ఇప్పుడు తమిళంలో నటుడు యోగిబాబు లేని చిత్రం లేదు..! అన్నట్లు ఉంది అక్కడి పరిస్థితి! స్టార్ హీరోల చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటిస్తూనే మరో పక్క కథానాయకుడిగానూ నటిస్తున్నారు. అలా ఆయన హీరోగా నటించిన చిత్రాలు ఇటీవల వరుసగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవలే యోగిబాబు హీరోగా నటించిన లక్కీమెన్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బూమర్ యాంగిల్, హైకోర్ట్ మహారాజా, వానవన్, రాధామోహన్ దర్శకత్వంలో నటిస్తున్న చట్నీ సాంబార్ మొదలగు అరడజనుకు పైగా చిత్రాలు ఈయన చేతిలో ఉన్నాయి. తాజాగా యోగిబాబు కథానాయకుడిగా మరో నూతన చిత్రం మంగళవారం తెన్‌కాశీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీనికి ఆంధ్రా మెస్ జయ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని 23 ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత సంచయ్ రాఘవన్, రూక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మధు అలెగ్జెండర్ కలిసి నిర్మిస్తున్నారు. వైవిధ్యభరిత కథా కథనాలతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.
బిజీబిజీగా యోగిబాబు కెరీర్
Related tags :