DailyDose

విశాఖలో అంతర్జాతీయ మాఫియా-నేరవార్తలు

విశాఖలో అంతర్జాతీయ మాఫియా-నేరవార్తలు

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో నాలాలో పడి మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి రామయ్య ఆలయం ఎదురుగా ఉన్న అన్నదానం సత్రం వద్ద మురుగు కాలువలో పడి హెడ్ కానిస్టేబుల్‌ శ్రీదేవి మృతి చెందారు. కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తోన్న శ్రీదేవి డ్యూటీలో భాగంగా భద్రాచలం వచ్చారు. విధులు పూర్తి అయిన తర్వాత భద్రాద్రి రామయ్యను దర్శించుకొని అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న నాలాలో పడిపోయారు. శనివారం భద్రాచలంలో వర్షం కురవడంతో నాలాలో భారీగా వరద నీరు చేరింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి కొద్దిదూరంలో ఉన్న కాలువలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

* ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వీటి కారణంగా శుక్రవారం ముగ్గురు మృతిచెందగా.. ఇతర ఘటనల్లో మరో ఇద్దరు మృతిచెందారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం గూడకు చెందిన యాసిం(38) భార్య అప్సానాతో కలిసి పొలం నుంచి ఇంటికెళ్లేందుకు ఎడ్లబండి కడుతుండగా పిడుగుపడింది. ఈ ఘటనలో యాసిం, జత ఎడ్లు అక్కడికక్కడే మృతిచెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. కుమురం భీం జిల్లా వాంకిడి మండలం కెడెగాంకు చెందిన భార్యాభర్తలు గెడాం పద్మ(22), టుల్లి పొలం పనుల్లో ఉండగా వర్షం పడటంతో చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో పద్మ అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త అస్వస్థతకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కౌలు రైతు రావుల రవీందర్‌(28) పత్తి చేనులో కలుపు తీస్తుండగా పిడుగుపడింది. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు-మొట్లగూడెం పంచాయతీ పరిధి బొమ్మాయిగూడెంకు చెందిన ఈసం పవన్‌కల్యాణ్‌(24) గురువారం రాత్రి తన మొక్కజొన్న పంటకు కాపలాగా వెళ్లారు. భారీ వర్షం పడటంతో ఇంటికి తిరిగెళ్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందారు.

* నల్గొండ జిల్లా మర్రిగూడ ఎంఆర్‌ఓగా విధులు నిర్వహిస్తోన్న మహేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయి నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు, బంగారాన్ని గుర్తించారు. ఆయన ఇంట్లో పెట్టెలో దాచి ఉంచిన సుమారు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎంఆర్‌ఓ మహేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

* నకిలీ స్థానిక ధ్రువపత్రాలతో అక్రమంగా ఎంబీబీఎస్‌ సీట్లు పొందిన ఏడుగురు విద్యార్థుల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు పోపులు సుబ్రహ్మణ్యసాయి తేజ, వానిపెంట సాయి ప్రీతికారెడ్డి, తమ్మినేని విష్ణుతేజారెడ్డి, తన్నీరు సంజయ్‌, అరికట్ల హనుమాన్‌రెడ్డి, టేకులపల్లి మహేశ్‌, గేర్లె భార్గవ్‌ ధర్మతేజ యశ్వంత్‌ నాయుడుతోపాటు ఈ దందాకు సూత్రధారి అయిన కన్సల్టెంట్‌ నిర్వాహకుడు కామిరెడ్డి నాగశ్వరరావుపై వరంగల్‌ మట్టెవాడ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 2023-24 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* సీఎం జగన్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల జిల్లా కొరిశపాడు, కారంచేడు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేయగా శుక్రవారం ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొరిశపాడు మండలం రావినూతలకు చెందిన పునాటి మురళీకృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. పది రోజుల క్రితం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్టులు పెట్టి అగౌరవపరిచారని మేదరమెట్లకు చెందిన వైకాపా సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నే వేణు కొరిశపాడు స్టేషన్‌లోనూ, కారంచేడు గ్రామానికి చెందిన వైకాపా నేత పాపారావు కారంచేడు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి మురళీకృష్ణను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

* విశాఖ నగరంలో భారీ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా పట్టుబడింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్‌ బెట్టింగ్‌ దందాను సైబర్‌ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్‌ చేస్తున్న కింగ్‌మోను అలియాస్‌ దినేష్‌, వాసుదేవ్‌, సూరిబాబులతో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనామక మొబైల్‌ అప్లికేషన్స్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహణ చేస్తున్నారు. కాగా ఒక్క కింగ్‌ మోను అకౌంట్స్‌ నుంచే రూ.145 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి నగదు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.