Food

ఈ చేప పేరేంటో తెలుసా?

ఈ చేప పేరేంటో తెలుసా?

అది ఈస్ట్ గోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం నందిగూడెం గ్రామం. సన్నని జల్లులు పడుతున్నాయ్.. పొలం పనులు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. సర్లే ముసురుకు నాలుగు చేపలు పట్టుకుని పులుసు పెట్టుకుని తిందామని వారు భావించారు. అనుకున్నదే తడవుగా వల తీసుకుని.. స్థానికంగా ఉన్న వీరదమ్మ చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో బొచ్చ, బురదమట్ట.. చేపలు చిక్కాయి. అరె.. ఈ రోజు భలే చేపలు భలే పడ్డాయ్ అని అనుకున్నారు. ఈ క్రమంలోనే వలలో చేపల తీస్తుండగా.. ఓ వింత చేప కూడా తారసపడింది.సుమారు అరకేజీ బరువుండే ఈ చేప నోరు కిందిభాగంలో ఉంది. వింతైన రంగుతో ఉంది. ఈ ప్రాంతంలో మునుపెన్నడూ ఇలాంటి చేప చూడలేదని, దీన్ని ఏమని పిలుస్తారో కూడా తమకు తెలియదని చేపలు పట్టేవారు చెప్పారు. దీన్ని సుకర్‌ ఫిష్‌ (తెలుగులో దెయ్యం చేప) అంటారని మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణవేణి తెలిపారు. ఈ రకం ఎక్కువగా బంగ్లాదేశ్‌లో కనిపిస్తాయని, తొలుత కలుపు మొక్కలు తిని, తరువాత జలాల్లో ఉండే చిరు చేపలను తినేస్తుందని పేర్కొన్నారు. ఈ రకం చేపలు మనుషులు తినరాదని స్పష్టంచేశారు.