NRI-NRT

అమెరికాలో నల్లజాతి మహిళపై పోలీసుల దారుణం

అమెరికాలో నల్లజాతి మహిళపై పోలీసుల దారుణం

అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన పునరావృతం అయింది. భర్త అరెస్టును రికార్డు చేస్తున్న ఓ నల్లజాతి మహిళపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఆమెను నేలపైకి తోసి, మోకాలితో ఆమెను తొక్కేసి దాడి చేశారు. ఆమె కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టారు. ఈ ఘటన లాస్ ఏంజెలెస్ లోని లాంకాస్టర్ ప్రాంతంలో వింకో గ్రాసరీ స్టోర్ సమీపంలో జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది.గ్రాసరీ స్టోర్ లో దొంగతనం చేశారనే ఆరోపణలపై ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాము ఏం నేరం చేయలేదని, తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెబుతూ.. ఆమె అరెస్ట్ ఉదంతాన్ని మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. భర్త చేతికి సంకేళ్లు వేస్తుండగా ఆమె రికార్డ్ చేసింది. ఇది చూసిన సదరు పోలీస్, ఆమె చేతి నుంచి మొబైల్ లాక్కుని, నేలపైకి తోసేశాడు. అక్కడితో ఆగకుండా గతంలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని తలపించే విధంగా ఆమెను మోకాలితో తొక్కిపట్టి, కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టారు.

కళ్లముందే తన భార్య పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న పోలీసుల భర్త వేడుకున్నాడు. తన భార్యను ఏం చేయొద్దని, ఆమె క్యాన్సర్ తో బాధపడుతుందని చెప్పాడు. ఈ ఉదంతాన్ని అక్కడ ఉన్న వారు ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై లాస్ ఏంజెలిస్ కౌంటీ పోలీసులు ఓ ప్రకటిన విడుదల చేశారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులను విధుల్లోంచి తొలగించినట్లు ప్రకటించారు.2020లో మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఓ పోలీస్ దాడి చేసి మెడపై మోకాలితో అదిమిపట్టడంతో ఊపిరాడక ఆ ఆఫ్రో-ఆఫ్రికన్ మరణించారు. ఈ ఘటన యూఎస్ లో సంచలనంగా మారింది. ఫ్లాయిడ్ మరణానికి జాతి వివక్ష కారణం అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఉదంతం డొనాల్డ్ ట్రంప్ అధికారం కోల్పోవడానికి కూడా ఓ కారణమైంది.