DailyDose

ఈడీ ఎదుట హాజరైన అనీల్ అంబానీ-TNI నేటి నేర వార్తలు

ఈడీ ఎదుట హాజరైన అనీల్ అంబానీ-TNI నేటి నేర వార్తలు

* ఈడీ ఎదుట హాజరైన రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ

ప్రముఖ బిజినెస్మెన్, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ 2023 జూలై03న  ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు. యెస్ బ్యాంకుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నిస్తున్నారు. యెస్ బ్యాంక్ లోన్ కిక్ బ్యాక్ కేసుకు సంబంధించి అంబానీ చివరిసారిగా 2020లో ఈడీ ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్ దర్యాప్తునకు సంబంధించి యెస్ బ్యాంక్ ప్రమోటర్ రానా కపూర్‌తో పాటు అనిల్ అంబానీకి గతంలో ఈడీ  సమన్లు ​​జారీ చేసింది. నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పిఎ) మారిన యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల్లో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు అత్యధికంగా రుణాలు తీసుకున్నాయని అధికారులు తెలిపారు. అనిల్‌ అంబానీకి చెందిన 9 కంపెనీలు యస్‌ బ్యాంక్‌ నుంచి రూ.12,800 కోట్లు రుణాలు పొందాయి. అయితే కంపెనీలు సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరాయని ఈడీ పేర్కొంది.  గతేడాది సెప్టెంబర్‌లోఅనిల్ అంబానీపై ఎలాంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖను కోరడంతో బాంబే హైకోర్టు రూ. 420 కోట్ల పన్ను ఎగవేత కేసులో అంబానీకి కొంత ఉపశమనం ఇచ్చింది .

బిహార్ లో పవన్ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం

బిహార్ లో పవన్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. ముజఫర్పుర్ స్టేషన్ నుంచి నిన్న రాత్రి ముంబైకి బయల్దేరింది. భగవాన్పుర్ స్టేషన్కు సమీపంలో ఎస్-11 కోచ్ చక్రం విరిగింది. చక్రం విరిగినా ట్రైన్ అలాగే 10కి.మీ. ప్రయాణించింది. శబ్దం కంటిన్యూగా వస్తుండటంతో ఆందోళన చెందిన ప్రయాణికులు చైన్ లాగారు. దీంతో సిబ్బంది వచ్చి ట్రైన్కు మరమ్మతులు చేశారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు

శ్రీకాకుళంజిల్లాలో కాలేజీ విద్యార్థిని కిడ్నాప్

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఓ అమ్మాయి కిడ్నాప్ కలకలం రేపింది. దుర్గా భవానీ అనే అమ్మాయి  శ్రీకాకుళ ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటోంది. సోమవారం సైకిల్ పై కాలేజీకి వెడుతుండగా కారులో వచ్చిన దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన యువతి. ఇటీవలే దుర్గా భవానీకి వివాహం అయ్యింది. వివాహం అయ్యింది కానీ.. దుర్గా భవానికి కాపురానికి వెళ్లలేదు. తల్లిగారింటిదగ్గరే ఉండి చదువుకుంటోంది. దీంతో కిడ్నాప్ చేసింది ఆమె భర్తే అయి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సోమవారం ఎచ్చెర్లలోని నవభారత్ జంక్షన్ సమీపంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో సైకిల్ మీద వెడుతుండగా కిడ్నాప్ జరిగింది.

పుట్టగొడుగుల కూర తిని 10 మందికి అస్వస్థత

 అల్లూరి జిల్లాలో పుట్టగొడుగులను ఆహారంగా తీసుకున్న 10 మంది అస్వస్థతకు గురయ్యారు. పెదబయలు మండలం జామిగూడలో అడవి నుంచి తెచ్చిన పుట్టగొడుగులను కూరగా చేసుకొని కొందరు తిన్నారు. కొద్ది సేపటికే వీరిలో 10 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. బాధితుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరిని పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

వివేకా హత్య కేసు బుధవారానికి విచారణ వాయిదా

వైఎస్ వివేకా హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలని ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ 5వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ కేసును హైకోర్టు కే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సుప్రీం వెల్లడించింది. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణ కు బదిలీ చేసే సమయంలో వివేకా సతీమణీ, కుమార్తెలను బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఆ విషయాన్ని సునీతారెడ్డి తరపు న్యాయవాది సిద్దార్ధ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ కేసులో పిటీషనర్ ఎంవీ కృష్ణారెడ్డిని అనుమానితుడిగా పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన విషయాన్ని కూడా ధర్మాసనం దృష్టికి న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీసుకొచ్చారు. సీబీఐ ఛార్జిషీటు కాపీని సమర్పించడానికి బుధవారం వరకూ గడువు కోరారు. దీంతో కేసు తదుపరి విచారణను బుధవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

చిన్నారిని చిదిమేసిన ప్రైవేట్ స్కూల్ బస్సు

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రైవేటు పాఠశాల బస్సు కిందపడి చిన్నారి సఫినా దుర్మరణం చెందారు. సఫినా స్కూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే బస్సు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

తాడిపత్రి సీఐ ఆత్మహత్య

తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సిఐ ఆనందరావు ఇంటికి చేరుకొని సంఘటన స్థలంలో ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి పని ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు

ఆర్టీసీ బస్సు కింద పడి 6 ఏళ్ల బాలుడు మృతి

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఈశ్వర్ అనే ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇక ఆర్టీసీ బస్సు ఢీకొని ఈశ్వర్ అనే ఆరేళ్ల బాలుడు మృతి చెందడంతో… తీవ్ర ఉద్రిక్తతకు అక్కడి పరిస్థితులు దారితీశాయి.

అమెరికాలో మరోసారి కాల్పులు

అమెరికాలో తుపాకీ సంబంధిత మరణాలు ఏయేటి కాయేడు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాల్టిమోర్‌ సిటీలో శనివారం అర్ధరాత్రి దాటాక బ్రూక్లిన్‌ హౌమ్‌ ఏరియాలోని బ్లాక్‌ పార్టీపై సాయుధ దుండగులు కొందరు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాల్టిమోర్‌ సిటీ యాక్టింగ్‌ పోలీస్‌ కమిషనర్‌ రిచర్డ్‌ వర్లీ ఆదివారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మూకుమ్మడి కాల్పుల్లో బాధితులు 30 మంది దాకా ఉన్నారని చెప్పారు. చనిపోయినవారిలో 18 ఏళ్ల యువతి కూడా ఉన్నట్టు తెలిపారు. కాల్పుల తరువాత హంతకులను ఎవరినీ పోలీసులు ఇంతవరకు పట్టుకోలేకపోయారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకు ఎదురుదెబ్బ

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఆయన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు సంబంధించి మనీష్ సిసోడియా ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారానికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్, హైదరాబాద్ బిజినెస్‌మేన్ అభిషేక్ బోయిన్‌పల్లి, మద్యం కంపెనీ ఎం/ఎస్ పెర్నోడ్ రికార్డ్ మేనేజర్ బినోయ్ బాబు బినోయ్‌ల బెయిల్ పిటిషన్‌లను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

రాజమహేంద్రవరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడి మృతి

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ధవళేశ్వరం వడ్డెర  కాలనీ వద్ద  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న బాలుడు మృతిచెందగా, అతడి తండ్రికి గాయాలయ్యాయి. వివరాలు.. బాలుడిని స్కూల్‌లో దింపేందుకు అతడి తండ్రి బైక్‌పై తీసుకెళ్తున్నాడు. అయితే వారి  బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే బైక్‌పై నుంచి పక్కకు పడిపోయిన బాలుడి తండ్రికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాలుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరకుని వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని  పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు