Movies

మరోసారి స్త్రీ పాత్రలో కమల్ హాసన్ ?

మరోసారి స్త్రీ పాత్రలో కమల్ హాసన్ ?

పాత్రకు తగ్గట్టుగా మేకోవర్‌ అవడంలో నటుడు కమలహాసన్‌ తర్వాతే ఎవరైనా అని పేర్కొనవచ్చు. ఒకే చిత్రంలో పది పాత్రలు పోషించిన నటుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది విశ్వనటుడు కమలహాసన్‌ ఒకరే. పాత్రకు అవసరమైతే మేకప్‌ కోసమే గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తారాయన. అందుకు దశావతారం చిత్రమే ఒక ఉదాహరణ. అందులో పది పాత్రలు పోషించిన ఆయన ఒక్కో పాత్రలకు ఒక్కో విధంగా తయారైన తీరు అద్భుతమనే చెప్పాలి.ఆ చిత్రంలో ఒక వృద్ధ మహిళా పాత్ర కోసం కమలహాసన్‌ మేకోవర్‌ అయిన విషయం సంచలనమనే చెప్పాలి. కాగా అదేవిధంగా అవ్వై షణ్ముకి (భామనే సత్యభామనే) చిత్రంలో నడివయసు స్త్రీ పాత్రను పోషించి నేర్పించారు. పలువురు హీరోలు స్త్రీ  పాత్రలు పోషించినా పూర్తిస్థాయి మహిళా పాత్రల్లో నటించింది మాత్రం కమలహాసనే. కాగా తాజాగా ఆయన ఇండియన్‌– 2 చిత్రంలో మరోసారి మహిళగా అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం.

28 ఏళ్ల క్రితం కమలహాసన్‌ కథానాయకునిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్‌. కాగా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కమలహాసన్‌, శంకర్ల కాంబినేషన్లో లైకా ప్రొడక్షనన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పలు అద్భుతాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో కథలో భాగంగా కమలహాసన్‌ స్త్రీ  పాత్రలో కనిపించబోతున్నారన్నది తాజా సమాచారం. దీంతో ఇప్పుడు ఈ చిత్రంలో కమల్‌ స్త్రీ  గెటప్‌ ఎలా ఉంటుందని ఆసక్తి నెలకొంది.