అఫ్ఘానిస్థాన్‌లో మహిళల స్వేచ్ఛపై ఇప్పటికే తాలిబన్లు అనేక ఆంక్షలు పెట్టారు. వారి చేతుల్లో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంతోమంది అఫ్ఘాన్ మహిళలు ఆవేదన చేస్తున్నారు. మరికొందరు రోడ్లపైకి వచ్చి తమకు స్వేచ్ఛ కల్పించాలంటూ నిరసనలు చేస్తున్నారు. అయినా కూడా తాలిబన్లు మహిళలు చేస్తున్న నిరసనలు,ఆందోళనలను తమ బలప్రయోగంతో అణిచివేస్తున్నారు. గత ఏడాది ఆడవారిని పాఠశాల, కళాశాల విద్యకు దూరం చేశారు. ఇటీవలే మహిళలు బుర్ఖా ధరించకుండా అసలు పార్కుల్లోకి కూడా రాకూడదంటూ ఆంక్షలు పెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా తాలిబన్లు చేసిన ఓ పనికి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. దాదాపు 100 మంది అఫ్ఘాన్ మహిళలు దుబాయ్‌లో ఉన్నత విద్య కోసం వెళ్లేందుకు సిద్దమవ్వగా వారిని ఎయిర్‌పోర్టులో తాలిబన్లు అడ్డుకోవడం కలకలం రేపింది.
ఇక వివరాల్లోకి వెళ్తే దుబాయ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఖలాఫ్ అహ్మద్ అల్ అబ్తూర్ అఫ్ఘాన్ మహిళలకు యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్ సహాకారంతో వారికి ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ అందించేందుకు ఒప్పుకున్నారు. దీంతో 100 మంది మహిళలు ఆ యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్‌లో విద్యను అభ్యసించడం కోసం సిద్దమయ్యారు. ఇక దుబాయ్ వెళ్లేందుకు కాబుల్‌లోని ఎయిర్‌పోర్టుకు వచ్చారు. కానీ వారిని చూసిన తాలిబన్లు ఆ మహిళలు ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో దుబాయ్ వ్యాపారవేత్త అహ్మద్ అల్ హబ్తూర్ సామాజిక మాధ్యమంలో ఓ వీడియో రూపంలో స్పందించారు. మహిళలను తాలిబన్లు దుబాయ్ రాకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే వారి నుంచి తప్పించుకొని దుబాయ్‌కు రాగలిగారని అన్నారు. తాలిబన్లు జోక్యం చేసుకోవడం వల్ల అఫ్ఘానిస్థాన్ మహిళలు దుబాయ్‌కు రాలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అఫ్ఘానిస్థాన్‌లోని అధికారులు.. ఆ మహిళల ప్రయాణాన్ని అడ్డుకొని వారి స్వేచ్ఛను హరించారంటూ ఆయన మండిపడ్డారు. ఓ అఫ్ఘాన్ మహిళ.. తనకు తోడుగా ఒక వ్యక్తి ఉన్నప్పటికీ కూడా.. ఆమెతో పాటు చాలామంది మహిళలను ఎయిర్‌పోర్ట్ అధికారులు అడ్డుకున్నారని ఆమె చెప్పిన ఆడియోని కూడా హబ్తూర్ షేర్ చేశారు. అయితే తాలిబన్ల నిబంధనల ప్రకారం మహిళలు.. ఒక మగ బంధువు తోడు లేకుండా ప్రయాణాలు చేయకూడదు.. పబ్లిక్ ప్రాంతాల్లో తిరగకూడదు. మరో విషయం ఏంటంటే గత ఏడాది అఫ్ఘానిస్థాన్‌లోని హై స్కూల్స్, యూనివర్సిటీల్లో మహిళలకు అడ్మిషన్లను కూడా తీసివేసి వారికి చదువును దూరం చేశారు.
అయితే అఫ్ఘాన్ మహిళలకు దుబాయ్‌లో ఉన్నత విద్య అందించేందుకు గత కొన్ని నెలల నుంచి అనేక ప్రణాళికలు వేశామని.. కానీ ఇప్పుడు వారు ఉన్నత చదువుకు దూరమవుతున్నారని హబ్తూర్ వాపోయారు. తాను పెట్టిన వీడియో సందేశాన్ని యునిసేఫ్ అఫ్ఘానిస్థాన్ మరియు యూఎన్‌హెచ్‌ఆర్‌కు ట్యాగ్ చేసి సహాయం చేయాలని అభ్యర్థించారు. అందురూ ఈ విషయంలో జోక్యం చేసుకోని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ అఫ్ఘాన్ మహిళలను రక్షించాలని కోరారు. ఇదిలా ఉండగా గత రెండేళ్లలో తాలిబన్ల పాలనను భరించలేక అఫ్ఘానిస్థాన్ నుంచి పారిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికి దాదాపు 16 లక్షల మందికి పైగా ఆ దేశాన్ని విడిచి పారిపోయారు.