Business

ఐటీ శాఖ కీలక సూచన

ఐటీ శాఖ కీలక సూచన

ఆదాయపు పన్ను రిఫండ్లకు సంబంధించి పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కీలక సూచన చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిఫండ్లు క్లియర్‌ అవ్వాలంటే అంతకుముందు సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్‌ డిమాండ్లకు సంబంధించి వచ్చిన ఇంటిమేషన్‌కు స్పందించాలని ఐటీ శాఖ సూచించింది. రిటర్నుల ప్రాసెసింగ్‌, రిఫండ్ల జారీకి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఐటీ శాఖ తనవంతు కృషి చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంది. ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. మునుపటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్‌సెటిల్డ్‌ ట్యాక్స్‌ డిమాండ్ల గురించి ఐటీ శాఖ నుంచి తమకు సమాచారం అందిందంటూ కొందరు సోషల్‌ మీడియా వేదిక పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఐటీ శాఖ స్పందించింది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 7.09 కోట్ల రిటర్నులు దాఖలవ్వగా.. అందులో 6.96 రిటర్నులు వెరిఫికేషన్‌ పూర్తయ్యాయని, 6.46 కోట్ల రిటర్నులు ప్రాసెస్‌ చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. 2.75 కోట్ల రిఫండ్‌ రిటర్నులు కూడా పూర్తి చేసినట్లు పేర్కొంది. కొంతమంది పన్ను చెల్లింపుదారుల విషయంలో ఇప్పటికీ ట్యాక్స్‌ డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. దీంతో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్‌ 245 (1) కింద పాత డిమాండ్లను ప్రస్తుత రిఫండ్లలో సర్దుబాటు చేసుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను అంగీకరించడమో, తిరస్కరించడమో, డిమాండ్‌ స్టేటస్‌ స్థితిని తెలియజేయడమో చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే పెండింగ్‌ డిమాండ్ల గురించి తెలియజేస్తున్నామని, ఆ డిమాండ్‌లను క్లీన్ చేయడం ద్వారా రిఫండ్లను త్వరగా పొందొచ్చని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు అటువంటి సూచనలకు ప్రతిస్పందించాలని ఐటీ శాఖ సూచించింది.