Health

గుండె జబ్బులు తగ్గాలంటే ఈ డైట్ పాటించండి

గుండె జబ్బులు తగ్గాలంటే ఈ డైట్ పాటించండి

గుండె సంబంధ వ్యాధుల రిస్క్‌ను తగ్గించుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో విధమైన డైట్‌ను పాటిస్తుంటారు. కానీ వారి డైట్‌లో ఆ రిస్క్‌ను తగ్గించడానికి కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు కావాల్సిన మోతాదులో ఉండకపోవడంతో ఆ డైట్‌ సరిగా పనిచేయదు. దాంతో సమస్య తగ్గదు. ఈ నేపథ్యంలో డైట్‌లో ఎలాంటి ఆహార పదార్థాల కాంబినేషన్‌ను మెయింటెయిన్‌ చేయగలిగితే గుండె వ్యాధుల రిస్క్‌ తగ్గుతుందో తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ఇటీవల యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఈ నూతన అధ్యయనం ప్రకారం.. అన్ని రకాల గింజ ధాన్యాలను, ప్రాసెస్‌ చేయని మాంసాలను మరీ తక్కువగా కాకుండా, మరీ ఎక్కువగా కాకుండా మితంగా, కావాల్సినంత తీసుకోవాలి. ఆరోగ్యకరమైన డైట్‌ పద్ధతుల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు, చేపలు, కొవ్వు కలిగి ఉన్న అన్ని రకాల డెయిరీ ఉత్పత్తులు నిత్యం తమ డైట్‌లో భాగంగా మితంగా ఉండేలా చూసుకోవాలి. అంటే పై ఆరు రకాల ఆహార పదార్థాల కాంబినేషన్‌ను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాటిస్తే గుండె వ్యాధుల రిస్క్‌తోపాటు, గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

పాపులేషన్‌ హెల్త్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (PHRI) కు చెందిన పరిశోధకలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహ పరిశోధకులు కలిసి ఈ తాజా అధ్యయనం చేశారు. ప్రపంచంలోని 80 దేశాలకు చెందిన 2.45 లక్షల మంది డైట్‌పై పలు విధాలుగా, పలు దఫాలుగా పరిశోధన చేసి వారు ఈ కొత్త అధ్యయనాన్ని రూపొందించారు. ఈట్‌-లాన్సెట్‌ ప్లానెటరీ డైట్‌, మెడిటెర్రేనియన్‌ డైట్‌ లాంటి మునుపటి డైట్‌ పద్ధతులు.. ప్రధానంగా పశ్చిమ దేశాల్లో గుండె వ్యాధులకు, మరణాలకు డైట్‌తో ఉన్న సంబంధాలను పరిశీలించాయని వారు తెలిపారు.

పోషక విలువలుంటే ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు మంచివే..!

ఆరోగ్యకరమైన డైట్‌ పద్ధతిని పాటిస్తున్న దేశాలుగా తాము పేర్కొన్న వాటిలో ఎక్కువగా ఎగుమ మధ్య ఆదాయ దేశాలు, తక్కువ ఆదాయం కలిగిన దేశాలే ఉన్నాయని ‘ప్రాస్పెక్టివ్‌ ఆఫ్‌ అర్బన్‌ అండ్ రూరల్‌ ఎపిడెమాలాజికల్‌’ ప్రధాన పరిశోధకుడు సలీం యూసఫ్‌ చెప్పారు. అన్ని రకాల పోషక విలువలు కలిగి ఉన్నట్లయితే ప్రాసెస్‌ చేసిన, అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారపదార్థాలు కూడా గుండె ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయని నమ్ముతున్నట్లు రిసెర్చర్స్‌ తెలిపారు.

ఆరోగ్యకర ఆహారమే అయినా మితమే హితం..ఈ రోజుల్లో ప్రజలకు వ్యాధులపై అవగాహన పెరిగి ఆరోగ్యానికి రక్షణ కల్పించే ఆహార పదార్థాలను అధిక మోతాదులో తీసుకుంటున్నారని, ఇది కరెక్ట్‌ కాదని పరిశోధకులు చెబుతున్నారు. భూమిపై సహజంగా లభించే ఆహార పదార్థాలైన పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లను అతిగా తీసుకోవడం కంటే మన శరీరానికి కావాల్సి స్థాయిలో మితంగా తీసుకోవడం ఉత్తమమని ’హెల్త్ రిసెర్చ్‌ మెథడ్స్‌ ఎవిడెన్స్‌ అండ్‌ ఇంపాక్ట్‌’ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, PHRI సైంటిస్టు ఆండ్రూ మెంటే తెలిపారు. గుండె ఆరోగ్యానికి మంచిదని పైన పేర్కొన్న ఆరు రకాల ఆహార పదార్థాల్లో (పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లు, కొవ్వుతో కూడిన డెయిరీ ఉత్పత్తులు, చేపలు) ఏది ఎంత మోతాదులో తీసుకోవాలో సైంటిస్టులు వివరించారు.

ఏ పదార్థం ఎంత మోతాదులో..అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్న వివరాల ప్రకారం ఆరోగ్యకరమైన డైట్‌ అంటే.. పండ్లను, కూరగాయలను సగటున రోజుకు రెండు నుంచి మూడు సార్లు తీసుకోవాలి. కానీ తీసుకున్న ప్రతిసారి మితంగా తినాలి. అదేవిధంగా ధాన్యపు గింజలను రోజుకు ఒక్కసారి మాత్రమే మితంగా తీసుకోవాలి. అదేవిధంగా డెయిరీ ఉత్పత్తులను మితంగా రోజుకు రెండుసార్లు డైట్‌లో భాగమయ్యేలా చూసుకోవాలి. ఇక చిక్కుళ్లను వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. చివరగా చేపలను కూడా వారానికి రెండు నుంచి మూడు సార్లు మితంగా తీసుకోవాలి. ఈ డైట్‌ను పాటిస్తే గుండె వ్యాధుల రిస్క్‌ చాలా వరకు తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

కాగా, 2019లో 1.80 కోట్ల మంది గుండె నరాల సంబంధ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో అది 32 శాతమని పేర్కొంది. గుండె వ్యాధుల కారణంగా సంభవించిన ఆ 1.80 కోట్ల మరణాల్లో 85 శాతం గుండె పోటు మరణాలేనని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.