Politics

మరికాసేపట్లో లోక్‌ సభలో చర్చ ప్రారంభించనున్న రాహుల్‌

మరికాసేపట్లో లోక్‌ సభలో చర్చ ప్రారంభించనున్న రాహుల్‌

ప్రధాని మోదీ ప్రభుత్వం (Pm Modi Govt)పై విపక్ష కూటమి ‘ఇండియా’ (INDIA) లోక్‌ సభ (Lok Sabha )లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) పై నేడు చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌ సభలో చర్చ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటల వరకు ఈ చర్చ కొనసాగుతుంది. కాగా, విపక్ష కూటమి తరపున ఈ చర్చను కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gnadhi) ప్రారంభించనున్నారు. ఈ చర్చలో విపక్ష కూటమి తరపున రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీలు మనీశ్‌ తివారీ, దీపక్‌ బైజ్‌, అధీర్‌ రంజన్‌ చౌదరి, బెన్నీ బెహనాన్‌, హిబి ఈడెన్‌, టీఎన్‌ ప్రతాపన్‌, గౌరవ్‌ గొగొయ్‌, డీన్‌ కురియకోస్‌ పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు అధికార పక్షం తరపున ఐదురుగు మంత్రులు అవిశ్వాసంపై సమాధానమివ్వనున్నారు. సభలో బీజేపీ తరపున నిషికాంత్‌ దుబే చర్చను ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్‌ రిజిజు పాల్గొననున్నారు.

ఈ అవిశ్వాస తీర్మానంపై మూడు రోజులు పాటు సభలో చర్చ జరగనుంది. దీనిపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు చివరిరోజైన ఆగస్టు 10వ తేదీన సాయంత్రం 4గంటలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు లోక్‌ సభ ఉదయం 11 గంటలకు ప్రారభమైంది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఆ వెంటనే సభలో మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్నారు.