాడే వారికి గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం.. టీసీఎస్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఒక ప్రకటన చేయగా.. దీని వల్ల ఎందరికో బెనిఫిట్ కలుగుతుందని చెప్పొచ్చు. జులై 1 నుంచి అమల్లోకి రావాల్సిన టీసీఎస్ రేట్ల అమలును మరో 3 నెలలు వాయిదా వేసింది. అంటే ఇప్పుడు ఈ కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. అదే సమయంలో.. LRS కింద నిర్వహించే అన్ని లావాదేవీలకు.. టీసీఎస్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. విదేశీ టూర్ ప్యాకేజీలకూ ఏడాదికిగానూ రూ. 7 లక్షల వరకు ఎలాంటి TCS ఉండదని వెల్లడించింది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ఉపయోగించి.. విదేశాల్లో చేసే చెల్లింపులపై మూలం వద్ద పన్ను వసూలు (TCS) చేయాలనే ప్రతిపాదనను ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు బుధవారం వెల్లడించింది కేంద్రం.ఈ వ్యయాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సరళీకృత చెల్లింపు పథకంలో (LRS) చేర్చినట్లు తెలిపింది. ఇక విదేశీ పర్యటక ప్యాకేజీల కింద చేసే ఖర్చులపై టీసీఎస్ వసూలును 20 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను కూడా వాయిదా వేసింది.

దీనిని వాయిదా వేసేందుకు గల కారణాలను కూడా వివరించింది ఆర్థిక శాఖ. క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌లు.. బ్యాంకులు.. ఐటీ ఆధారిత పరిష్కారాలను కొలిక్కి తీసుకొచ్చేందుకు తగినంత సమయం ఇవ్వడానికేనని వివరించింది. ఇక విదేశాల్లో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ LRS కిందకు రావని.. అందువల్లే TCS వర్తించదని తెలిపింది.2023-24 బడ్జెట్ సమయంలో TCS గురించి కీలక ప్రకటన చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. LRS, విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్‌ను అప్పుడు ఉన్న 5 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2023 జులై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పినా.. ఇప్పుడు మరో 3 నెలలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అక్టోబర్ 1 నుంచి రూ. 7 లక్షలపైన LRS వ్యయాలపై మాత్రమే అధిక టీసీఎస్ వసూలు చేయనున్నారు. అంటే రూ. 7 లక్షలలోపు విదేశీ టూర్ ప్యాకేజీల కొనుగోలు, LRS వ్యయాలపై TCS యథావిధిగా 5 శాతంగానే ఉండనుంది.