DailyDose

ఏపీ 10వ తరగతి పరీక్షా విధానంలో మార్పులు

ఏపీ 10వ తరగతి పరీక్షా విధానంలో మార్పులు

పదో తరగతి పరీక్షల్లో(AP SSC Exams) గత ఏడాది ఆరు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం పేపర్‌ను 50 మార్కులకు మరో ప్రశ్నపత్రంగా ఇస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన సమావేశంలో పదో తరగతి పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులను ప్రకటించారు. రెండు రోజులు జరిగే సామాన్యశాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇస్తారు. మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపరే ఉంటుంది.

ఇప్పటి వరకు ఉన్న కాంపొజిట్‌ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం 70/30 మార్కుల విధానంలో తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్‌, ఉర్దూ/ పార్శీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి మొదటి భాష ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది.

తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు కేటాయించారు. రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులకు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.

గతంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అవసరమైన చోటుకు ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేస్తారు. మొదట స్కూల్‌ కాంప్లెక్స్‌, మండలం, డివిజన్‌ ఇలా ప్రాధాన్య క్రమంలో ఈ ప్రక్రియను చేపడతారు. పురపాలక పాఠశాలల్లో అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను పురపాలక లేదా దగ్గర్లోని ఇతర యాజమాన్య పాఠశాలల్లోనూ సర్దుబాటు చేస్తారు. అవసరం, అదనం ఆధారంగా ఈ సర్దుబాటు ఉంటుంది.

పురపాలక ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలు లేనందున పెండింగ్‌లో ఉన్న వైద్య బిల్లుల గడువును పొడిగిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. పదోన్నతులు, బదిలీల కారణంగా రెండు నెలల నుంచి జీతాలు రాని ఉపాధ్యాయులకు వారంలో జీతాలు ఇప్పిస్తామన్నారు. ఎంఈఓ-1, ఎంఈఓ-2 జాబ్‌ ఛార్ట్‌పై వచ్చే వారం మరోసారి సమావేశం నిర్వహిస్తామని, ఇటీవల బదిలీ పొంది రిలీవ్‌ కాని 450 మంది ఉపాధ్యాయులను త్వరలో రిలీవ్‌ చేస్తామని మంత్రి తెలిపారు.

ఉపాధ్యాయులపై పనిభారం పెంచడం, సెక్షన్‌ పరిమాణాన్ని 50 శాతానికి పైగా పెంచడం వల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయని, హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థకు మేలు జరుగుతుందని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు విన్నవించారు. ఎంఈఓలు ఇద్దరికీ సమానంగా అధికారాలు కల్పించాలని ఎస్టీయూ కోరింది. అంతర్‌జిల్లాల బదిలీలు, డీఎస్సీ-2003, పాత పింఛన్‌ అమలుపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య విన్నవించింది. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.