DailyDose

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ-TNI నేటి తాజా వార్తలు

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ-TNI నేటి తాజా వార్తలు

తిరుమలలో కుండపోత వర్షం

తిరుమలలో భారీవర్షం కురుసింది.శనివారం రాత్రి నుంచి కుండపోతగా కురుసింది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతరిపి లేకుండా వర్షం పడటంతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో సామాగ్రి అంతా తడిసిపోయింది. ఇక రాంబగీచా పార్కింగ్ ఏరియాలో డ్రెయిన్ బ్లాక్ కావడంతో మోకాళ్ళలోతు వరద నీరు నిలిచిపోయాయి. వర్షపు నీటిలో బైకులతో సహా పలు వాహనాలు నీట మునిగాయి. వర్షపు నీటిని బయటకు పంపేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. తిరుమలలో కురుస్తు్న్న వర్షాలకు  మొదటి, రెండు ఘాట్ రోడ్లలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవాలయ అధికారులు సూచించారు. వర్షం కారణంగా కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్ర త్తగా వెళ్లాలని సూచించారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

 కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో తిరుమల  పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 29 కంపార్ట్‌మెంట్ల  లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71,073 మంది భక్తులు దర్శించుకోగా 37,215 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వచ్చిందన్నారు.

* కామ్రేడ్స్‌తో పొత్తుల కోసం చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎం భాగస్వామ్యంలో ఉండటంతో… తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తో జతకట్టాలని భావిస్తోంది. తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ టాక్రేతో వామపక్ష నేతలు సమావేశం అయ్యారు.పొత్తులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో జతకట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని భావిస్తున్నారు. ఇక అటు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ థాక్రేతో ఆర్‌. కృష్ణయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 18 డిమాండ్ లపై థాక్రే కు లేఖ ఇచ్చానని ఆర్‌. కృష్ణయ్య పేర్కొన్నారు. దళిత డిక్లరేషన్ మాదిరిగా.. bc డిక్లరేశన్ పెట్టాలని కోరామని.. మళ్ళీ ఓ సారి కలుద్దాం అని చెప్పారని వివరించారు ఆర్‌. కృష్ణయ్య. అన్ని విషయాలు డిక్లరేషన్ లో పెడితే పార్టీకి కలిసి వస్తోంది అని చెప్పానని… పేర్కొన్నారు ఆర్‌. కృష్ణయ్య.

వరలక్ష్మి వ్రతం వేడుకల్లో కేజీఎఫ్‌ హీరో

ఇటీవల హీరో యశ్‌, రాధికా పండిట్ ఇంట్లో వరమహాలక్ష్మి పండుగను ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్‌ దంపతులతో పాటు పిల్లలు కూడా సంప్రదాయ దుస్తు్ల్లో మెరిశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.ఒకప్పటి ప్రముఖ నటి, కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ సతీమణి రాధికా పండిట్ ఇప్పుడు తన కుటుంబానికి ఫుల్ టైమ్ వెచ్చిస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న ఈ అందాల తార తన పిల్లలు ఐరా, ఆథర్వ్‌ల పోషణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది.ఇక కేజీఎఫ్‌ హీరో కూడా తన నెక్ట్స్‌ ప్రాజెక్టును అధికారికంగా అనౌన్స్‌ చేయలేదు. దీంతో అధిక సమయం తన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా గడుపుతున్నాడు. తరచూ తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్లకు వెళుతున్నాడు. పండగలు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు.ఇటీవల హీరో యశ్‌, రాధికా పండిట్ ఇంట్లో వరమహాలక్ష్మి పండుగను ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్‌ దంపతులతో పాటు పిల్లలు కూడా సంప్రదాయ దుస్తు్ల్లో మెరిశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది రాధికా పండిట్. తరచూ తన ఫ్యామిలీ ఫొటోస్‌లను నెట్టింట షేర్‌ చేసుకుంటుంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. . రాధికా పండిట్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కాగా రాధికా పండిట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 32 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫోటోలను షేర్ చేసిన గంట వ్యవధిలోనే నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు. వేల మంది కామెంట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన కేసీఆర్

 దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని, ఒక్కొక్క వికలాంగుడు ఒక్కొక్క కేసీఆర్ కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల ఆత్మ గౌరవం పెంచారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని, ముందుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఖర్గే మొదట డిక్లరేషన్ చేసి, ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ చేయాలని మంత్రి దుయ్యబట్టారు.సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్‌లో బీడీ టేకేదార్లకు నూతన పింఛను మంజూరు, దివ్యాంగులకు పింఛన్ల పెంపు పత్రాల పంపిణీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ క్రమబద్ధీకరణ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశంలోని కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండి వెయ్యి రూపాయల పింఛను మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేసి ఇప్పటికీ బండి లేదు.. గుండు లేదని ఎద్దేవా చేశారు.బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి పెన్షన్ ఇవ్వడం లేదని, రాష్ట్రంలో 5 లక్షల 5 వేల 225 మంది దివ్యాంగులు ఉన్నారని, దివ్యాంగులు ప్రేమ కలవారని, మాటమీద ఉంటారని మీరు అడగకున్నా పెన్షన్ పెంచారని చెప్పుకొచ్చారు. గృహ లక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని దివ్యాంగులు దీవించాలని కోరారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీలు చేసేవారు ఉంటే ఎక్కడా కూడా పెన్షన్ ఇవ్వడం లేదని, తెలంగాణలో బీడీ కార్మికులకే కాదు బీడీ టేకేదార్లకు 2016 పెన్షన్ ఇస్తున్నామని వివరించారు.మనకు అన్నం పెట్టే కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని కోరారు. జిల్లాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు బాగా పని చేసి జిల్లాకు అవార్డుల పంట పండించారని అభినందించారు. జిల్లాలో 167మందిని రెగ్యులర్ చేస్తున్నామని, మిగిలిన 11 మందిని త్వరలోనే చేస్తామని ధీమానిచ్చారు. సీఎం కేసీఆర్ ఆలోచన వల్లే రెగ్యులరైజేషన్ చేశారనే విషయాన్ని మరువొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు వంటేరు యాదవ రెడ్డి, కూర రఘోతం రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్‌, తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న సీపీఎం స్టేట్ కమిటీ మీటింగ్

 ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని మాకినేనే బసవపున్నయ్య కార్యాలయంలో సీపీఎం స్టేట్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, తెలంగాణ రాష్ర్టంలోని రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నారు నాయకులు. ఈ సమావేశానికి తమ్మినేని వీరభద్రం, రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. 

జగన్‌ ప్రభుత్వంలో అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు

విజయవాడ: జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా తమపై రాజకీయ వేధింపులు పెరిగాయని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపించారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ రాష్ట్ర సదస్సుకు అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన సరకులు సరఫరా చేయడం లేదని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తన మనుషులకే.. అంగన్వాడీ సరకులు అందజేసే బాధ్యత అప్పగించారని మండిపడ్డారు.

విమర్శలకు భయపడేవాడిని కాదు : టీటీడీ చైర్మన్

“నా మీద క్రిస్టియన్ అని, నాస్తికుడననే కువిమర్శలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం.. అటువంటి ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదు” అని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీ టీ డి ) ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు (ఆదివారం) తిరుపతిలో జరిగిన “మూడు తరాల మనిషి భూమన్” అనే పుస్తకావిష్కరణ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆ వేదిక పై మాట్లాడుతూ ఇటీవలికాలంలో సామాజిక మధ్యమాలలో తనపై వస్తున్న మత పరమైన విమర్శలపై తొలిసారిగా స్పందించారు.ఈ సందర్బంగా కరుణాకర రెడ్డి మాట్లాడుతూ 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయినప్పుడు తిరుమలేశుని ఆశీస్సులతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని చెప్పారు. తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకున్నది తానేనని తెలిపారు. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ,దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది కూడా తానేనని గుర్తు చేసారు. అన్నిటినిమించి ఎన్నో పోరాటాల ద్వారా పైకి వచ్చిన వ్యక్తి గా కేవలం రాజకీయ పరమైన కారణాలతో తన వ్యక్తిత్వం పైన, తన మతం పైన కొందరు పనికట్టుకుని చేసే కువిమర్శలకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేసారు.

మెట్రో స్టేషన్ ల గోడలపై ఖలిస్థాన్ అనుకూల నినాదాలు

జీ -20 సదస్సుకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థాన్ నినాదాలు కలకలం రేకెత్తించాయి. ఢిల్లీలోని ఐదుకు పైగా మెట్రో స్టేషన్ల గోడలపై ఆదివారం ఖలిస్థాన్ అనుకూల నినాదాలు రాసి కనిపించాయి. వాటిపై ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్, ఖలిస్తాన్ జిందాబాద్’ అపి పేర్కొని ఉంది. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్, శివాజీ పార్క్, మదిపూర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ నగర్, మహారాజా సూరజ్మల్ స్టేడియం సహా మెట్రో స్టేషన్ల గోడలపై ‘ఢిల్లీ బనేగా ఖలిస్తాన్’, ‘ఖలిస్తాన్ రెఫరెండం జిందాబాద్’ వంటి నినాదాలు నల్లరంగులో స్ప్రే చేయబడ్డాయి. నిషేధిత సిక్కుస్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) కార్యకర్తలు శివాజీ పార్క్, పంజాబీ బాగ్ సహా పలు మెట్రో స్టేషన్లలో ఉండి ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.దేశ రాజధాని జీ 20 శిఖరాగ్ర సదస్సుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇది చోటు చేసుకుంది.  సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు యూరోపియన్ యూనియన్ కు చెందిన 30 మంది దేశాధినేతలు, ఉన్నతాధికారులు, ఆహ్వానిత దేశాలు, 14 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. జీ20 సదస్సుకు ముందు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాసిన ఢిల్లీ మెట్రో స్టేషన్ల ఫుటేజీని సిక్కుస్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) విడుదల చేసింది.అలాగే నంగ్లోయిలోని ప్రభుత్వ సర్వోదయ బాల విద్యాలయ గోడలు భారత వ్యతిరేక గ్రాఫిటీతో నిండిపోయింది. దీనిపై ఢిల్లీ పోలీసు స్పెషల్ ఫోకస్ చేసింది. వివిధ ప్రదేశాలలో బలగాలను మోహరించింది. కాగా.. మెట్రో స్టేషన్ల గోడలపై రాసిన గ్రాఫిటీలన్నింటినీ తొలగించినట్లు డీసీపీ (మెట్రో) తెలిపారు. అనుమానితులను గుర్తించి వీలైనంత త్వరగా అరెస్టు చేసేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 

షారుక్ ఖాన్ నివాసం ఎదుట నిర‌స‌న‌లు

ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌ను ప్రోత్స‌హించే ప్ర‌క‌ట‌న‌లో న‌టించినందుకు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారుక్ ఖాన్ (SRK) నివాసం మ‌న్న‌త్ ఎదుట కొంద‌రు నిర‌స‌న తెలిపారు. ఆందోళ‌నకారుల నిర‌స‌న నేప‌ధ్యంలో మ‌న్న‌త్ వ‌ద్ద పోలీసులు బందోబ‌స్తు ఏర్పాట్లు ముమ్మ‌రం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.షారుక్ ఇటీవ‌ల ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన యాడ్‌లో న‌టించడంతో వివాదంలో కూరుకుపోయారు. షారుక్ ఈ త‌ర‌హా యాడ్‌లో న‌టించ‌డంపై ఆయ‌న ఇంటి ఎదుట ఇటీవ‌ల పలువురు నిర‌స‌న‌లు తెల‌ప‌డంతో మ‌న్న‌త్ వ‌ద్ద బందోబ‌స్తును క‌ట్టుదిట్టం చేశారు. ఆన్‌లైన్ ర‌మ్మీ పోర్ట‌ల్ ఏ23 ఇటీవ‌ల షారుక్ ఖాన్‌ను ఏ23 గేమ్స్ ప్లాట్‌ఫాంకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించింది. యాప్‌కు ఇటీవ‌ల షారుక్ చేసిన ప్రోమోలో రండి క‌లిసి ఆడ‌దాం అన‌డం వినిపిస్తుంది.దీంతో ఆన్‌లైన్ ర‌మ్మీని ప్ర‌మోట్ చేసే యాడ్‌లో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ న‌టించ‌డానికి వ్య‌తిరేకంగా షారుక్ నివాసం వ‌ద్ద అన్‌ట‌చ్ యూత్ ఫౌండేష‌న్ సార‌ధ్యంలో నిర‌స‌న‌లు చేప‌ట్టారు. జంగిల్ ర‌మ్మీ, జుపీ వంటి ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌కు వ్య‌తిరేకంగా తాము పోరాడుతున్నామ‌ని ఈ గ్రూప్ వెల్ల‌డించింది. ప్ర‌ముఖ నటీన‌టులు ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ స‌మాజాన్ని త‌ప్పుదారిప‌ట్టిస్తున్నార‌ని, అన్‌ట‌చ్ ఇండియా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌న్న‌త్ బంగ్లా ఎదుట నిర‌స‌న‌లు చేప‌డ‌తామ‌ని ఈ గ్రూప్ ప్ర‌క‌టించింది