Kids

విద్యార్థులకు జుట్టు కత్తిరించిన టీచర్

విద్యార్థులకు జుట్టు కత్తిరించిన టీచర్

క్రమశిక్షణ పేరుతో ఓ టీచర్ బాలికల పట్ల కఠినంగా వ్యవహించింది. ఎన్నిసార్లు చెప్పినా జుట్టు కత్తిరించుకోవడం లేదని ఆమే స్వయంగా రంగంలోకి దిగింది. కత్తెర పట్టుకొని పలువురి జుట్టు కత్తిరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన స్కూల్ మేనేజ్మెంట్.. ఆ టీచర్ ను సస్పెండ్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి. నోయిడా సిటీలోని సెక్టార్ 168లో శాంతి ఇంటర్నేషనల్ స్కూల్ కొనసాగుతోంది. అందులో సుష్మా అనే మహిళ టీచర్ గా పని చేస్తోంది. అయితే విద్యార్థినులు గత కొంత కాలం నుంచి జుట్టు పెంచుకోని స్కూల్ కు వస్తున్నారు. దీంతో చాలా రోజుల నుంచి ఆమె జుట్టు కత్తిరించుకొని రావాలని వారికి సూచిస్తోంది.

కానీ ఆ బాలికలు టీచర్ చెప్పినట్టుగా వినలేదు. ఎప్పటిలాగే బుధవారం ఆ బాలికలు స్కూల్ కు వచ్చారు. అయితే వారి తీరుతో విసిగిపోయిన టీచర్ సుష్మా స్వయంగా రంగంలోకి దిగి, కత్తెరతో 15 మంది జుట్టును కత్తిరించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ టీచర్ ను మేనేజ్మెంట్ సస్పెండ్ చేసిందని అడిషనల్ డీసీపీ (నోయిడా) శక్తి అవస్థి తెలిపారు.