DailyDose

కేసీఆర్‌ కు రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ-TNI నేటి తాజా వార్తలు

కేసీఆర్‌ కు రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ-TNI నేటి తాజా వార్తలు

*  కేసీఆర్‌ కు రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడే ఎరువులను వందకు వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తామని 2017 ఏప్రిల్‌ 13న ప్రగతి భవన్‌ సాక్షిగా మీరు రైతులకు ఇచ్చిన మాట. అన్ని హామీలు మాదిరిగానే ఈ మాటకు దిక్కు లేకుండా పోయిందని లేఖలోవివరించారు. ఆరు నూరు అవుతుందేమో కానీ మీరు మాట మీద నిలబడడు అని మరో సారి నిరూపితమైంది. ఉచిత ఎరువులు అని రెైతుల చెవిలో మీరు పెట్టిన గులాబీ పూలు అలాగే ఉన్నాయంటూ విమర్శలు చేశారు.కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఉచిత ఎరువులు సంగతేమో కానీ, పైసలిచ్చి కొందామనుకున్న ఎరువులు దొరక్క అల్లాడే పరిస్థితి రైతులది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కోఆపరేటివ్ సొసైటీలు, వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుల వద్ద ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారని ఆగ్రహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది.వానాకాలం వరి నాట్లు ముగింపు దశకు వచ్చాయి. వరి నాటిన 20, 25 రోజులకు యూరియా వేయాలి. లేదంటే నాటు పచ్చబడదు. పత్తికూడా పూత, కాత దశ లో ఉందన్నారు పత్తి మొక్కకు కొమ్మలు వచ్చే సమ యం ఇది. ఇటీవల వర్షాలు లేక పత్తి మొక్కలు వాడాయి. పత్తి మొక్కలకు కూడా కాంప్లెక్స్‌, యూరియా కలిపి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరణంలో 20 రోజులకు పైగా ఉమ్మడి జిల్లాల్లోని ఎరువుల దుకాణాల్లో యూరియా స్టాక్‌ లేదంటున్నారని మండిపడ్డారు. యూరియా అందరికీ అందేలా చూడాలని లేఖలో కోరారు.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష  టికెట్లు విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. tstet.cgg.gov.in వైబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబరు 9 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు ఐడీ, పుట్టినతేదీ వివరాలతో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే హెల్ప్‌ డెస్క్‌ 040-23120340, 040-23120433 నంబర్లను సంప్రదించవచ్చు. టెట్‌ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష ఉంటుంది. పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల కానున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు.

మొరాకోలో భారీ భూకంపం

ఆఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు కారణంగా 296 మంది మరణించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో భూమి మరోసారి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 11 నిమిషాలకు భూకంపం వచ్చినట్టు గుర్తించారు. మొరాకోలోని హై అట్లాస్ మౌంటెన్స్ ప్రాంతంలో భూమికి 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం మరాకేష్, మొరాకో దక్షిణ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మరణించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. 153 మంది గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించినట్టు వెల్లడించారు. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు కనిపిస్తున్నాయి. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశముందన్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపైనే ఉంటున్నారు.

కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం

ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామీణ కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 46 సవరణ చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. గత 70 రోజుల నుండి జీవో నెంబర్ 46 పై పోరాటం చేసామని తెలిపారు. ఇప్పుడైనా కరుణించి జీవో నెంబర్ 46 రద్దు చేయాలని గ్రామీణ కానిస్టేబుల్ అభ్యర్థులు కేసీఆర్ ను కోరారు. గ్రామీణ కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసన చేపట్టడంతో ఉస్మానియా యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022-23లో జీవో 46 కారణంగా గ్రామీణ ప్రాంతాల యువతకు, గ్రామీణ జిల్లాల నిరుద్యోగ పోలీసు అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. జియో నంబర్ 46 కారణంగా, పరీక్షలలో అర్హత సాధించిన గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో నియమితులైన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అనర్హులు అవుతారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53%, మిగతా 26 జిల్లాలకు 47% రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఇతర జిల్లాల గ్రామీణ అభ్యర్థులకు ఉద్యోగాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 130 మార్కులకు మించి వస్తే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి ఉందని, హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఇతర రూరల్ జిల్లాల్లో జీవిస్తున్నారని చెబుతున్నారు. అదే హైదరాబాద్ జిల్లాలో 80 (+) మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో TSSPలో 53% కోటా ప్రకారం 2000కు పైగా ఉద్యోగాలు ఉన్నాయని, పోస్టుల కేటాయింపులో గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తాజా రిక్రూట్‌మెంట్లలో జీఓ 46 నుంచి టీఎస్‌ఎస్పీ కానిస్టేబుళ్ల పోస్టులను మినహాయిస్తే 2016, 2018లో జరిగిన రిక్రూట్‌మెంట్ల తరహాలోనే రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

అవినీతికి పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు : బొత్స

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. అధికారులు చట్టబద్ధంగానే ముందుకు వెళ్లారని.. అక్రమంగా అరెస్టు చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయా..? అని ప్రశ్నించారు. కేసులో లోకేష్ పాత్ర కూడా ఉంటే ఆయన కూడా విచారణ ఎదుర్కొంటారని అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని అన్నారు మంత్రి బొత్స. అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తరువాతే చంద్రబాబుని అరెస్టు చేశారని తెలిపారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంతా చంద్రబాబు కుట్రేనని అన్నారు. ఈ స్కీం జీవో ఒకలా.. ఎంఓయు మరోలా ఉందన్నారు. ఇష్టానుసారం షెల్ కంపెనీలకు నిధులు మళ్ళించారని ఆరోపించారు.

 గవర్నర్‌ను కలిసిన డీకే అరుణ

హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ సీనియర్‌ నేత డీకే అరుణ. 2018 ఎన్నికల్లో గద్వాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన క్రిష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయన స్థానంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కొద్దిరోజుల క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ.. వారం, పది రోజులు అవుతున్నా హైకోర్టు తీర్పు అమల్లోకి రావడంలేదు. వాస్తవానికి.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన వెంటనే తీర్పు కాపీని తీసుకుని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు డీకే అరుణ. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. నిర్లక్ష్యం జరుగుతోందని గుర్తించిన డీకే అరుణ.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. దాంతో.. తక్షణమే క్రిష్ణమోహన్‌ను అనర్హుడిగా ప్రకటించి.. డీకె అరుణతో ప్రమాణ స్వీకారం చేయించాలని అసెంబ్లీ కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఆ లేఖను తీసుకుని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని కలవడంతో గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదేసమయంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ఆర్డర్ కాపీని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు డీకే అరుణ. అది జరిగి కూడా రెండు రోజులు గడుస్తున్నా.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపించారు డీకే అరుణ. తాజాగా.. గవర్నర్‌ తమిళిసైని కలిశారు డీకే అరుణ. ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ను గవర్నర్‌కు అందజేసి.. అసెంబ్లీ సెక్రటరీని కలిసేందుకు వెళ్తే ఆయన చాంబర్‌లో ఉండడం లేదని వివరించారు. ఇక.. ప్రమాణ స్వీకారానికి సమయం ఇప్పించాలని కోరగా.. గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు డీకే అరుణ.ఇక.. 2018లో జరిగిన ఎన్నికల అఫిడవిట్‌లో గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు పత్రాలు సమర్పించారంటూ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణల తర్వాత కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటేసింది హైకోర్టు. అయితే.. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్న చందంగా మారింది డీకే అరుణ పరిస్థితి. ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. దానిని అమలు చేయాల్సిన యంత్రాంగం తాత్సారం చేస్తుందని ఆరోపిస్తున్నారామె. ఇప్పుడు గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

మోడీ అమిత్‌ షాలకు కేశినేని నాని లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అంశంపై.. మోడీ, అమిత్‌ షాలకు కేశినేని నాని లేఖలు రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రానికి కేశినేని నాని లేఖలు రాశారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రికి విడివిడిగా కేశినేని నాని లేఖలు రాశారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని రక్షించాలని కోరారు.చంద్రబాబుపై రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని ఈ లేఖలో వివరించారు కేశినేని నాని. ఆధారాల్లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని… రాజకీయ కక్షతో ఈ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహించారు. ప్రజల్లో ఏపీ పోలీసులపై నమ్మకం పోయిందని.. అక్రమంగా జరిగిన చంద్రబాబు అరెస్ట్ వ్యవహరంలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేశినేని నాని కోరారు.

చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన సజ్జల

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసి విజయవాడకు తరలిస్తున్నారు సీఐడీ అధికారులు.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి దురుద్దేశాలు లేవు.. బలమైన ఆధారాలతోనే సిట్ వేశాం.. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉందన్నారు.. దర్యాప్తు సంస్థలు ఎంతో స్వేచ్చగా దర్యాప్తు చేస్తున్నాయన్న ఆయన.. స్వాతంత్ర్య భారత దేశంలో అత్యంత హేయమైనది ఆర్ధిక నేరం.. స్కీమ్‌ పేరుతో స్కామ్‌ చేశారని విమర్శించారు. ఆర్ధిక నేరాల్లో నోటీసు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు సజ్జల.. ఎఫ్ఐఆర్ లో పేరు లేదని చంద్రబాబు ఎవరిని దబాయిస్తున్నాడు? అని మండిపడ్డారు.. ఈ స్కామ్‌ లో చంద్రబాబు పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన విషయమేనన్న ఆయన.. వ్యక్తిగతం కక్ష సాధింపుకు వెళ్లని స్వభావం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిది అన్నారు.. దర్యాప్తులో తేలాలి రాజకీయ ప్రమేయం ఉండకూడదనే రెండేళ్లు ఆగారని.. దబాయించి బయట పడాలని చూస్తే ఇంకా సాధ్యం కాదని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

విశాఖలో గంటా శ్రీనివాసరావు అరెస్ట్ 

విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. ఈ మేరకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చారు దిశా ఏసీపీ వివేకానంద. గంటాను ఇంటి నుంచి బలవంతంగా తరలించిన పోలీసులు విజయవాడకు తరలించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా మాట్లాడుతూ… అమరావతి భూముల కేసులో నా పేరు చేర్చారని ఫైర్‌ అయ్యారు. ఎన్ని విచారణలు జరిగిన నా ప్రస్తావన రాలేదని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి హీట్ తగలడంతో నన్ను తెరపైకి తెచ్చారని ఆగ్రహించారు. ఏ కేసులకైనా నేను సిద్ధం .ఎదుర్కొవడానికి రెడీగా వున్నాను చంద్రబాబు అరెస్ట్ హేయమైన చర్య అన్నారు. అర్ధరాత్రి హైడ్రామా చేయాలిసిన అవసరం లేదని చురకలు అంటించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.

జీ20 డిన్నర్‌లో భారతీయ రుచులు

జీ20 సదస్సు వేదికగా దేశాధినేతలు, ఇతర ప్రతినిధుల కోసం శనివారం ఏర్పాటు చేయనున్న విందు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక వంటకాల జాబితాను సిద్ధం చేశారు. ఈ విందు కోసం తయారు చేయబడిన మెనూలో భారతదేశంలోని విశిష్ట వంటకాలు ఉన్నాయి. ఒక లగ్జరీ హోటల్ గ్రూప్ సీనియర్ మేనేజర్లు, సిబ్బంది రెండు రోజుల పాటు జరుగుతున్న సదస్సు కోసం భారత్ మండపంలో విందు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన ప్రత్యేక వెండి సామాగ్రిలో అధికారిక విందును ఏర్పాటు చేయనున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ఈ (వర్షాకాలం) సీజన్‌లో తినే వంటకాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. మెనూలో మిల్లెట్ ఆధారిత వంటకాలు కూడా ఉంటాయి. మెనూలో చేర్చబడిన వంటకాల గురించి అధికారులు ఖచ్చితమైన వివరాలు ఇవ్వలేదు. ఇది భారతీయ వంటకాల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని వారు భావిస్తున్నారు. శిఖరాగ్ర సదస్సు మొదటి రోజు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ముర్ము భారత్ మండపంలో ఘనంగా విందును ఏర్పాటు చేస్తారు. మెనూ వివరాలు పబ్లిక్‌గా లేవు. కానీ సదస్సుకు వచ్చిన దేశాధినేతలకు వడ్డించే భారతీయ వంటకాల రుచి.. వారికి చిరకాలం గుర్తుండిపోతుంది. గులాబ్ జామూన్, రస్మలై, జిలేబీ వంటి పలు రకాల స్వీట్లను అందించనున్నారు. వంటకాలను అందించే సిబ్బంది కూడా ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. మెనూలో భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన లేదు.