డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబరు 2న ఇళ్లను కేటాయించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కోసం ఆన్‌లైన్ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులతో మంత్రి వర్చువల్‌గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి.. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తమ కల నెరవేరబోతున్న సందర్భంగా మంత్రితో మాట్లాడిన బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, సైదాబాద్, యూసుఫ్‌గూడ, బేగంబజార్, బోరబండ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించినట్టు మంత్రి తలసాని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 12 వేల మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. సెప్టెంబరు 2న లబ్ధిదారులకు జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల వద్ద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇళ్లు కేటాయించారనేది అధికారులు తెలియజేస్తారన్నారు.