Business

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు-TNI నేటి వాణిజ్య వార్తలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు-TNI నేటి వాణిజ్య వార్తలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గడంతో రూ. 54,050గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గడంతో రూ.58,960గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.200 తగ్గడంతో రూ.75,500 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 486 పాయింట్లు లాభపడి 65,205కి పెరిగింది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 19,322 కి ఎగబాకింది.

*  76% 2వేల నోట్లు బ్యాంకులకు చేరాయ్: RBI

రిజర్వు బ్యాంకు రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ చలామణిలో ఉన్న 76శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. అందులో.. 87 శాతం నోట్లు డిపాజిట్ కాగా.. 13 శాతం వేరే నోట్లతో మార్చుకున్నట్లు వెల్లడించింది. రూ.2.72 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలిపింది. నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.

అందుబాటులోకి మరో వందే భారత్.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. వేగవంతంగా, సౌకర్యవంతంగా నడిచే మరో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్ నడపాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. అది కూడా ఎప్పుడో కాదండోయ్. ఈ నెల 7 నుంచేనట. ప్రధాని జులై 7న 5 వందే భారత్ ట్రైన్స్‌కు వర్చువల్‌గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అందులో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉందని బెజవాడ రెల్వే డివిజన్‌కు సమాచారం అందిందట. దీంతో అక్కడి అధికారులు ఏర్పాట్లు మొదలెట్టినట్లు వినికిడి. ఈ ట్రైన్ 8వ తారీఖు నుంచి కంప్లీట్‌గా అందుబాటులో ఉంటుందట.

నెల్లూరు జాతి ఆవు ధర ఎంతో తెలుసా?

ఎక్కడైనా మేలు జాతి ఆవు ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ. లక్షల్లో ఉంటుందంటారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే బ్రెజిల్‌లో ఇటీవల జరిగిన వేలంలో నెల్లూరు జాతికి (ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి దశాబ్దాల కిందట కొన్ని ఆవులను బ్రెజిల్‌ తీసుకెళ్లి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్న ఆవులు) చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని అత్యధిక ధర పలికింది. తద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది.వియాటినా–19 ఎఫ్‌4 మారా ఇమ్‌విస్‌ అనే నాలుగున్నరేళ్ల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ. 11.82 కోట్లకు అమ్ముడుపోయింది!! గతేడాది ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ. 6.5 కోట్లు పలకడం అప్పట్లోనే రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.

80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతా?’

 ఖమ్మం సభలో BRSపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ప్రశాంత్రెడ్డి కౌంటరిచ్చారు. ఏ హోదాతో KCRపై రాహుల్ విమర్శలు చేశారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రూ. 4వేలు పింఛను ఇచ్చే దమ్ము కాంగ్రెస్కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు అయితే.. రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేసీఆర్ ది రాచరిక పాలన కాదు.. జనరంజక పాలన అని వ్యాఖ్యానించారు.

ఇండియన్‌ బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ గడువు పెంపు

ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్‌ బ్యాంక్‌ ‘ఇండ్‌ సూపర్‌ 400 డేస్‌’ పేరిట తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం గడువును పొడిగించింది. 2023 మార్చి 6న ప్రారంభించిన ఈ పథకం గడువు జూన్‌ 30తో ముగిసింది. తాజాగా ఆ గడువును ఆగస్టు 30 వరకు పెంచింది. ఈ డిపాజిట్‌ కాలవ్యవధి 400 రోజులు. ఈ పథకం కింద సాధారణ డిపాజిటర్లకు 7.25%, సీనియర్‌ సిటిజన్లకు 7.75%, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 8% వడ్డీ రేట్లను బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. రూ.10 వేల నుంచి రూ.2 కోట్లలోపు డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

రికార్డు స్థాయికి చేరిన రష్యా ముడి చమురు దిగుమతులు!

రష్యా ముడి చమురు దిగుమతులకు సంబంధించి మరో రికార్డు నమోదైంది. గత కొన్ని నెలల నుంచి రష్యా చమురు దిగుమతులను పెంచుతున్న భారత్, గత నెలలోనూ అదే వేగాన్ని కొనసాగించింది. ప్రముఖ డేటా అనాలిసిస్ సంస్థ కెప్లర్ ప్రకారం, గత నెలలో రష్యా నుంచి రోజుకు 22 లక్షల బ్యారెళ్ల చమురు భారత్ దిగుమతి చేసుకుంది. రష్యా చమురు కొనుగోలు సౌదీ అరేబియా, ఇరాక్‌ల సంయుక్త దిగుమతుల కంటే ఎక్కువగా ఉంది. దశాబ్దాలుగా భారత్ ఆ దేశాల నుంచే ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటోంది.గతేడాది ప్రారంభంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా తక్కువ ధరకు రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీన్ని క్రమంగా పెంచుతూ వచ్చింది. ఒకప్పుడు మనం దిగుమతి చేసుకునే మొత్తం చమురులో రష్యా వాటా 2 శాతం ఉండగా, ఈ ఏడాది మే నాటికి 46 శాతానికి చేరడం విశేషం

*  టాటా కార్ల ధరలు మరోసారి పెంపు

పాసింజర్ కార్ల ధరలను టాటా సంస్థ పెంచింది. మరోసారి ఎలక్ట్రిక్ వాహనాలు సహా అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం చొప్పున పెంపు ఉంటుందని పేర్కొంది. జులై 17 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇన్పుట్ కాస్ట్ పెరగడమే ధరల పెంపునకు కారణమని సంస్థ వెల్లడించింది. కాగా ఈఏడాది జనవరి, మే నెలల్లోనూ టాటా కార్ల ధరలు పెరిగాయి.

స్వల్పంగా తగ్గిన జూన్ నెల తయారీ రంగ వృద్ధి!

భారత తయారీ పరిశ్రమ ఈ ఏడాది జూన్‌లో రెండో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. అయితే, అంతకుముందు మే నెల కంటే కొంచెం నెమ్మదించిందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) తెలిపింది. గత నెల గ్లోబల్ మార్కెట్లలో అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉండటంతో పీఎంఐ సూచీ 58.7 పాయింట్ల నుంచి 57.8 పాయింట్లకు పడిపోయింది.అయితే, దేశీయ వస్తువులకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా పీఎంఐ సూచీ అధికంగా ఉందని ఎస్అండ్‌పీ గ్లోబల్ వెల్లడించింది. దాంతో వరుస 24 నెలల నుంచి పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎగువన నమోదవుతూ వచ్చింది. పీఎంఐ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే ఆ రంగంలో వృద్ధి గానూ, దానికి దిగువన ఉంటే వృద్ధి క్షీణతగానూ పరిగణిస్తారు.